శిలలపై శిల్పాలు చెక్కినారూ!

ప్రపంచంలో అతి పెద్ద దేవాలయం అంకోర్‌ వాట్‌. యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల్లోనూ ఒకటి. 2007లో ఇది ప్రపంచ కొత్త ఏడు వింతల జాబితాలో స్థానం దక్కించుకుంది. 402 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. దీని చుట్టూ ఉండే ప్రహారీ గోడే మూడున్నర కిలోమీటర్లకుపైగా ఉంటుంది. దీన్ని బట్టి ఇదెంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు.

Updated : 04 May 2019 00:37 IST

విశేషమ్‌

* ఏంటిది?

ప్రపంచంలో అతి పెద్ద దేవాలయం అంకోర్‌ వాట్‌. యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల్లోనూ ఒకటి. 2007లో ఇది ప్రపంచ కొత్త ఏడు వింతల జాబితాలో స్థానం దక్కించుకుంది. 402 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. దీని చుట్టూ ఉండే ప్రహారీ గోడే మూడున్నర కిలోమీటర్లకుపైగా ఉంటుంది. దీన్ని బట్టి ఇదెంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు.

* ఎక్కడుంది?

మన ఆసియా ఖండంలోని కాంబోడియాలో. అక్కడి సియామ్‌ రీఫ్‌ ప్రావిన్స్‌లోని అంకోర్‌ సిటీలో.

* ఎవరు కట్టారు?

పన్నెండో శతాబ్దంలో ఖ్మేర్‌ చక్రవర్తి సూర్యవర్మన్‌II దీన్ని కట్టడం మొదలుపెట్టారు. జయవర్మన్‌VII పూర్తిచేశారు. ప్రధానంగా ఇది విష్ణు ఆలయం. అయితే ఇప్పుడిది బౌద్ధాలయంగా ఉంది.

* లోపల ఏముంటుంది?

ఇదో దేవాలయాల సముదాయం. విష్ణు, హనుమాన్‌ లాంటి దేవుళ్ల విగ్రహాలతోపాటు హిందూ దేవతల విగ్రహాలుంటాయి. తర్వాత బౌద్ధ సన్యాసులూ దీన్ని తమ పవిత్ర ఆలయంగా భావించడం మొదలుపెట్టారు.

* ఏంటీ కళ?

ఈ ఆలయంపై ఆర్కిటెక్చర్‌ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మన దేశంలో కనిపించే దేవాలయాల్లానే ఈ గుడి గోపురాలతో, చెక్కిన బొమ్మలతో ఆకట్టుకునేలా ఉంటుంది. పాములు, సింహాలు, రెక్కల గుర్రాల్లాంటి వాటితోపాటు, రామాయణం, మహాభారతంలాంటి.. పురాణ కథలూ వీటిపై చిత్రించారు.

* పర్యటకం ఎక్కువా?

గత ఏడాది రెండు లక్షల అరవై వేల మంది దీన్ని సందర్శించారు. ఈ దేశాన్ని పర్యటించే విదేశీయుల్లో 50శాతం మందికి పైగా దీన్ని చూసేందుకు తప్పక వెళతారు. గుడి ప్రాంగణం పెద్దది కదా. అందుకే ఇక్కడ ఒకరోజు, మూడు రోజులు, వారం రోజులపాటు దీన్ని సందర్శించేందుకు వీలుగా పాస్‌లు ఇస్తారు. అవి కొనుక్కుని తీరికగా అంతటినీ తిరిగి చూడొచ్చన్నమాట. కేవలం టిక్కెట్ల అమ్మకం వల్లే దీనికి ఏటా వంద మిలియన్‌ డాలర్లకు పైగా ఆదాయం సమకూరుతోందట.

* దేనితో నిర్మించారు?

ఈ మొత్తాన్ని ఇసుకరాయితోనే నిర్మించేశారు. దానిపైన ఒకే ఒకసారి రంగు వేశార్ట. అయితే ఆ ఆనవాళ్లేవీ ఇప్పుడు కనిపించవు. అక్కడక్కడా మాత్రమే ఆ గుర్తులున్నాయి. కొన్ని ప్రత్యేక గోపురాల్ని మాత్రం అచ్చుల్లో పోసి తీసి దీనిపై నిలబెట్టార్ట. అంతెత్తు రాతి బురుజులు, గోపురాలతో భారతీయ సంప్రదాయ గుడుల్ని తలపిస్తుందిది.

* ఇంకా పేర్లున్నాయా?

పదహారో శతాబ్దం వరకూ దీన్ని అంతా పిస్నులోక్‌ పేరుతో పిలిచేవారు. ఆ తర్వాతనే దీనికి అంకోర్‌ వాట్‌ అనే పేరు స్థిరపడింది. అయితే సంస్కృతంలో ఉన్న వరాహ విష్ణులోక, పరమ విష్ణులోక అనే పేర్లు దీని అసలు పేర్లని చెబుతారు. దీని వల్లే ఈ ఊరికి సిటీ ఆఫ్‌ టెంపుల్స్‌ అనే పేరూ ఉంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని