Published : 05 Apr 2022 00:34 IST

పక్షుల గూడు.. అంతస్తులెన్నో చూడు!

హాయ్‌ నేస్తాలూ..‘ఇదేంటి.. ప్రపంచ వింతల్లో ఒకటైన ఇటలీలోని పీసా టవర్‌లా ఉంది?’ అని ఆలోచిస్తున్నారా - అలాగే ఉన్నా.. ఇది అది కాదు ఫ్రెండ్స్‌. అలాగని మనుషుల కోసం కట్టింది కూడా కాదు. మరింకేంటంటే.. అబ్బా! అన్నీ ఇక్కడే చెప్పేస్తారు మరి!! ఈ నిర్మాణం విశేషాలు తెలుసుకోవాలంటే ఇది చదివేయండి.
రాజస్థాన్‌ రాష్ట్రం బికనీర్‌ జిల్లాలోని తోలాసర్‌ గ్రామం చుట్టుపక్కల ఉండే పక్షులకు ఎండు పుల్లలు, గడ్డి ఏరుకొని చెట్లపైన గూళ్లు కట్టుకొనే అవసరం లేదు. ఎందుకంటే.. పక్షుల కోసమే ఆ గ్రామస్థులు ఏకంగా 11 అంతస్తుల ఒంటి స్తంభం మేడ కట్టేశారు. అదే ఇది ఫ్రెండ్స్‌.

స్విమ్మింగ్‌ పూల్‌ కూడా..
ఎడారి ప్రాంతం కావడంతో ఏటా వేసవిలో తిండి గింజలు, నీటి కోసం పక్షుల అవస్థలు చూడలేక తోలాసర్‌ ప్రజలు ఈ భవనాన్ని కట్టించారు. అలాగని.. సాదాసీదాగా అని అనుకునేరు! స్థానికులు తలా కొంత చందాలు వేసుకొని మరీ.. పోగుచేసిన రూ.5 లక్షలతో ఫైవ్‌స్టార్‌ హోటల్‌ను తలపించేలా దీన్ని నిర్మించారట. ఈ గూళ్లలో దాదాపు వెయ్యికిపైగా పక్షులు ఎంచక్కా నివసించవచ్చు. అవి తినేందుకు వివిధ రకాల గింజలతోపాటు నీటి తొట్లు కూడా ఉన్నాయట. అంతేకాదు.. పిట్టలు సరదాగా ఈత కొట్టేందుకు ఓ స్విమ్మింగ్‌ పూల్‌ కూడా ఏర్పాటు చేశారు. గత నెలలోనే నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ బర్డ్‌ అపార్ట్‌మెంట్‌లోకి అప్పుడే కొన్ని పక్షులు చేరిపోయాయట. ఇక్కడి కుండీలు, పూల్‌ను గ్రామస్థులే ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ.. వాటిల్లో కొత్త నీళ్లు పోస్తారట.  

వైరల్‌గా మారి..
రాజస్థాన్‌లోని ఇతర జిల్లాల్లోనూ పక్షుల కోసం రకరకాల నిర్మాణాలు ఉన్నాయట. కానీ, వాటన్నింటికంటే ఇదే విభిన్నంగా ఉండటంతో చుట్టుపక్కల ఊళ్ల ప్రజలూ.. తోలాసర్‌కి వచ్చి ఈ మేడను చూసి వెళ్తున్నారట. ఇటీవల ఓ ఐఏఎస్‌ అధికారి సోషల్‌ మీడియాలో ఈ పక్షుల బిల్డింగ్‌ని పోస్టు చేయడంతో తక్కువ కాలంలోనే వైరల్‌గా మారింది. కొందరు నెటిజన్లు ఈ బర్డ్‌ అపార్ట్‌మెంట్‌ను చూసి అవాక్కవుతుంటే.. మరికొందరేమో మూగజీవుల కోసం ఆ గ్రామస్థుల చొరవను అభినందిస్తున్నారు. ఇవండీ ఈ మేడ సంగతులు! మనం కూడా ఇంటి వరండాలోనో గార్డెన్‌లోనో పక్షుల ఆకలి, దాహం తీర్చేందుకు ఏదో ఒక ఏర్పాటు చేసేద్దాం ఫ్రెండ్స్‌!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని