వింత పుష్పం!

కళింగ దేశాన్ని చంద్రశేఖరుడు పాలించేవాడు. అతని కుమార్తె ప్రభావతి. ఆమెకు స్వయంవరం ఏర్పాటు చేయాలనుకున్నాడు. మంత్రి సుశర్మతో సంప్రదింపులు జరిపి పలు రాజ్యాలకు చెందిన యువరాజులు పాల్గొనాల్సిందిగా లేఖలు పంపమన్నాడు.

Updated : 18 May 2023 04:36 IST

ళింగ దేశాన్ని చంద్రశేఖరుడు పాలించేవాడు. అతని కుమార్తె ప్రభావతి. ఆమెకు స్వయంవరం ఏర్పాటు చేయాలనుకున్నాడు. మంత్రి సుశర్మతో సంప్రదింపులు జరిపి పలు రాజ్యాలకు చెందిన యువరాజులు పాల్గొనాల్సిందిగా లేఖలు పంపమన్నాడు. పోటీలో దాదాపు పాతిక దేశాలకు సంబంధించిన యువరాజులు పాల్గొన్నారు. అన్ని పోటీల్లో గెలిచి చివరకు విజయుడు, జయంతుడు, విక్రముడు అనే ముగ్గురు యువరాజులు మిగిలారు. ‘మీకు ఇదే చివరి పరీక్ష.. తూర్పు వైపు వెళ్లి ఏడు మట్టి దిబ్బలను దాటాలి. తర్వాత ఒక పర్వతం వస్తుంది. దాని మీద చిన్న పూలతోట ఉంది. ఆ పూల మొక్కలలో... ఒక మొక్కకు సువాసనలు వెదజల్లుతూ వెలుగును ఇచ్చే ఒక వింత పుష్పం ఉంటుంది. దాన్ని ఎవరైతే తెస్తారో వారితోనే యువరాణి వివాహం జరుగుతుంది. మీకు దారిలో ఆహారంతో పాటు మీ గుర్రాలకు దాణా, విశ్రాంతి కోసం విడిది ఏయే గ్రామాల్లో ఏర్పాటు చేశామో మొదలైన వివరాలు ఈ లేఖల్లో ఉన్నాయి’ అని వాటిని ఆ ముగ్గురు యువరాజులకు అందించాడు మంత్రి.

ముగ్గురు యువరాజులూ బయలుదేరి వెళ్లారు. ఎలాగోలాగా జయంతుడు, విక్రముడు మూడు మట్టి దిబ్బలను చేరుకున్నారు. ఆపైన వారి శక్తి చాలలేదు. ‘ఇక మా వల్ల కాదు. విశ్రాంతి తీసుకుని మా రాజ్యాలకు వెళ్లిపోతాం’ అని విజయుడితో చెప్పారు. ‘మంచిది మిత్రులారా క్షేమంగా వెళ్లండి... మీ ఇద్దరినీ త్వరలోనే కలుస్తాను’ అని గుర్రం పైన ముందుకు కదిలాడు విజయుడు. ఏడు మట్టిదిబ్బలు దాటిన తర్వాత అలసిపోయిన గుర్రాన్ని వదిలేశాడు. ‘ఇక్కడ ఆహారం తిని విశ్రాంతి తీసుకో’ అని గుర్రానికి చెప్పి తనకు కావాల్సిన వస్తువులు తీసుకుని పర్వతం ఎక్కసాగాడు. విజయుడికి ఆ పర్వతం ఎక్కడం చాలా కష్టమైంది. అష్ట కష్టాలు పడి, చివరకు ఆ పర్వతం పైకి చేరుకున్నాడు.

అక్కడ అనేక మొక్కలకు పుష్పాలున్నా, ఒక మొక్కకు మాత్రమే సువాసనలు వెదజల్లుతూ వెలుగును ఇచ్చే వింత పుష్పం ఒక్కటే కనిపించింది. ఆ మొక్కకు వందనం చేసి, ఆ పుష్పాన్ని కోసి వెంట తెచ్చిన వెదురు బుట్టలో పెట్టుకొని, పర్వతం దిగి వచ్చిన తోవలో కాకుండా మారో మార్గం గుండా గుర్రంపై వెనుదిరిగాడు. విజయుడు ఒక వేళ పుష్పం సాధిస్తే, అతడిని చంపి దాన్ని కాజేయాలని జయంతుడు, విక్రముడు ఎవరికి వారే అనుకొని, అతని కోసం కాపు కాయసాగారు. విజయుడు అలసటతో గుర్రం దిగి దాన్ని మేత కోసం వదిలేసి ఒక రావి చెట్టు కింద కూర్చున్నాడు. ఆ చెట్టు పైన రెండు చిలుకలు మాట్లాడుకోసాగాయి.

‘ఈ యువరాజు తెలివిగా ఆ ఇద్దరు యువరాజులు ఉన్న వైపు వెళ్లకుండా వేరే దారిలో ఇక్కడకు వచ్చాడు. అక్కడ వారు ఇతణ్ని మట్టుపెట్టి... వింత పుష్పాన్ని కాజేయాలని అనుకున్నారు’ అంది ఒక చిలుక. ‘అది సరే కానీ ఒకటి చెప్పు. ఇతను ఆ పుష్పాన్ని మన సైనిక గ్రామంలో ఉన్న వైద్యుడికి ఇస్తే వందల కొద్దీ మతిస్థిమితం కోల్పోయిన సైనికులు పూర్తిగా కోలుకుంటారు కదా’ అంది రెండో చిలుక. నీ పిచ్చిగాని యువరాణిని చేపట్టడానికి వేరే దేశం నుంచి వచ్చి.. అంత కష్టపడి తెచ్చిన పుష్పాన్ని ఈ దేశంలోని సైనికుల కోసం ఎందుకు త్యాగం చేస్తాడు. యువరాణిని చేపట్టాక ఈ రాజ్యం కూడా అతనిదే కదా, కొత్త సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటాడు’ అంది మొదటి చిలుక.

‘అవును అంతేలే’ అని అంది రెండో చిలుక. విజయుడు బాగా ఆలోచించి ఆ సైనిక గ్రామాన్ని చేరుకుని అక్కడ వైద్యుణ్ని కలిసి వివరాలు అడిగాడు. ‘నాయనా! ఈ గ్రామం సైనికుల కోసం ఏర్పడింది. వీరు ఈ దేశం కోసం ఇతర దేశాల సైన్యంతో వీరోచితంగా పోరాడి ఎన్నో విజయాలకు కారణం అయ్యారు. ఒకసారి యుద్ధ సమయంలో వీరి కోసం వండిన వంటలో ఒక విషపు పురుగు పడి చనిపోయింది. అది తిన్న వారికి వాంతులు అయ్యాయి. ప్రాణ గండం నుంచి బయట పడ్డారు, కానీ మతిస్థిమితం కోల్పోయారు. ఆయుర్వేదంలో వింత పుష్పం గురించి ఉంది. దాన్ని తెచ్చి ఔషధం తయారీలో వాడితే ఆ సైనికులంతా కొన్ని రోజుల్లోనే కోలుకుంటారు. కానీ ఆ పుష్పం తెచ్చిచ్చిన వారికి యువరాణిని ఇచ్చి వివాహం చేస్తానన్నాడు మహారాజు’ అని వివరించాడు వైద్యుడు.  

‘అయ్యో.. అలా జరిగిందా?’ అన్నాడు విజయుడు. ‘ఇన్ని వివరాలు అడుగుతున్నారు. ఇంతకూ మీరు ఎవరు?’ అన్నాడు వైద్యుడు. ‘నా పేరు విజయుడు. స్వయంవరం కోసం పల్లవ దేశం నుంచి వచ్చాను. అని వెదురు బుట్టలో నుంచి ఆ పుష్పాన్ని తీసి వైద్యుడికి చూపించి, ఇదేనా ఆ వింత పుష్పం’ అని అడిగాడు. ‘అవును’ అన్నాడు వైద్యుడు. ‘మీరు వెళ్లి ఔషధం తయారు చేసి తీసుకురండి’ అని చెప్పాడు విజయుడు. వైద్యుడు కాసేపట్లో ఔషధాన్ని తయారు చేసి తెచ్చాడు. వైద్యుడి సూచనల మేరకు విజయుడు ఆ వింత పుష్పాన్ని బాగా నలిపి ముద్దగా చేసి ఆ ఔషధంలో కలిపాడు. అది బంగారు రంగులోకి మారింది. ‘ఈ ఔషధంతో మీ సైనికులు పూర్తిగా కోలుకోవాలని ఆశిస్తున్నాను. ఇక వెళ్లి వస్తాను’ అని విజయుడు, వైద్యుడికి చెప్పి తన రాజ్యానికి బయలుదేరాడు.

ఎంతకీ రాకపోవడంతో విజయుడు మరణించి ఉంటాడు అనుకుని జయంతుడు, విక్రముడు వారి వారి రాజ్యాలకు తిరుగు ప్రయాణం అయ్యారు. వెళ్లిన ముగ్గురు యువరాజులూ తిరిగి రాకపోయేసరికి చంద్రశేఖరుడు కూడా విస్మయం చెందాడు. సైనిక గ్రామంలో, సైనికులంతా పూర్తిగా కోలుకున్నాక వైద్యుడు, మహారాజు దగ్గరకు వెళ్లి జరిగింది చెప్పాడు. చంద్రశేఖరుడు, ప్రభావతి, సుశర్మ.. పల్లవ రాజ్యానికి వెళ్లి మహారాజు శూరవర్మను కలసి విజయుడు చేసిన మంచి పనిని మెచ్చుకున్నారు. తన కుమార్తెను కోడలుగా చేసుకోమని చంద్రశేఖరుడు, శూరవర్మను అడిగాడు.

శూరవర్మ తన కొడుకైన విజయుణ్ని పిలిపించాడు. ‘యువరాజా! నా స్వార్థం కోసం ఆరు నెలలు సువాసనలు వెదజల్లుతూ వెలుగును ఇచ్చే పుష్పం కావాలని మా తండ్రిగారిని అడిగాను.. మీరు నిస్వార్థంగా ఆ పుష్పాన్ని మా రాజ్యంలోని సైనికుల కోసం వినియోగించారు. మీకు అంగీకారం అయితే నేను తమరిని వివాహం చేసుకుంటాను’ అని అంది ప్రభావతి. ‘అవును విజయా! నీలాంటి వాడు నాకు అల్లుడిగా వస్తే... నా రాజ్యంలోని ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది’ అన్నాడు చంద్రశేఖరుడు. విజయుడు అంగీకరించాడు. కొన్ని రోజుల్లోనే ప్రభావతితో విజయుడి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఆ వివాహానికి సైనిక గ్రామం నుంచి వైద్యుడితో పాటు, పూర్తిగా కోలుకున్న సైనికులు కూడా వచ్చి వారిని ఆశీర్వదించారు.

 యు.విజయశేఖర రెడ్డి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని