చిన్నోడు.. నిజాయతీ ఉన్నోడు!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. నీతి, నిజాయతీకి సంబంధించిన బోలెడు కథలను మనం వినే ఉంటాం. టీచర్లూ చాలా పాఠాలు చెప్పే ఉంటారు. కానీ, వాటిని కేవలం విని వదిలేయకుండా.. ఓ నేస్తం ఆచరణలో చూపాడు. నిజాయతీకి నిలువుటద్దంలా నిలిచీ..

Published : 26 Apr 2022 01:17 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. నీతి, నిజాయతీకి సంబంధించిన బోలెడు కథలను మనం వినే ఉంటాం. టీచర్లూ చాలా పాఠాలు చెప్పే ఉంటారు. కానీ, వాటిని కేవలం విని వదిలేయకుండా.. ఓ నేస్తం ఆచరణలో చూపాడు. నిజాయతీకి నిలువుటద్దంలా నిలిచీ.. అందరితో శెభాష్‌ అనిపించుకుంటున్న ఆ బాలుడి వివరాలే ఇవీ..

త్తరప్రదేశ్‌కు చెందిన పదేళ్ల హన్నన్‌ ఇటీవల చేసిన ఓ పని అతడితోపాటు తల్లిదండ్రులకూ, పాఠశాలకూ మంచిపేరు తీసుకొచ్చింది. అదేంటంటే.. దారిలో దొరికిన బ్యాగును తిరిగి ఇచ్చేయడమే. అలాగనీ.. అదేదో మామూలుది కాదు నిండా డబ్బులున్నది.  

బజారుకు వెళ్లి వస్తుండగా..

బజారుకెళ్లి కొన్ని సరకులు తీసుకురమ్మని.. హన్నన్‌ను వాళ్లమ్మ బయటకు పంపించింది. అవి తీసుకొని ఇంటికి తిరిగివస్తుండగా.. అటుగా వెళ్తున్న ఓ ఆటోలోంచి బ్యాగు పడిపోవడాన్ని బాలుడు గమనించాడు. క్షణాల్లోనే ఆ బ్యాగును అందుకొని.. అరుచుకుంటూ ఆ ఆటో వెనకే పరుగెత్తాడు హన్నన్‌. అయినా, అందులోని వారు వినిపించుకోలేదు. ఆటో ఆగలేదు. దాంతో బాలుడు దాన్ని తెరిచి చూస్తే.. రూ.5 లక్షలు కనిపించాయి. నేరుగా ఆ బ్యాగును ఇంటికి తీసుకు వెళ్లాడు. వాళ్లమ్మకు విషయం అంతా వివరించి చెప్పాడు.  

అమ్మతో కలిసి..

క్షణం కూడా ఆలస్యం చేయకుండా. తల్లీకొడుకులు ఆ బ్యాగ్‌ తీసుకొని, అది దొరికిన ప్రదేశానికి చేరుకున్నారు. చుట్టుపక్కల వారిని వాకబు చేశారు. బ్యాగును వెతుక్కుంటూ ఎవరూ రాలేదని చెప్పారంతా. ఇంతలో పక్కనే ఉన్న మసీదు నుంచి ఓ అనౌన్స్‌మెంట్‌ వినిపించింది. ‘తానో కాంట్రాక్టర్‌ననీ, ఆటో ఎక్కే హడావిడిలో తన దగ్గరున్న రెండు బ్యాగుల్లో డబ్బులది కింద పడిపోయిందనీ, ఎవరికైనా సమాచారం తెలిస్తే చెప్పాలనీ, దొరికితే తిరిగి ఇవ్వాలనీ’ దారి సారాంశం. అది విన్న హన్నన్‌, వాళ్లతో కలిసి మసీదు దగ్గరకు వెళ్లి ఆ కాంట్రాక్టర్‌కు బ్యాగు అందించాడు. పోయిందనుకున్న డబ్బును చూడగానే ఆ కాంట్రాక్టర్‌కు ప్రాణం వచ్చినట్లై.. హన్నన్‌ను దగ్గరకు తీసుకొని ఏడ్చేశాడట.  

స్కూలు ఫీజు మాఫీ

‘ఇతరుల సొమ్ము మన వద్ద ఉంచుకోవడం మంచిది కాదనీ.. మా అమ్మానాన్నతోపాటు స్కూల్లో టీచర్లూ ఎప్పుడూ చెబుతుండేవారు. అదే నేనూ పాటించాను’ అని హన్నన్‌ చెప్పడంతో అతడి నిజాయతీని అందరూ మెచ్చుకున్నారు. తమ పాఠశాలకు మంచి పేరు తీసుకొచ్చిన ఈ నేస్తానికి ఏడాది స్కూల్‌ ఫీజు కూడా మాఫీ చేసింది యాజమాన్యం. ఎప్పుడూ మంచి పనులే చేయాలనీ, సమాజం పట్ల సేవాభావంతో ఉండాలనీ.. తాము చెప్పిన మాటలను కుమారుడు చేతల్లో చూపడంతో ఆ తల్లి కూడా ఎంతో మురిసిపోయింది. మనమూ ఈ నేస్తంలాగే నిజాయతీగా ఉంటూ.. గ్రేట్‌ అనిపించుకుందాం!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని