చిట్టి చేతులు.. చక్కని రాతలు!

వయసు పద్నాలుగేళ్లు. ఎవరైనా ఈ వయసులో ఏం చేస్తారు? ఇంకేం చేస్తారు... కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితమవుతారు. కానీ ఓ చిన్నారి మాత్రం ఏకంగా ఓ నవలనే రాసింది. ఇంతకూ ఎవరా బుజ్జి రచయిత? ఏంటా పుస్తకం? తెలుసుకుందామా?

Published : 14 Jun 2022 01:35 IST

వయసు పద్నాలుగేళ్లు. ఎవరైనా ఈ వయసులో ఏం చేస్తారు? ఇంకేం చేస్తారు... కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితమవుతారు. కానీ ఓ చిన్నారి మాత్రం ఏకంగా ఓ నవలనే రాసింది. ఇంతకూ ఎవరా బుజ్జి రచయిత? ఏంటా పుస్తకం? తెలుసుకుందామా?

మంగళూరుకు చెందిన షినే ఫెర్నాండేజ్‌ ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతోంది. తను రాసిన ‘ది ఇన్సిడెంట్‌’ అనే నవలను ఇటీవలే విడుదల చేసింది. 2019లో ఈ నేస్తం రాయడం ప్రారంభించింది. చిన్నతనంలోనే రచయితగా మారి, ప్రతిభకు వయసుతో సంబంధం లేదని నిరూపించింది.

లాక్‌డౌన్‌ చూపిన దారి..

కరోనా లాక్‌డౌన్‌ వేళ మనలాంటి పిల్లలందరూ ఆటలు, పాటలతో తీరిక లేకుండా గడిపితే, షినే మాత్రం తన రచనకు మెరుగులు దిద్దుకుంది. అమ్మానాన్న, బామ్మ సహకారంతో తన మొదటి నవలకు ప్రాణం పోసింది.

ఉపాధ్యాయుల ప్రోత్సాహం..

ఇటీవల ఈ పుస్తక ఆవిష్కరణ సభ షినే చదువుకునే స్కూల్లోనే ఘనంగా జరిగింది. ఉపాధ్యాయులు తనను ఎంతగానో పొగిడారు. ఇతర విద్యార్థులు సైతం షినే బాటలోనే నడవాలని పిలుపునిచ్చారు. భాష మీద పట్టు సాధిస్తే, వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా చక్కగా రచనలు చేయొచ్చని చెప్పారు.

ఎనిమిదేళ్ల నుంచే...

జేకే రౌలింగ్‌ రాసిన హ్యారీ పోటర్‌ సిరీస్‌, అన్నా సెవెల్‌ రాసిన బ్లాక్‌ బ్యూటీ తదితర రచనల స్ఫూర్తితో రాయడం ప్రారంభించానని షినే చెబుతోంది. తనకు ఎనిమిదేళ్లు ఉన్నప్పటి నుంచే పుస్తకాలు చదవడం ప్రారంభించింది. ఎప్పటికైనా రచయితగా మారాలని అప్పుడే అనుకుందట. చాలా తక్కువ సమయంలోనే తన ఆశయాన్ని నెరవేర్చుకుంది. భవిష్యత్తులో మరిన్ని పుస్తకాలు రాయాలనుకుంటోంది. మరి మనం షినేకు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేద్దామా ఫ్రెండ్స్‌!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని