అర్మాన్‌ సాధించాడు..!

హాయ్‌ నేస్తాలూ..! మనలో కొందరు చదువులో ముందుంటారు.. ఇంకొందరు ఆటలు, పాటల్లో.. మరికొందరేమో.. యాక్టింగ్‌, రచనల్లో ఇంకా వివిధ రంగాల్లో వారి ప్రతిభను చాటుకుంటారు.

Updated : 06 Feb 2024 05:44 IST

హాయ్‌ నేస్తాలూ..! మనలో కొందరు చదువులో ముందుంటారు.. ఇంకొందరు ఆటలు, పాటల్లో.. మరికొందరేమో.. యాక్టింగ్‌, రచనల్లో ఇంకా వివిధ రంగాల్లో వారి ప్రతిభను చాటుకుంటారు. వాటి కోసం చాలా కష్టపడుతుంటారు అంతే కదా..! ఇన్ని లక్షణాలు వేరువేరు వ్యక్తుల్లో ఉండటం సహజం. కానీ అన్నీ ఒకరిలోనే ఉంటే.. ఆ ప్రతిభతో రికార్డుల మీద రికార్డులు సాధిస్తే.. భలే ఉంటుంది కదా..! ఇప్పుడు మనం అలాంటి ఓ చిన్నారి గురించే చెప్పుకోబోతున్నాం. ఆ విశేషాలన్నీ తెలుసుకోవాలంటే.. వెంటనే ఈ కథనం చదివేయండి..!

త్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి చెందిన అర్మాన్‌ ఉభ్రానికి తొమ్మిదేళ్లు. ప్రస్తుతం మూడో తరగతి చదువుతున్నాడు. ఈ బుడతడు వయసులో చిన్నోడే అయినా.. ప్రతిభలో మాత్రం తన ఘనతను చాటుకుంటున్నాడు. సాధారణంగా గణితం అంటేనే కాస్త భయపడిపోతాం. కానీ ఈ బుడతడు.. తనకు అయిదేళ్ల వయసు ఉన్నప్పుడే.. 100 మల్టిప్లికేషన్స్‌ కేవలం 12 నిమిషాల 28 సెకన్లలో పూర్తిచేసి.. ‘ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’, ‘హార్వర్డ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’లో స్థానం సంపాదించాడు.

రచయిత కూడా..!

ఆరేళ్ల వయసులో స్కూల్లో చెప్పిన రైమ్స్‌ నేర్చుకోవడం, హోంవర్క్‌ చేయడమే కష్టంగా భావిస్తారు కొంతమంది పిల్లలు. కానీ మన అర్మాన్‌ మాత్రం.. ‘ది పింక్‌ డాల్ఫిన్స్‌’, ‘ప్లానెటరీ వరల్డ్‌ అండ్‌ మై కాంటినెంట్‌ ఏషియా’ సిరీస్‌ పుస్తకాలు రాసి.. అతిచిన్న వయసులో రచయితగా ప్రపంచ గుర్తింపు పొందాడు. ఇంతటి ప్రతిభ కనబర్చిన అర్మాన్‌ని మన భారత ప్రభుత్వం కూడా గుర్తించి.. ఆర్ట్‌ అండ్‌ కల్చర్‌ విభాగంలో.. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాన్ని అందించింది. ఈ చిన్నారికి పుస్తకాలు చదవడంతో పాటుగా.. వేదిక మీద నాటకాలు వేయడం, చదరంగం ఆడటం అంటే కూడా చాలా ఇష్టమట. ఎంతైనా మన అర్మాన్‌ చాలా గ్రేట్‌ కదూ..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని