Published : 18 Mar 2022 00:11 IST

వయసులో బుడుగు.. ప్రతిభలో పిడుగు!

హాయ్‌ ఫ్రెండ్స్‌..! మూడున్నరేళ్ల వయసులో పిల్లలు ఏం చేస్తారు..? సరదాగా అడుకుంటారు.. బడికి వెళ్లనని మారాం చేస్తారు.. బతిమాలి బామాలి తినిపిస్తే కానీ తినరు. ఈ నేస్తం మాత్రం ఆసక్తి ఉండాలే కానీ ప్రతిభకు వయసుతో ప్రమేయం లేదని నిరూపిస్తున్నాడు. అసాధారణ ప్రజ్ఞతో విభిన్న నైపుణ్యాలు చూపి అబ్బుర పరుస్తున్నాడు. అవేంటో తెలుసుకుందామా మరి.

తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం వెలగతోడు గ్రామానికి చెందిన పి.మునికార్తీక్‌ తాపేశ్వరంలో యూకేజీ చదువుతున్నాడు. అమ్మ సరోజిని గృహిణి. నాన్న వెంకటరాజు వ్యవసాయంతోపాటు చిన్న వ్యాపారం చేస్తారు. కార్తీక్‌ ఏడాది వయసున్నప్పుడే చాలా చురుగ్గా ఉండేవాడు. ఇది గమనించిన అమ్మ, అక్షరాలు రాయటం, మాటలు నేర్పటం, విజ్ఞానపరమైన విషయాలు చెప్పటం మొదలు పెట్టారు. అక్షరాభ్యాసం కంటే ముందే తెలుగు, ఆంగ్ల అక్షరాలు రాయటం కూడా నేర్చుకున్నాడు. ప్రస్తుతం వేమన, సుమతీ శతకంలోనివి 12 పద్యాలు కంఠతా చెప్పేస్తాడు. రామాయణ శ్లోకాలు 8 వరకూ గుక్కతిప్పకుండా చెబుతాడు. చదరంగం కూడా పూర్తిగా నేర్చుకున్నాడు. బుడి బుడి అడుగులతోనే 1.3 మీటర్ల వరకు లాగ్‌జంప్‌ చేస్తాడు. రెండు చేతులతోనూ రాస్తాడు. ఎంత పెద్ద స్పెలింగ్‌ అయినా చాలా వేగంగా నేర్చుకుని గుర్తు పెట్టుకుంటాడు.

రికార్డులే రికార్డులు..!

కొన్ని రోజుల క్రితం 100 ఆంగ్ల పదాల స్పెల్లింగులు నాలుగు నిమిషాల వ్యవధిలో చెప్పి ‘హైరేంజ్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’లో స్థానం సాధించాడు. ఏడాదిన్నర ప్రాయంలో దేశ, రాష్ట్ర రాజధానులు, చిహ్నాలు, ఆంగ్ల వ్యతిరేక పదాలు, శరీర భాగాల పేర్లు, తెలుగు, ఆంగ్ల, హిందీ అంకెలు, నెలలు, పండ్లు, జంతువుల పేర్లు చెప్పినందుకు 2020లో ‘ఛాంపియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌’లో పేరు నమోదు చేయించుకున్నాడు. మూడేళ్ల వయసులోనే విజయనగరం జిల్లాలోని రామనారాయణ ఆలయంలో నిర్వహించిన కార్యక్రమంలో రామాయణంపై ప్రశ్నలకు జవాబులు చెప్పినందుకు నిర్వాహకులు సత్కరించారు. 2020 బాలల దినోత్సవ కార్యక్రమంలో భాగంగా నెహ్రూపై అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పినందుకు బాల నెహ్రూ అవార్డు, శ్రీకృష్ణ అవార్డు సొంతం చేసుకున్నాడు.

ఎల్‌కేజీ చదవకుండానే..

కార్తీక్‌ తెలివితేటలు చూసి పాఠశాల యాజమాన్యం ఎల్‌కేజీ చదవకుండానే యూకేజీకి పంపించింది. ఈ నైపుణ్యాలు నేర్చుకునేందుకు కార్తీక్‌ ప్రత్యేకంగా సమయం అంటూ కేటాయించలేదట. అమ్మ ఏదైనా పని చేస్తున్నప్పుడు సాయం చేస్తుంటాడు. ఆ సమయంలో అమ్మ చెప్పినవన్నీ గుర్తుంచుకుంటాడు అంతే! ఇంత చిన్న వయసులోనే ఇన్ని రికార్డులు సాధించిన ఈ బుడతడు భవిష్యత్తులో మరిన్ని ఘనతలు సాధించాలని మనమూ ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేద్దామా మరి.

- ఉప్పాల రాజాపృథ్వీ

ఈనాడు డిజిటల్‌, రాజమహేంద్రవరం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు