కుతుబ్‌ మినార్‌...కబుర్లు  విందామ్!

హాయ్‌ ఫ్రెండ్స్‌... నేను మీ చిన్నూని... మొన్న మేమో చోటుకు వెళ్లొచ్చాం... ఎక్కడికో చెప్పనా? అది ప్రపంచంలోనే ఎత్తయిన ఇటుకల మినార్‌... గుర్తొచ్చిందా? ఆ... అదేనండీ కుతుబ్‌ మినార్‌... చూస్తుంటే భలే ఆనందమేసింది... ఆ సంగతులు మీతో చెప్పాలనే ఇలా వచ్చా!కుతుబ్‌ మినార్‌ గురించి పాఠాల్లో విన్నప్పుడు, ఫొన్లో బొమ్మలు చూసినప్పుడు తెలియలేదు కానీ నేరుగా

Published : 20 Dec 2018 00:47 IST

చూసొద్దాం!

కుతుబ్‌ మినార్‌...కబుర్లు  విందామ్!

హాయ్‌ ఫ్రెండ్స్‌... నేను మీ చిన్నూని... మొన్న మేమో చోటుకు వెళ్లొచ్చాం... ఎక్కడికో చెప్పనా? అది ప్రపంచంలోనే ఎత్తయిన ఇటుకల మినార్‌... గుర్తొచ్చిందా? ఆ... అదేనండీ కుతుబ్‌ మినార్‌... చూస్తుంటే భలే ఆనందమేసింది... ఆ సంగతులు మీతో చెప్పాలనే ఇలా వచ్చా!
కుతుబ్‌ మినార్‌ గురించి పాఠాల్లో విన్నప్పుడు, ఫొన్లో బొమ్మలు చూసినప్పుడు తెలియలేదు కానీ నేరుగా చూసేసరికి ఎంత పొడవుగా ఉందో అనిపించింది. అబ్బ! మెడలు పోయాయనుకోండి. కానీ భలేగుందిలెండి. దిల్లీ నగరంలోని ఈ కుతుబ్‌ మినార్‌ మన దేశంలోనే ఎత్తయిన స్తంభాల్లో ఒకటి. ప్రపంచంలోనే ఇటుకలతో కట్టిన ఎత్తయిన మినారట. ఇక దాని వివరాల్లోకి వెళితే...
కట్టడం: కుతుబ్‌ మినార్‌
ఎత్తు:  239 అడుగులు
ప్రాంతం: దిల్లీ

ఇంతకీ ఎవరు కట్టారబ్బా?

కుతుబుద్దీన్‌ ఐబక్‌ క్రీ.శ. 1192 - 1206 మధ్యకాలంలో దిల్లీని పాలించాడు. ఆయనే ఈ కుతుబ్‌మినార్‌ నిర్మాణాన్ని మొదలుపెట్టాడు. తర్వాత వచ్చిన రాజు ఇల్‌టుట్‌మిష్‌ దీనిని పూర్తి చేశాడు. తర్వాత భూకంపం, ఇతర కారణాల వల్ల ఈ కట్టడం దెబ్బతింటే ఫిరోజ్‌ షా తుగ్లక్‌, సికిందర్‌ లోధీ, ఆ తర్వాత బ్రిటిష్‌ వాళ్లు కొన్ని మరమ్మతులు చేశారు.

అసలు ఎందుకు కట్టారు?

ఈ మినార్‌ ఎందుకు కట్టారనేదానిపై భిన్న వాదనలున్నాయి. మినార్‌కు పక్కనే కువ్వతుల్‌ ఇస్లాం అనే ఒక మసీదు ఉంటుంది. ఇందులో ప్రార్థనలు చేసేటప్పుడు పిలుపునిచ్చేందుకు కట్టి ఉంటారని కొందరు, దిల్లీ నగరాన్ని పర్యవేక్షించేందుకు, శత్రువులెవరైనా వస్తున్నారేమోనన్న సంగతిని కనిపెట్టేందుకు నిఘా కోసం కట్టి ఉంటారని మరికొందరి వాదన. ఇంకా చాలా కథలు చెప్పుకొంటారు.

ఇంకా ఏమైనా?

కుతుబ్‌ మినార్‌...కబుర్లు  విందామ్!

కుతుబ్‌ మినార్‌ దగ్గరలో చూడదగిన ప్రాంతాలూ ఉన్నాయి. వీటిలో ఏడు మీటర్ల పొడవైన ఇనుప స్తంభం ప్రత్యేక ఆకర్షణ. ఇంచుమించు 2000 సంవత్సరాల నాటిదిది. ఇప్పటికీ ఇది తుప్పు పట్టకుండా చెక్కు చెదరకుండా ఉండటం విశేషం. దీన్ని చూడ్డానికి ఎక్కడెక్కడి నుంచో సందర్శకులు వస్తుంటారు. అద్భుతమైన ఈ కట్టడాన్ని యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించింది కూడా.

ఎంత ఎత్తో!

అయిదు అంతస్తుల్లో ఉండే కుతుబ్‌ మినార్‌ 73 మీటర్లు అంటే సుమారు 239 అడుగుల పొడవుంది. దీనిని రెడ్‌ శాండ్‌ స్టోన్‌తో నిర్మించారు. అయితే నాలుగు, అయిదో అంతస్తులు మాత్రం పాలరాయి, ఇసుకరాయితో కట్టారు. మినార్‌ కింది భాగంలో వ్యాసం నలభై ఏడు అడుగులు ఉంటే, పైకి వెళ్లే కొద్దీ తగ్గుతూ చివరికి తొమ్మిది అడుగులు ఉంటుంది. అంతస్తు అంతస్తుకూ మధ్య బాల్కనీలు ఉన్నాయి. మినార్‌ లోపలి నుంచి పైకి వెళ్లేందుకు మొత్తం 379 మెట్లు ఉంటాయి.

ఆ పేరే ఎందుకు?

కుతుబుద్దీన్‌ ఐబక్‌ మొదలుపెట్టాడు కనుక ఆయన పేరు పెట్టారని కొందరు చెబుతుంటారు. ఆ కాలంలో కుతుబుద్దీన్‌ బఖ్త్‌యార్‌ కాకి అనే మహమ్మదీయ సాధువు ఉండేవాడట. ఆయన పేరే దీనికి పెట్టారని మరికొందరు చెబుతుంటారు. అరబిక్‌లో మినార్‌ అంటే స్తంభం అని అర్థమట.

మనల్ని పైకి ఎక్కనిస్తారా?

1981 వరకైతే ఈ అవకాశం ఉండేదనుకోండి. ఒకసారి ఏమయ్యిందంటే... 1981 డిసెంబరు 4న విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. అదే సమయంలో మినార్‌ ఒరిగిపోతోందని గందరగోళం తలెత్తింది. దాంతో తొక్కిసలాట జరిగింది 47 మంది చనిపోయారు. అప్పటి నుంచి దీని మీదికి ఎక్కనివ్వడం లేదు.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని