వెక్కిరించాయి.. బాధపడ్డాయి!

ఒక అడవిలో జింక, నెమలి, రామచిలుక చాలా స్నేహంగా ఉండేవి. అవి తమను మించిన అందం మరే జీవికి లేదని గర్వపడేవి. భగవంతుడు తమను ప్రత్యేకంగా సృష్టించాడని గొప్పలు కూడా చెప్పుకొనేవి. ఏ జంతువు తారసపడినా తమ అందం గురించే వివరించేవి.

Updated : 02 Dec 2022 04:00 IST

ఒక అడవిలో జింక, నెమలి, రామచిలుక చాలా స్నేహంగా ఉండేవి. అవి తమను మించిన అందం మరే జీవికి లేదని గర్వపడేవి. భగవంతుడు తమను ప్రత్యేకంగా సృష్టించాడని గొప్పలు కూడా చెప్పుకొనేవి. ఏ జంతువు తారసపడినా తమ అందం గురించే వివరించేవి. ఎక్కడికెళ్లినా ఆ మూడే కలిసి వెళ్లేవి. ఇతర జంతువులతో అంటీముట్టనట్లే వ్యవహరించేవి. ఒకరోజు ఎక్కడి నుంచో కాకి, కోకిల, ఎలుగుబంటి అడవిలోకి వచ్చాయి. వాటికి ఆ అడవి నచ్చడంతో అక్కడే ఉండాలని అనుకున్నాయి. పరిసరాలు మొత్తం గమనించి.. నివాసాలూ ఏర్పరచుకున్నాయి.

ఒకరోజు కాకి, కోకిల, ఎలుగుబంటి అడవిలో తిరుగుతుంటే.. వాటికి నెమలి, రామచిలుక, జింక ఎదురుపడ్డాయి. కాకి, కోకిల, ఎలుగుబంటిని చూడగానే ఆ మూడూ నవ్వసాగాయి. అవి ఎందుకు నవ్వుతున్నాయో వాటికి అర్థం కాలేదు. ఒకరి ముఖం ఒకరు చూసుకొని.. ‘మమ్మల్ని చూసి ఎందుకు నవ్వుతున్నారు?’ అని ప్రశ్నించాయి. ఆ మాటలకు అవి ఇంకా నవ్వసాగాయి. ఇంతలో కాకి కోపంతో.. ‘ఏ కారణం లేకుండా నవ్వేవారిని పిచ్చివాళ్లు అంటారు. ముందు మీరు ఎందుకు నవ్వుతున్నారో చెప్పండి’ అని అంది. ఇంతలో నెమలి వాటిని ఉద్దేశించి.. ‘మీ ముగ్గురు ఎలా స్నేహితులు అయ్యారు? ఓహో... నలుపు రంగు మిమ్మల్ని కలిపిందా? ఎవరైనా మీ ముగ్గురిని చీకటిలోనే కాదు పగలు చూడాలన్నా భయపడతారు’ అని వెక్కిరించింది.

దానికి కోకిల స్పందిస్తూ.. ‘భగవంతుడు మమ్మల్ని ఇలా పుట్టించాడు. ఇందులో మా తప్పేముంది? అయినా మీకు మా రంగుతో ఏం పని?’ అని గట్టిగా నిలదీసింది. దానికి జింక.. ‘నా చర్మం మీద అక్కడక్కడా తెల్లగా, గుండ్రంగా, అందంగా ఉన్న చుక్కలను చూస్తున్నారా! ఆకాశంలోని నక్షత్రాలన్నీ నా మీద సేద తీరినట్టుగా లేదూ..! అవి నా అందాన్ని రెట్టింపు చేస్తున్నాయి’ అంది. ఆ మాటలను సమర్థిస్తూ మిగతా రెండూ.. ‘అందం గురించి నల్లగా ఉన్న వాటికి చెప్పటం దండగ’ అన్నాయి. నెమలి, రామచిలుక మాట్లాడుతూ.. ‘ఇంద్రధనుస్సులోని రంగులు ఎక్కడో లేవు.. మా శరీరం మీదే ఉన్నాయి’ అంటూ రామచిలుక దొండపండులాంటి తన ముక్కును, ఆకుపచ్చని మేని రంగును వయ్యారంగా చూపించింది. నెమలి కూడా పురి విప్పితే తను ఎంత అందంగా ఉంటుందో చూపించింది. దాంతో కాకి, కోకిల, ఎలుగుబంటి మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాయి.

ఒకసారి అడవిలో నృత్య పోటీలు జరుగుతున్నాయి. నెమలి బాగా నాట్యం చేస్తుంది. మిగతా జంతువులు, పక్షులు మైమరచి చూస్తున్నాయి. ఇంతలో వెనక నుంచి ఒక జంతువు.. ‘ఎప్పుడూ నాట్యంతో సరిపెట్టడమేనా! పాట పాడటం ఏమన్నా ఉందా!’ అంది. ఆ మాటకు నెమలి సిగ్గుతో తల దించుకుంది. ఇంతలో కోకిల పాట అందుకుంది. తన నాట్యానికి కోకిల గొంతు తోడవడంతో నెమలిని అందరూ మెచ్చుకున్నారు. ప్రదర్శన ముగిసిన తర్వాత.. నెమలి కోకిల వద్దకు వెళ్లి ‘నీ పాటతో నా నాట్యాన్ని అందరూ చూసేలా చేశావు. అసలు ఆ అభినందనలన్నీ నీకే దక్కాలి’ అంది. దానికి కోకిల.. ‘మనదంతా పక్షి జాతి. ఒకరిని ఒకరం గౌరవించుకోవాలి. రంగు చూసి దూరం పెట్టొద్దు’ అని హితబోధ చేసింది.

మరోరోజు రామచిలుక చెట్టు మీద పండు తినసాగింది. తిండి ధ్యాసలో పడి అది పరిసరాలను మర్చిపోయింది. అదే సమయంలో దూరం నుంచి ఓ వేటగాడు బాణాన్ని చిలుక వైపు గురిపెట్టాడు. అది గమనించిన కాకి.. కావ్‌ కావ్‌ అంటూ గట్టిగా అరవసాగింది. చిలుక తలెత్తి చూసింది. వేటగాడిని గమనించి.. క్షణాల్లో తప్పించుకుంది. ‘నీవల్ల నాకు ప్రాణాపాయం తప్పింది. నీ మేలు మర్చిపోలేను. నువ్వు నల్లగా ఉన్నావని హేళన చేసినందుకు నన్ను క్షమించు’ అని కోరింది. ఇంకోరోజు ఒంటరిగా కనిపించిన జింకను సింహం వేటాడసాగింది. తప్పించుకునేందుకు జింక దిక్కులు చూడసాగింది. అదే సమయంలో చెట్టుపై ఉన్న ఎలుగుబంటి అది గమనించింది. జింక చెట్టు వద్దకు రాగానే..  తన రెండు చేతులతో గట్టిగా పట్టుకుని పైకి లాగింది. నోటి దగ్గర ఆహారం చెట్టు పైకి చేరడంతో సింహం కోపంతో గర్జించింది. చెట్టు ఎక్కలేక.. ఇక జింక దక్కదనుకొని అక్కడ నుంచి వెళ్లిపోయింది.

అప్పుడు జింక.. ఎలుగుబంటితో ‘దేవుడు నన్ను అందంగా పుట్టించినా.. నా ప్రాణాలను కాపాడే అవకాశం నీకిచ్చాడు. గతంలో నా అందాన్ని చూసి మిడిసిపడ్డాను. ఇప్పుడు నీ ముందు సిగ్గుతో తలదించుకుంటున్నా.. క్షమించు’ అంది. ఇంతలో నెమలి, రామచిలుక, కాకి, కోకిల అక్కడకు చేరుకున్నాయి. నెమలి, రామచిలుక మిగతా వాటిని ఉద్దేశించి.. ‘మేము పైకి మాత్రమే అందంగా కనపడతాం. కానీ, మీరు మంచి మనసున్న వారు. బాహ్య సౌందర్యం కంటే అంతఃసౌందర్యమే ఉత్తమమైందని మీరు నిరూపించారు’ అని సిగ్గుతో తలదించుకున్నాయి. ‘మిత్రులారా.. ఇప్పటికైనా పొరపాటు తెలుసుకున్నారు.. అది చాలు. మనలో మనకు క్షమాపణలు అవసరం లేదు’ అని దగ్గరకు చేరాయి. అప్పటి నుంచి ఆ ఆరు జీవులు కలిసిమెలసి స్నేహంగా జీవించసాగాయి.

- తమ్మవరపు వెంకట సాయి సుచిత్ర


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని