దాగుడుమూతల దండాకోర్‌!

ఇసుకలో కలిసిపోతుందొకటి... పరిసరాల రంగులోకి మారిపోతుంది మరొకటి.... పువ్వులో పువ్వయిపోతుంది ఇంకోటి... ఇవ్వన్నీ రూపులు మార్చే వింత జీవులు... మరి వాటి కబుర్లేంటో తెలుసుకోకపోతే ఎలా?

Published : 05 Jun 2019 00:12 IST

ఇసుకలో కలిసిపోతుందొకటి... పరిసరాల రంగులోకి మారిపోతుంది మరొకటి.... పువ్వులో పువ్వయిపోతుంది ఇంకోటి... ఇవ్వన్నీ రూపులు మార్చే వింత జీవులు... మరి వాటి కబుర్లేంటో తెలుసుకోకపోతే ఎలా?

ఉన్నచోటులా! 

రంగులు మార్చేది ఊసరవెల్లినే అనుకుంటాం మనమంతా. సముద్రాల్లో తిరుగుతూ పరిసరాలకు తగ్గట్టు రంగులు మార్చుకుంటుంది ఓ చేప. పేరు ఫ్లాట్‌ఫిష్‌. చదునైన దీని ఆకారం వల్లే ఆ పేరు. ఇది భలేగా ఇసుకపై తిరుగుతూ ఉంటే ఇసుక రంగులోకి వచ్చేస్తుంది. రాళ్ల మీదకు చేరిపోతే... ఆ రంగులోకి మారుతుంది. ఇన్ని వేషాలు వేసేది శత్రువుల కళ్లు కప్పడానికే. ఆహారం వెతుక్కోవడానికే. ఈ చేపకి మరో ప్రత్యేకతా ఉంది. ఏ జీవికైనా రెండువైపులా కళ్లుంటాయి. కానీ దీనికి ఒకే వైపున రెండు కళ్లుంటాయి. అవును... మొదట్లో గుండ్రంగా చిన్నగా ఉండే ఈ జీవి మెల్లగా ఫ్లాట్‌గా మారిపోతుంది. ఆ సమయంలోనే రెండు కళ్లు ఒక వైపునకు వచ్చేస్తాయి.

కాళ్లే పూరేకులై! 

అదాటున ఈ జీవి ఎగరడం చూస్తే... పువ్వు గాల్లో ఎగురుతుందా అనుకుంటారంతా. కానీ ఇదో గడ్డి పురుగు. పేరు ఆర్కిడ్‌ మాంటిస్‌. అచ్చం ఆర్కిడ్‌ పూల రూపంతో ఉంటుందనే దీనికీ పేరు. పువ్వులో పువ్వై కనిపించకుండా దాక్కుంటుంది. ఇతర జీవుల్నించి తప్పించుకుంటుంది. ఇది పుట్టగానే ఎరుపు, నలుపు రంగుల్లో ఉంటుంది. ఆ తర్వాత గులాబీ, తెలుపు రంగుల్లోకి మారి పువ్వులా తయారవుతుంది. మలేషియా, ఇండోనేషియా అడవుల్లో ఉంటుందిది. ఇంచుమించు మూడు అంగుళాల పొడవుండే ఈ పురుగు నాలుగు కాళ్లు అచ్చు పూల రెక్కల్లానే ఉంటాయి.

బుల్లి జీవి!

దీని పేరు పిగ్మీ సీహార్స్‌. సముద్రాల్లో బతికే ఈ జీవి ఎక్కువగా కోరల్‌ రీఫ్స్‌ దగ్గర ఉంటుంది. అంతా చేస్తే అర అంగుళమైనా ఉండదు. పసుపు, నారింజ రంగుల్లో ఉండే ఇది పరిసరాల రంగుల్లోకి మారిపోతూ కనిపించకుండా మాయ చేస్తుంది. చూస్తే మీకే తెలుస్తోంది కదూ!

అచ్చం ఆకే!

ఇదేంటీ ఇదేదో ఆకులా ఉందే అన్నట్టుంది కదూ ఫొటో చూస్తుంటే. కానీ ఇది కాట్యాడిడ్‌ పురుగుల్లో ఒకటి. గులాబీ, ముదురు ఆకుపచ్చ రంగులతో చిగురుటాకులా భలే అందంగా ఉంటుంది. దీని కాళ్ల వెనుక ఇంకో రెండు బుల్లి ఆకుల్లాంటి నిర్మాణాలు ఉంటాయి. అటూ ఇటూ గెంతినప్పుడు వాటి సాయంతోనే ఇది నిలబడగలదు.

పరిసరాల్లా...

ఇక్కడున్న ఫొటోని చూశారా? అచ్చం పరిసరాల్లో ఉన్న రంగుల్లో కలిసిపోయినట్టు ఉందో కప్ప. మ్యాచింగ్‌ మ్యాచింగ్‌గా కనిపిస్తున్న దీని పేరు పారాడాక్సొఫిల పాల్మటా. సన్నని తలతో ఉండే ఈ కప్ప గమ్మత్తుగా ఉంటుంది. ఎక్కువగా మడగాస్కర్‌లోని అడవుల్లో తిరుగాడుతుంటుంది. పసుపు పచ్చ, ముదురు రంగుల్లో కాస్త గరుగ్గా, చుక్కలు చుక్కలతో చిత్రంగా ఉంటుంది. దీంతో బురద, చెట్ల కొమ్మల రంగుల్లో  కలిసిపోతూ శత్రువుల్ని మాయ చేస్తుంది.

ఇంకా చాలానే!

ఫెంటాస్టిక్‌ లీఫ్‌ టేల్‌ గీకో, ఉల్ఫ్‌ స్పైడర్‌, గ్రేట్‌ గ్రే ఔల్‌, లీఫీ సీ డ్రాగన్‌ వంటి జీవులూ కనిపించకుండా మస్కా కొడతాయి.

 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని