ఎదిగే ఏడు రంగులు!

ఇక్కడున్న నా ఫొటోల్ని చూసి ఇదేంటీ ఇంద్రధ‌నుస్సు ఈ చెట్టుపై ప‌డిందా ఏంటీ? లేదంటే ఎవ‌రైనా దీనిపై రంగుల‌ద్దారా? ఇలా మెరిసే రంగుల‌తో క‌నిపిస్తోంది అనుకుంటున్నారు కదూ... అస‌లు రూప‌మే ఇంత‌... ఇదే నా ప్రత్యేక‌త‌... ఇంత‌కీ నేనెవ‌రో తెలుసా? అదేనండీ ఏ చెట్టునో? నా సంగ‌తులేంటో చెబుతా వినండి!యూకలిప్టస్‌ పేరు విన్నారా? అదే...  మీకు దగ్గు, జలుబు, జ్వరం వస్తే అమ్మ ఆ యూకలిప్టస్‌ నూనెను మందులా రాస్తుంది. హా...

Published : 19 Jul 2019 00:27 IST

ఇక్కడున్న నా ఫొటోల్ని చూసి ఇదేంటీ ఇంద్రధ‌నుస్సు ఈ చెట్టుపై ప‌డిందా ఏంటీ? లేదంటే ఎవ‌రైనా దీనిపై రంగుల‌ద్దారా? ఇలా మెరిసే రంగుల‌తో క‌నిపిస్తోంది అనుకుంటున్నారు కదూ... అస‌లు రూప‌మే ఇంత‌... ఇదే నా ప్రత్యేక‌త‌... ఇంత‌కీ నేనెవ‌రో తెలుసా? అదేనండీ ఏ చెట్టునో? నా సంగ‌తులేంటో చెబుతా వినండి!

యూకలిప్టస్‌ పేరు విన్నారా? అదే...  మీకు దగ్గు, జలుబు, జ్వరం వస్తే అమ్మ ఆ యూకలిప్టస్‌ నూనెను మందులా రాస్తుంది. హా... ఇప్పుడు గుర్తొచ్చింది కదూ దాని ఘాటు వాసన. విషయం ఏంటంటే... ఆ చెట్లలో నేనో రకాన్ని.

నా పేరు!


రెయిన్‌ బో యూకలిప్టస్‌. ఇంకా రెయిన్‌ బో గమ్‌, యూకలిప్టస్‌ డెగ్లుప్తా అంటూ పిలిచేస్తారు.

 నా ఊరు!

ఎక్కువగా ఫిలిప్పీన్స్‌, ఇండోనేషియా, పపువాన్యూగినియా ప్రాంతాల్లో కనిపిస్తుంటా. అత్యంత పొడి, చలి ప్రాంతాలు నాకస్సలు పడవు. అలాంటి వాతావరణ పరిస్థితుల్లో నేను పెరగలేను.

 నా రూపం!

నేనో ప్రత్యేకమైన చెట్టును. అందమైన బెరడు ఉండటమే నా గొప్ప. బెరడుపై నీలం, ఆకుపచ్చ, నారింజ, మెరూన్‌, లావెండర్‌ ఇలా రకరకాల రంగుల చారలుంటాయి. ఒక్కోదగ్గర ఒక్కో రంగుల కలయికతో హరివిల్లుల్లా అందంగా దర్శనమిస్తా. బెరడు తీస్తుంటే ఆకుపచ్చ రంగు కనిపిస్తుంది. తర్వాత అదీ రంగు మారిపోతుంటుంది. అలా భలే గమ్మత్తుగా ఉంటాన్నేను.

 నా వల్ల లాభాలు!

* నన్ను కాగితం తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు.
* కొన్ని ప్రాంతాల్లో అలంకరణకూ పెంచుతుంటారు.
* నా కలపకు పగుళ్లు రావు అందుకే పడవలు, ఫర్నీచర్‌ తయారీలోనూ వాడేస్తుంటారు.

 నా ఎత్తు!

చాలా త్వరగా పెరిగేస్తా. అందుకే ప్రపంచంలో అత్యంత వేగంగా పెరిగే వృక్షాల్లో ఒకటిగా నాకు పేరు. 200 నుంచి 250 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంటా. నాకు తెల్లని పూలు పూస్తాయి. నా ఆకుల్ని నలిపినప్పుడు ఓ కమ్మని సువాసన వస్తుంది. ఎందుకంటే వాటిల్లో కొన్ని నూనెల్ని ఉత్పత్తి చేసే గ్రంథులుంటాయి.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని