కోతి చేతికి మామిడి పండ్లు!

ఒక కోతి చెట్టుపై నుంచి కిందకు దూకేటప్పుడు దాని కాలుకు గాయమైంది. దాన్ని కాస్త కదపాలన్నా కష్టమైంది. దీంతో ఆహారం లేకుండా నీరసించిపోయింది. ఒక రోజు అది కుంటుతూ ఆయాసంతో నెమ్మదిగా ఒక మామిడి చెట్టు వద్దకు వెళ్లింది. దానికి కొన్ని పండ్లే ఉన్నాయి. కాలుకు గాయం వల్ల అది చెట్టు ఎక్కలేకపోయింది.

Updated : 02 Jul 2021 01:12 IST

ఒక కోతి చెట్టుపై నుంచి కిందకు దూకేటప్పుడు దాని కాలుకు గాయమైంది. దాన్ని కాస్త కదపాలన్నా కష్టమైంది. దీంతో ఆహారం లేకుండా నీరసించిపోయింది. ఒక రోజు అది కుంటుతూ ఆయాసంతో నెమ్మదిగా ఒక మామిడి చెట్టు వద్దకు వెళ్లింది. దానికి కొన్ని పండ్లే ఉన్నాయి. కాలుకు గాయం వల్ల అది చెట్టు ఎక్కలేకపోయింది.

ఇంతలో ఒక కాకి వచ్చి ఆ చెట్టుపైన వాలింది. అది తన గాయం సంగతి చెప్పి తనకు రెండు పండ్లను తెంపి కింద పడేయమని కాకిని బతిమాలింది. కానీ అది దాని మాట పట్టించుకోకుండా వెళ్లిపోయింది.

ఇక లాభం లేదనుకున్న కోతి తన తెలివితేటలతో ఆహారం సంపాదించుకోవాలనుకుంది. ఇంకా ఎవరైనా వస్తారేమోనని ఎదురు చూసింది. ఇంతలో ఒక ఎలుగుబంటి అక్కడకు వచ్చింది. కోతి దాంతో.. ‘ఎలుగు మామా! నేను నెలరోజుల వరకు ఉపవాసం ఉంటున్నాను. ఈ సమయంలో ఏ ఒక్క చెట్టును కూడా తొక్కకూడదని నియమం ఉంది. అలాగే మామిడి పండ్లు తప్ప ఇంకేం తినను. నువ్వు నాకు కొన్ని మామిడి పండ్లను ఇచ్చావంటే నీకు కూడా పుణ్యం వస్తుంది’ అంది.

అప్పుడు ఎలుగుబంటి సరేనని చెట్టు పైకి ఎక్కి అది ముందు కొన్ని మంచి పండ్లను తింది. ఓ రెండుమూడింటిని కోతి కోసం కింద పడేసింది. కోతి అవి తిని ‘మామా! ఈ పండ్లు చాలా పుల్లగా ఉన్నాయి. వీటిని నువ్వెలా తిన్నావు?’ అని అంది. అప్పుడు ఎలుగు ఆశ్చర్యంతో ‘నువ్వు అన్నదాంట్లో నిజం లేదు. ఈ పండ్లు ఎంతో తియ్యగా ఉన్నాయి. కావాలంటే మరో నాలుగు కింద పడేస్తాను. తిని చూడు నీకే తెలుస్తుంది’ అని మరికొన్నింటిని కింద పడేసింది. కోతి అవి తిని తన కడుపు నిండుకోవడంతో వెళ్లిపోయింది.
మర్నాడు కోతి మళ్లీ మరొక మామిడి చెట్టు దగ్గరకు వెళ్లింది. ఆ చెట్టు కాండానికి చుట్టుకుని ఉన్న కొండచిలువను చూసి కోతి భయపడింది. తర్వాత ధైర్యం తెచ్చుకుని ‘కొండ చిలువా! నువ్వు చాలా బరువు తగ్గావట కదా! నీకు చెట్టు ఎక్కడం చేతకావడం లేదట. ఇందాక కొన్ని జంతువులు అంటుంటే విన్నాను. నిజమేనా?’ అని అంది.

అప్పుడు కొండ చిలువ కోపంతో ‘నా గురించి ఎవరా మాటలన్నది. ఇదిగో చూడు నా తడాఖా’ అని అది ఎట్టు ఎక్కింది. ‘ఎక్కితే చెట్టు ఎక్కావు. నీకు కళ్లు కనిపించవంట కదా! ఒక వేళ నీ కళ్లు చక్కగా పనిచేస్తే కొన్ని మామిడి పండ్లు కింద పడేయి చూద్దాం’ అంది కోతి.
అది చెప్పినట్లుగానే కొండచిలువ కొన్ని మామిడి పండ్లు తెంపి కింద పడేసింది. కోతి సంతోషంతో అవి తిని వెళ్లిపోయింది. ఆ తర్వాత మరో రోజు మళ్లీ ఇంకో మామిడి చెట్టు దగ్గరకు వెళ్లింది. చెట్టుపైన చిరుతపులి నిద్రపోతోంది. కోతి గట్టిగా ‘ఓ చిరుత మామా! ఈ మామిడి పండ్లు ఎలా ఉన్నాయి. తియ్యాగానా.. పుల్లగానా...’ అని ప్రశ్నించింది. అప్పుడే నిద్ర లేచిన చిరుత ‘నువ్వు చెట్టు ఎక్కి తెంపుకో. ముందు ఇలా పైకి రా’ అని పిలిచింది. ‘ఆహా! నాకు తెలుసులే. నేను చెట్టు ఎక్కితే నువ్వు నన్ను పట్టుకోవాలని చూస్తున్నావు’ అంది.

అప్పుడు చిరుత పులి ‘నేను ఈ పండ్లను తినను. నాకు నీ మాంసం అంటేనే ఎక్కువ ఇష్టం. అందుకే నిన్ను పైకి రమ్మని అంటున్నాను’ అంది. దానికి కోతి ‘సరే! చిరుత మామా! నేనే వస్తాను. కానీ నిన్నటి నుంచి ఉపవాసం వల్ల చెట్టును ఎక్కలేక పోతున్నాను. కొన్ని పండ్లను పడవేశావంటే అవి తిన్న తర్వాత నీ ఇష్టం’ అంది.

అప్పుడు చిరుత పులి కొన్ని పండ్లను తెంపి కిందపడేసింది. కోతి వాటిని తిని వెంటనే చిరుత చూడకముందు పొదల్లోకి పారిపోయింది. ‘అయ్యో! కోతి ఎంత మోసం చేసింది’ అని చెట్టు దిగి చిరుత.. కోతికోసం అడవిలోకి పరుగెత్తింది.
కాసేపటికి పొదల్లో నుంచి బయటకు వచ్చిన కోతి ‘హమ్మయ్యా! ఎలాగో ఈ మూడు రోజులు నా తెలివితేటలతో ఆహారం సంపాదించుకున్నాను. మరి రేపటి సంగతి ఎలాగని ఆలోచించింది. కానీ అంతలోనే దాని కాలు నొప్పి చాలా వరకు తగ్గిందన్న విషయాన్ని గ్రహించింది. ‘సరే రేపటి నుంచి నేనే మెల్లగా చెట్టు ఎక్కుతాను. ఇతర జంతువులు గాయపడితే వాటికి ఆహారాన్ని అందివ్వవచ్చు. ఆ బాధను నేను స్వయంగా అనుభవించాను కదా’ అనుకొని అక్కడి నుంచి కదిలింది.

- సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని