సింహం గెలిచిందా.. ఏనుగు నిలిచిందా!

ఎన్నికలు... ఎన్నికలు.. అడవిలో ఏ రెండు జంతువులు, పక్షులు తారసపడినా ఇదే మాట. అడవికి రాజు అయ్యేందుకు మృగరాజు, ఏనుగు బరిలో నిలిచాయి. రెండూ పోటాపోటీగా ప్రచారం నిర్వహించసాగాయి.

Updated : 09 Dec 2022 05:20 IST

ఎన్నికలు... ఎన్నికలు.. అడవిలో ఏ రెండు జంతువులు, పక్షులు తారసపడినా ఇదే మాట. అడవికి రాజు అయ్యేందుకు మృగరాజు, ఏనుగు బరిలో నిలిచాయి. రెండూ పోటాపోటీగా ప్రచారం నిర్వహించసాగాయి. అడవి జీవులన్నీ రెండు వర్గాలుగా ఏర్పడ్డాయి. కొన్ని జంతువులు, పక్షులు సింహానికి మద్దతు తెలపగా, మరికొన్ని ఏనుగును సమర్థించాయి. ప్రచారంలో రెండు వర్గాలు దూసుకుపోతున్నాయి. చెట్ల ఆకులను సేకరించి మెత్తగా నూరి రసాన్ని తయారుచేశాయి. దాంతో చెట్ల కాండాలపై సింహాన్ని గెలిపించాలని ఒక వర్గం, ఏనుగును ఆశీర్వదించాలని మరో వర్గం రాతలు రాశాయి. అనంతరం రెండు వర్గాలు పొడుగాటి సన్నటి కర్రలు సేకరించాయి. ఆ తర్వాత సమీపంలోని చెరువులో దిగి, పెద్దపెద్ద తామరాకులు తెచ్చాయి. వాటి మీద మృగరాజు వర్గం ‘సింహాన్ని గెలిపించాలి... సింహం నాయకత్వం వర్ధిల్లాలి’, ‘సింహాన్ని గెలిపిస్తేనే అడవి అభివృద్ధి’ అనీ.. ప్రత్యర్థి గజరాజు వర్గం జీవులు సైతం తామరాకుల మీద ‘ఏనుగును గెలిపిస్తేనే అభివృద్ధికి చోటు.. సింహం గెలిస్తే అడవికి చేటు’ అంటూ నినాదాలు రాశాయి. ఆ తామరాకులను కర్రలకు కట్టి.. అడవిలో జంతువులు తిరిగే ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేశాయి.

సింహం, ఏనుగు తమనే గెలిపించాలంటూ ప్రతి జంతువునూ కలిసి అభ్యర్థిస్తున్నాయి. రేసులో ఉన్న ఆ రెండూ.. జంతువులనే కాదు పక్షులనూ వదలటం లేదు. కింద నుంచే చెట్లపై ఉన్న వాటిని పలకరిస్తూ.. తమకే ఓటు వేసి గెలిపించాలని వేడుకుంటున్నాయి. సింహం వర్గం ఓ అడుగు ముందుకు వేసి.. అవి వేటాడిన మాంసాన్ని జంతువులకు అందజేస్తూ మచ్చిక చేసుకోసాగాయి. ఏనుగు వర్గం తాము కూడా తక్కువేం కాదని.. చెట్ల ఆకులు, దుంపలు, పండ్లు సేకరించి శాకాహార జంతువులు, పక్షులకు అందజేస్తూ ప్రసన్నం చేసుకోసాగాయి. మొత్తం మీద సింహం, ఏనుగు అడవిని తామే పాలించాలని శతవిధాలా ప్రయత్నాలు చేయసాగాయి. ఈ ఎన్నికల పుణ్యమాని.. అడవి జంతువులకు ఆహార సేకరణ పని తప్పింది. పోటీలో నిలిచినవే మూడు పూటలా ఆహారం పంపసాగాయి. ఆఖరికి చెరువు నుంచి తాగునీరు కూడా పంపిణీ చేసేవి.  

సింహం, ఏనుగు పోటాపోటీగా బహిరంగ సభలు కూడా ఏర్పాటు చేశాయి. సింహం మాట్లాడుతూ.. తనను గెలిపిస్తే జంతువులు, పక్షులను కన్నబిడ్డల్లా చూస్తాననీ, వర్షాకాలంలో అవస్థ పడకుండా చెట్లను నరికి ఉచితంగా అన్నింటికీ ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చింది. దీనికి జంతువుల నుంచి మంచి స్పందన వచ్చింది. మరుసటి రోజు సభలో ఏనుగు మాట్లాడుతూ.. తనను గెలిపిస్తే ఇంటితోపాటు ఉచితంగా ఆహారం అందజేస్తామని హామీ ఇచ్చింది. అడవిలో చెట్లు తొలగించి రహదారులు వేయిస్తానని ప్రకటించింది. రెండు వర్గాల సభ విజయవంతం కావటంతో ఎవరికి వారు తమదే గెలుపని ఊహించుకోసాగారు. ఎన్నికల రోజు రానే వచ్చింది. జంతువులు, పక్షులు ఓటు వేసేందుకు బారులు తీరాయి. బరిలో ఉన్న ప్రధాన అభ్యర్థులు సింహం, ఏనుగు వేదిక మీద దూరంగా కూర్చున్నాయి. ఇంతలో వాటికి ఒక అనుమానం వచ్చింది. ‘ఎన్నిక సక్రమంగా జరిగేలా చూడటానికి, గెలిచిన అభ్యర్థిని విజేతగా ప్రకటించడానికి ఒక వ్యక్తి కావాలి. ఎవరున్నారు?’ అని ఆలోచించాయి. ఇంతలో వాటికి సమీపంలో ఉన్న ఆశ్రమం గుర్తుకొచ్చింది.
ఎలుగుబంటిని ఆశ్రమానికి పంపి, మునీశ్వరుడిని తీసుకురమ్మని చెప్పాయి. ముని రాగానే సింహం, ఏనుగు లేచి నిలబడి నమస్కరించాయి. ఎన్నిక అనంతరం విజేతను ప్రకటించాలని కోరాయి. మునీశ్వరుడు సరేనంటూ.. అంతకుముందుగా తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలన్నారు. అందుకు సింహం, ఏనుగు అంగీకరించాయి. ముని ముందుగా.. వరసలో నిలబడిన జంతువులు, పక్షులను దగ్గరకు రమ్మని పిలిచారు. అవన్నీ రాగానే.. ‘మీకు ఎన్నికలు కావాలా?’ అని ప్రశ్నించారు. ఆ మాటకు సింహం, ఏనుగు ఆశ్చర్యపోయాయి. మళ్లీ ముని మాట్లాడుతూ.. ‘ఉచిత హామీలు మంచి పద్ధతి కాదు. అవి పని చేసుకునే జంతువులు, పక్షులను సోమరులను చేస్తున్నాయి. అసలు మీకు ఎన్నికలెందుకు? అడవి మీది.. అడవిలోని సంపద, ఆహారం మీది. మీకు మీరు సంపాదించుకొని తినేందుకు ఎన్నికలు కావాలా.. ఈ ఎన్నిక కారణంగా అడవి జంతువులు రెండు వర్గాలుగా ఏర్పడ్డాయి. దీనికి బాధ్యులు ఎవరు?’ అని ప్రశ్నించారు. జీవులన్నీ ఒకదాని ముఖం మరొకటి చూసుకున్నాయి.

ముని మాటలు కొనసాగిస్తూ.. ‘ఇప్పుడు ఎన్నికల కారణంగా రెండు వర్గాలుగా విడిపోయిన మీరు భవిష్యత్తులో మళ్లీ కలవగలరా? ఒకసారి ఆలోచించండి’ అన్నారు. ఆ మాటలకు జంతువులు, పక్షులన్నీ ఆలోచనలో పడ్డాయి. ‘మీకు ఇళ్లు అవసరమా.. ఇంతకాలం ఎలా జీవించారు? ఇల్లు కట్టాలంటే కలప కావాలి. కలప కావాలంటే చెట్లను నరకాలి. చెట్లను నరికితే మీ మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది. ఇప్పుడు వేటగాళ్లు అడవిలోకి వస్తే మీరు చెట్ల చాటునో... కొమ్మల మాటునో దాక్కునే వారు. ఇప్పుడా చెట్లనే నరికేస్తే మీరు వేటగాళ్లకు సులభంగా ఆహారం అవుతారు’ అన్నారు ముని. దాంతో జీవులకు జ్ఞానోదయమైంది. ఒకే గొంతుకతో ‘మేమంతా ఒక్కటే... మాకు ఎన్నిక వద్దు’ అని నినదించాయి. సింహం, ఏనుగు కూడా తమ తప్పు తెలుసుకున్నాయి.  

తమ్మవరపు వెంకట సాయి సుచిత్ర


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు