Published : 16 Apr 2022 00:54 IST

రాస్పీ.. ఓ మంచి రోబో!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. మనకు రిమోట్‌ బొమ్మలన్నా, ఎలక్ట్రానిక్‌ పరికరాలన్నా బోలెడు ఇష్టం కదూ! మొదట్లో బాగానే పనిచేసినా.. తర్వాత తరచూ మొరాయిస్తుంటాయి. అప్పటికే మనకూ అవి బోరు కొట్టేయడంతో వాటిని పడేస్తాం. ఓ నేస్తం మాత్రం పాత బొమ్మల్లోని పరికరాలతో రోబోనే తయారు చేశాడు. ఆ వివరాలివీ..

కేరళ రాష్ట్రంలోని అడూర్‌కు చెందిన జిదాన్‌ ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. మోటార్లూ, బ్యాటరీలూ, రిమోట్లూ తదితర ఎలక్ట్రానిక్‌ పరికరాలంటే ఈ నేస్తానికి చిన్నప్పటి నుంచి చెప్పలేనంత ఆసక్తి అట. ఆ ఇష్టమే ఇప్పుడతన్ని వార్తల్లోకి తీసుకొచ్చేసింది.

పాత బొమ్మల్లోని సామగ్రితో..

జిదాన్‌కు తొమ్మిదేళ్ల వయసులో వాళ్లమ్మ సౌరశక్తితో నడిచే ఓ బొమ్మను తీసుకొచ్చింది. కొన్ని రోజులు దాంతో ఆడుకున్నాక.. బోరు కొట్టడంతో పగలగొట్టేశాడు. అప్పుడు అందులోంచి బయటకొచ్చిన బ్యాటరీలు, ఇతర వస్తువులూ అతడిలో ఓ సరికొత్త ఆలోచనను రేకెత్తించాయి. ఆ పరికరాలతో ఓ కారు బొమ్మను తయారు చేసి ఔరా అనిపించాడు. అలా అప్పటినుంచి పాత బొమ్మలను పడేయకుండా.. వాటిలోని సామగ్రితో కొత్తవి చేసుకొని ఆడుకునేవాడు.

‘అట్లాస్‌’ స్ఫూర్తి

ఓ అమెరికా సంస్థ రూపొందించిన ‘అట్లాస్‌’ అనే రోబోను స్ఫూర్తిగా తీసుకున్న జిదాన్‌.. తాను కూడా అంతకుమించిన దాన్నొకటి తయారు చేయాలనుకున్నాడు. వెంటనే, మొబైల్‌ అప్లికేషన్‌ ఆధారంగా బ్లూటూత్‌తో పనిచేసే ఓ రోబోని తయారు చేశాడు. దానికి ‘రాస్పీ’ అని పేరు కూడా పెట్టాడండోయ్‌. పెద్దవాళ్లకే కష్టంగా అనిపించే.. సి, పైథాన్‌ ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజెస్‌ను ఇదివరకే నేర్చుకొని ఉండటంతో రోబోకు జీవం పోశాడు. మనం ఫోన్‌లోని ఆప్‌లో ‘ఎఫ్‌’ (ఫార్వర్డ్‌) అని టైప్‌ చేస్తే ముందుకు, ‘బి’ (బ్యాక్‌వర్డ్‌) అని నొక్కితే వెనకకు వెళ్తుందట. అంతేకాదు.. ఈ రోబో జిదాన్‌ కంప్యూటర్‌తో అనుసంధానం కావడంతో మీరు ఏదైనా ప్రశ్న అడిగితే టక్కున సమాధానం చెబుతుంది. పాటలూ పాడుతుంది. దీని కాళ్లలోని శక్తివంత మోటార్ల సాయంతో రెండు కిలోమీటర్ల వరకూ నడవగలదట. భవిష్యత్తులో రాస్పీకి మరింత మెరుగులు దిద్దుతానని చెబుతున్నాడీ బాల మేధావి. మీరూ ఇంట్లోని బొమ్మలతో ఏదైనా కొత్తగా ప్రయత్నించండి మరి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని