అడవి జీవులకూ వేడుక!

ఒకరోజు అడవిలో జంతువులన్నీ చెట్ల కింద విశ్రాంతి తీసుకుంటున్నాయి. ఇంతలో దూరం నుంచి పెద్దపెద్ద కేకలు, అరుపులు వినపడ్డాయి. అవేంటో జంతువులకు అర్థంకాక కంగారు పడిపోయాయి. ఇంతలో రెండు కోతి పిల్లలు ముందుకు వచ్చి.. మన అడవి పక్కన ఉన్న గ్రామం నుంచి అని చెప్పాయి.

Updated : 06 Nov 2022 05:15 IST

ఒకరోజు అడవిలో జంతువులన్నీ చెట్ల కింద విశ్రాంతి తీసుకుంటున్నాయి. ఇంతలో దూరం నుంచి పెద్దపెద్ద కేకలు, అరుపులు వినపడ్డాయి. అవేంటో జంతువులకు అర్థంకాక కంగారు పడిపోయాయి. ఇంతలో రెండు కోతి పిల్లలు ముందుకు వచ్చి.. మన అడవి పక్కన ఉన్న గ్రామం నుంచి అని చెప్పాయి. ‘అక్కడికి వెళ్లి మనమూ చూద్దాం’ అని ఆసక్తిగా అడిగాయి పిల్ల జంతువులు. దానికి పెద్ద జంతువులు.. ‘మనం అక్కడికి వెళితే ప్రమాదం.. ఎవరినైనా పంపించి విషయం తెలుసుకుందాం’ అన్నాయి. కాకులు, చిలుకలు, కోతులు వెళ్లటానికి సంసిద్ధత వ్యక్తం చేశాయి.

గ్రామం దిశగా కాకులు, చిలుకలు ఆకాశంలో ఎగరగా... కోతులు చెట్ల పైనుంచి దూకుతూ బయలుదేరాయి. అక్కడికి వెళ్లిన వాటికి, ఆ ప్రదేశం చాలా సందడిగా కనిపించింది. విశాలమైన ఆ ప్రదేశం గ్రామస్థులతో నిండిపోయింది. పిల్లలు ఉత్సాహంగా ఆడుకుంటున్నారు. పెద్దలు కూడా ఒకచోట కూర్చొని మాట్లాడుకుంటున్నారు. కొందరు మహిళలు ఆటలపోటీల్లో ఉండగా, మరికొందరేమో వంటలు సిద్ధం చేస్తున్నారు. కోతులకు కూడా వారితో సరదాగా గడపాలని అనిపించింది. పక్షులు వారించి.. మనం ఎందుకొచ్చామో మర్చిపోకండని హెచ్చరించాయి. పిల్ల కోతులను చూసి.. అక్కడే ఆడుకుంటున్న పిల్లలు దగ్గరకు వచ్చారు. కోతులు వారితో ‘మీరేంటి.. ఇక్కడ ఏం చేస్తున్నారు? ఆ వంటలేంటి? ఆటలేంటి?’ అని ప్రశ్నించాయి. దానికి పిల్లలు.. ‘ఎన్ని పనులున్నా ప్రతి ఆదివారం గ్రామస్థులంతా ఇక్కడ కలవాలని నిర్ణయించుకున్నాం. సోమవారం నుంచి శనివారం వరకు వివిధ పనులతో క్షణం తీరిక లేకుండా గడిపే పెద్దలకే కాదు... మాలాంటి పిల్లలకు కూడా ఇది ఆటవిడుపే. ఆదివారం పాఠశాలలకు సెలవు. మేమంతా ఇక్కడకు వచ్చి ఆటలు ఆడుకుంటాం. పాటలు పాడుతాం.. కలిసి భోజనం చేస్తాం’ అని చెప్పి వెళ్లిపోయారు.

కాకులు, చిలుకలు, కోతులకు కూడా గ్రామస్థుల మాదిరి సరదాగా గడపాలని అనిపించింది. వెంటనే అడవికి చేరుకున్నాయి. చూసింది చూసినట్లుగా పెద్ద జంతువులకు వివరించాయి. అవి కూడా ఆదివారం సరదాగా గడపాలని భావించాయి. జంతువులన్నీ ముక్తకంఠంతో ‘సరదాల వారం.. ఆదివారం’, ‘పిల్ల జంతువులకు ఆటవిడుపు కావాలి’, ‘జంతువుల ఐక్యత వర్ధిల్లాలి’ అని నినాదాలు చేస్తూ మృగరాజు వద్దకు చేరుకున్నాయి. సింహాన్ని చూడగానే ఏ ఒక్క జీవి నోరూ పెగల్లేదు. మూకుమ్మడిగా వచ్చిన జంతువులను చూసి కారణం అడిగింది సింహం. కాకులు, చిలుకలు, కోతులు ముందుకు వచ్చి.. పక్క గ్రామంలోని ప్రజలు తీసుకున్న నిర్ణయాన్ని వివరించాయి. అలాగే ఆదివారం వారంతా ఒకచోట చేరి ఆడుకోవటం, సరదాగా గడపటం నచ్చాయని చెప్పాయి.

దానికి సింహం ‘నేనేం చేయాలి?’ అని ప్రశ్నించింది. పెద్ద జంతువులు ధైర్యంగా ముందుకు వచ్చి.. ‘మృగరాజా! మీరు అంగీకరిస్తే ప్రతి ఆదివారం ఈ అడవిలో అందరం ఒకచోట కలుసుకుంటాం’ అన్నాయి. ‘కలుసుకొని ఏం చేస్తారు?’ అని ప్రశ్నించింది సింహం.  ‘సరదాగా ఆడుకుంటాం.. కలసి వంట చేసుకొని తింటాం’ అని సమాధానమిచ్చాయవి. ‘ఎవరెవరు?’ అడిగింది సింహం. ‘మేమంతా మృగరాజా..’ బదులిచ్చాయి జంతువులు. ‘మీరు అంటున్నారు.. మరి నేను..?’ మళ్లీ ప్రశ్నించింది సింహం. జంతువులకు ఏం జవాబు చెప్పాలో తెలియక మిన్నకున్నాయి. సింహం మాట్లాడుతూ.. ‘నేను మృగరాజునైనా మీలో ఒకడినే. మీరు లేకుంటే నేను లేను..

ఈ పదవి లేదు. మీ కష్టాల్లో పాలుపంచుకున్న నాకు మీ సంతోషాల్లో కూడా కాస్త చోటివ్వండి’ అంది. సింహం మాటలకు జంతువులన్నీ ఆనందంతో గంతులు వేశాయి. మృగరాజుకు జేజేలు పలికాయి. ‘ప్రతి ఆదివారం అందరం చెరువు ఒడ్డున కలుసుకుందాం... సరదాగా గడుపుదాం... ఆడుకుందాం, పాడుకుందాం.. సేకరించిన ఆహారాన్ని కలసికట్టుగా తిందాం’ అని తీర్మానించింది. సింహం మాటలతో ‘ఆదివారం ఎప్పుడొస్తుందా..’ అని జంతువులు ఎదురుచూడసాగాయి.

- తమ్మవరపు వెంకట సాయి సుచిత్ర


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని