సముద్రాన్ని చదివేశాడు..

సముద్రం ఒడ్డున మనల్ని నిలబెడితే ఏం చేస్తాం. ఎంచక్కా ఆడుకుంటాం కదా.. కానీ ఓ బుడతడు ఆ సముద్రాన్నే అధ్యయనం చేసేశాడు. అంతేనా.. అందులో ఉండే జీవుల గురించి, వాటి స్థితి గతుల

Published : 06 Dec 2021 00:34 IST

సముద్రం ఒడ్డున మనల్ని నిలబెడితే ఏం చేస్తాం. ఎంచక్కా ఆడుకుంటాం కదా.. కానీ ఓ బుడతడు ఆ సముద్రాన్నే అధ్యయనం చేసేశాడు. అంతేనా.. అందులో ఉండే జీవుల గురించి, వాటి స్థితి గతుల గురించి టకటకా చెప్పేస్తున్నాడు. తన ప్రతిభతో రికార్డులు పొందుతున్నాడు. అదెలా? ఇంతకీ ఎవరీ బుడతడు? తెలుసుకునేందుకు చదివేయండి.

ఆ చిన్నారి పేరు హర్ష జె.ఎస్‌. వయసు అయిదేళ్లు. ఉండేది కర్నాటకలో.

ఆసక్తితో అడిగేవాడు..

హర్షకు చిన్నప్పట్నుంచీ సముద్రమంటే చాలా ఇష్టమట. అందుకే మాటిమాటికీ బీచ్‌ దగ్గరకు తీసుకువెళ్లమనేవాడు. సరే కదా అని తీసుకెళ్తే ఆడుకునేవాడు కాదట. అందరూ  ఆడుకుంటుంటే.. హర్ష మాత్రం సముద్రాన్ని పరిశీలిస్తూ అందులో ఏ జీవులు ఉంటాయి? అవెలా బతుకుతాయి? ఇలా రకరకాల ప్రశ్నలు వేసేవాడట. సరే కదాని వాళ్లకు తెలిసింది చెబుతూ వచ్చేవారట అమ్మానాన్న.

జ్ఞాపకశక్తి మెండు..

హర్ష మాత్రం తన సందేహాలను అడుగుతూనే ఉండేవాడట. ఇక తన ఆసక్తిని గమనించిన అమ్మానాన్న హర్షకు సముద్రానికి సంబంధించిన వివరాలన్నీ పూసగుచ్చినట్లు చెప్పేవారు. అవన్నీ చక్కగా గుర్తుపెట్టుకొని తిరిగి వాళ్లకే చెప్పేవాడట హర్ష. తన జ్ఞాపకశక్తికి ఆశ్చర్యపోయిన అమ్మానాన్న అప్పట్నుంచి సముద్రం గురించి మరిన్ని వివరాలు చెబుతూ వచ్చారు. అంతేకాదు హర్ష ప్రతిభ నలుగురికీ తెలియాలనే ఉద్దేశంతో తన గురించి రికార్డ్‌ కమిటీకి తెలియజేశారు. ఇంకేముంది మన హర్ష వాళ్ల ముందు అద్భుతమైన ప్రతిభ కనబరిచాడు. సముద్రశాస్త్రంకు సంబంధించిన 14 అంశాలను వివరించాడు. సముద్రంలోని 5 వేర్వేరు జోన్‌లు, జీవావరణ శాస్త్రం, నీటి జంతువులు, మానవ పరస్పర చర్యలు ఇలా అన్నింటికి సంబంధించిన 132 ప్రశ్నలకు హర్ష సమాధానమిచ్చాడు. అవన్నీ అంత చిన్న వయసులోనే చెప్పడం చూసిన న్యాయనిర్ణేతలు ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో హర్ష పేరు నమోదు చేసేశారు. భలే కదా! మరి హర్షకు అభినందనలు తెలిపేయండి..


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని