పిచ్చుకకు ప్రేమతో...

బుల్లి పిట్ట.. బుజ్జి పిట్ట..గూటిలోని గువ్వపిట్ట..మమ్మల్ని వదిలేసిఎట్టా పోయావు!రోజూ నీకు గింజలు వేసి..తాగేందుకు నీరూ పోసి..చిట్టి రెక్కలతో నువ్వు ఎగురుతుంటే..మేం కేరింతలు కొడుతూ సంబరపడేవాళ్లం...బుల్లి పిట్ట.. బుజ్జి పిట్ట..

Published : 24 Feb 2022 00:57 IST

బుల్లి పిట్ట.. బుజ్జి పిట్ట..
గూటిలోని గువ్వపిట్ట..

మమ్మల్ని వదిలేసి
ఎట్టా పోయావు!
రోజూ నీకు గింజలు వేసి..
తాగేందుకు నీరూ పోసి..
చిట్టి రెక్కలతో నువ్వు ఎగురుతుంటే..
మేం కేరింతలు కొడుతూ సంబరపడేవాళ్లం...

బుల్లి పిట్ట.. బుజ్జి పిట్ట..
గూటిలోని గువ్వపిట్ట..

తమ చిన్ని నేస్తం ఇక లేదు.. ఇక రాదు అని తెలిసి ఓ ఊళ్లోని పిల్లలు పడుతున్న బాధ ఇది. ఇంతకీ ఏంటా బాధ, ఏంటా కథ? తెలుసుకుందామా.. మరి!

నగనగా ఓ గ్రామం. ఆ పల్లె పేరు బసవపట్న. ఇది కర్ణాటకలో ఉంది. ఈ గ్రామస్థులకు ఓ ఊరపిచ్చుకతో అనుబంధం ఉంది. అది రోజూ ఉదయాన్నే రెక్కలు కట్టుకుని వచ్చి ఓ 70 ఇళ్ల అరుగుల ముందు వాలేది. అంతకు ముందే దానికి అరుగు మీద గింజలు పోసి సిద్ధంగా పెట్టేవారు అక్కడివారు. అది ఒక్కో గింజను పొడుచుకుంటూ తినేసి తుర్రున ఎగిరిపోయి, మరో ఇంటి అరుగు మీద వాలేది.

ఆ పిట్ట.. పిల్లల నేస్తం!

రోజూ ఉదయం 8 గంటలకే గంటకొట్టినట్టుగా ఈ బుజ్జిపిట్ట వచ్చి వాలేది. పిల్లలంతా దాన్ని చూసి తెగ మురిసిపోయేవారు. అది గింజలు తింటుంటే, నీళ్లు తాగుతుంటే ఆసక్తిగా చూసేవారు. ఇలా ఆ పిట్టకు ఆ ఊరివాళ్లతో అనుబంధం ఏర్పడింది.

కానీ అంతలోనే...

ఇటీవల ఓరోజు ఉదయం తొమ్మిదవుతున్నా... ఆ పిట్ట రాలేదు. 70 ఇళ్ల అరుగుల మీద ఉన్న గింజలు అలాగే ఉన్నాయి. ఆ బుజ్జి పిట్ట ప్రాణాలు కోల్పోయిందని తెలుసుకున్న ఊరివాళ్లు, పిల్లలంతా ఎంతో బాధపడ్డారు. అంతా ఓ చోట సమావేశమై.. దానికి సమాధి కట్టించారు. నివాళులర్పించారు. దశదినకర్మ కూడా చేశారు. 11వ రోజు ఆ గ్రామంలో మాంసం వండటాన్ని నిషేధించారు. ఊరివాళ్లంతా శాకాహారమే వండుకుని తిన్నారు. ఆ బుజ్జి పిట్టకు సంతాప సూచకంగా బ్యానర్లు కూడా కట్టారు. పిల్లలు కూడా తమ నేస్తాన్ని కోల్పోయినందుకు బాధ పడుతున్నారు. ఇప్పటికీ దాన్ని తలుచుకుంటున్నారు. ఓ చిన్ని పక్షి కోసం పిల్లలు, ఊరువారంతా ఇంతలా ఆలోచించారంటే నిజంగా గ్రేట్‌ కదూ!

అసలే వేసవికాలం రాబోతోంది. మనమూ చిన్ని పక్షుల కోసం గింజలు, నీటి సౌకర్యం కల్పిద్దామా ఫ్రెండ్స్‌.. పాపం.. అవి అసలే బుజ్జి పిట్టలు కదా!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని