కపర్ది నాయకత్వం!

‘బుజ్జీ, కొంచెం వేగంగా నడవాలమ్మా! లేకపోతే మంద నుంచి మనం బాగా దూరమైపోతాం!’ హెచ్చరిస్తూ అంది తల్లి మేక.

Updated : 06 Apr 2023 00:15 IST

‘బుజ్జీ, కొంచెం వేగంగా నడవాలమ్మా! లేకపోతే మంద నుంచి మనం బాగా దూరమైపోతాం!’ హెచ్చరిస్తూ అంది తల్లి మేక. ‘అమ్మా! మందతో మనకు పనేముంది? మన నాయకుడు కపర్దితో నీకు గొడవైంది కదా! మందతో మనం కలిసుండటం లేదు కదా!’ అని అమాయకంగా అడిగింది బుజ్జి మేక.

‘నిజమే! కానీ మందతో కలిసికట్టుగా నడిస్తేనే మనకు శత్రువుల నుంచి రక్షణ ఉంటుంది. ఈ చిట్టడవిలో జగడం అనే నక్క, ఒక్క మేకైనా ఒంటరిగా చిక్కకపోతుందా?’ అని ఎదురుచూస్తోంది. ఆ క్షణం కోసం జగడం ఏ చెట్టు చాటునైనా పొంచి ఉండి దాడి చేసే ప్రమాదం ఉంది. నాకు మంద మీద అభిమానం లేదు. కానీ జగడం బారి నుంచి మన ప్రాణం దక్కించుకోవాలంటే మందతో కలిసున్నట్లుగానే నడవాలి. తప్పదు.. వేగం పెంచు’ అంది తల్లి మేక.

అమ్మ మాటతో బుజ్జి తన నడకలో వేగం పెంచింది. అంతలోనే జగడం చెట్టు చాటు నుంచి అమాంతం బుజ్జి మీద దాడి చేసింది. రెప్పపాటులో దాన్ని తీసుకొని పరుగు అందుకుంది. ‘బుజ్జిని విడిచి పెట్టు.. బుజ్జీ.. బుజ్జీ!’ అని గట్టిగా అరుస్తూ, జగడం వెనకే వెళ్లసాగింది తల్లి మేక. జగడం చాలా దూరం పరుగు పెట్టింది. తల్లి మేక చూస్తుండగానే అది బుజ్జితో సహా మాయమైంది.

తల్లి మేకకు ఏం చేయాలో తోచలేదు. దూరంగా కనిపిస్తున్న మంద దగ్గరకు పరుగు పరుగున వెళ్లింది. వాటి ముందుకెళ్లి ఆయాసపడుతూ ఆగింది. తల్లి మేకను చూడగానే మందలో మేకలన్నీ ఆగి, ‘ఏమైంది? ఎందుకు కంగారుగా ఉన్నావు’ అని అడిగాయి.
‘కపర్ది ఎక్కడ? నా బుజ్జిని జగడం ఎత్తుకెళ్లింది. నాకు భయంగా ఉంది. బుజ్జి నా ప్రాణం. అది లేకుండా నేను ఉండలేను!’ అని బాధగా అంది తల్లి మేక. అప్పుడు సుబుద్ధి అనే మేక, తల్లి మేకతో... ‘కపర్ది మాతో రాలేదు. ఎక్కడకు వెళ్లిందో తెలియదు’ అని చెప్పింది.

‘ఇప్పుడెలా? నా బుజ్జిని ప్రాణాలతో దక్కించుకునేదెలా?’ సుబుద్ధి కేసి దీనంగా చూస్తూ అడిగింది తల్లి మేక. అప్పుడు సుబుద్ధి చిన్నగా నవ్వుతూ... ‘ఇప్పుడు బాధపడి ప్రయోజనం లేదు. మంద నుంచి విడిపోయి ఒంటరిగా వెళ్లిపోతోందని, అల్లరి ఎక్కువైందని, బుజ్జిని అదుపులో పెట్టమని కపర్ది నీకు చెప్పిన మాటలను నువ్వు వినలేదు. మనల్ని పొగిడే వాళ్లు పరాయి వాళ్లు. మంచి, చెడు చెప్పేవాళ్లు మనవాళ్లన్న విషయాన్ని నువ్వు గమనించలేదు. మందలో అందరి ముందు నిన్ను కపర్ది తిట్టిందనుకున్నావు. చిన్న బుచ్చుకున్నావు. కోపంతో మంద నుంచి విడిపోయావు’ తల్లి మేకను సున్నితంగా మందలిస్తూ అంది. ‘సుబుద్ధి నిజం చెప్పింది’ మందలోని మిగతా మేకలన్నీ దాన్ని సమర్థిస్తూ అనేసరికి తల్లి మేక మరింత బాధ పడింది. ‘చూడండీ! గతాన్ని తవ్వి ప్రయోజనం లేదు. నేను చేసింది తప్పే కావచ్చు. అంగీకరిస్తున్నాను. కానీ నా బుజ్జిని కాపాడే మార్గం చెప్పండి!’ అంటూ వేడుకుంది.

‘మందనే మనకు బలం. మందకు మనమే బలం. కానీ మందను ధైర్యంగా ముందుకు నడిపించే నాయకుడు కపర్ది లేకుండా జగడాన్ని ఎదిరించలేం. తిరగబడి గెలవలేం. కనుక ఇప్పుడు బుజ్జిని కాపాడలేం’ అని గట్టిగా చెప్పింది సుబుద్ధి.

ఆ మాటలతో తల్లి మేకలో దిగులు మరింత ఎక్కువైంది. ‘ఇప్పుడు సమస్య నాదే కావచ్చు. కానీ ఈ సమస్య రేపు మీకూ రావచ్చు. అప్పుడు కూడా కపర్ది వచ్చేంత వరకూ ఆగుతారా? ధైర్యం తెచ్చుకుని ముందుకు సాగుతారా? తప్పు తెలుసుకున్నాను. మీ మాటలు నిజమని ఒప్పుకొంటున్నాను. జగడం ముప్పు నుంచి తప్పించమని వేడుకుంటున్నా. అయినా వినిపించుకోకుండా నాయకుడు లేనిదే కదలలేమంటున్నారు. మంచిది. నా బుజ్జిని నేనే కాపాడుకుంటాను!’ అంటూ ఆవేశంగా తల్లి మేక ముందుకు కదలబోయింది. ఇంతలో ‘అమ్మా..’ అంటూ తన దగ్గరికి చేరిన బుజ్జిని చూసి, తల్లిమేక ఆశ్చర్యపోయింది. ‘జగడం బారి నుంచి ఎలా తప్పించుకున్నావమ్మా?’ అని అడిగింది.

‘తప్పించుకోలేదమ్మా! మన నాయకుడు కపర్ది నన్ను తప్పించింది. జగడంతో పోరాడి.. నన్ను నీ వద్దకు క్షేమంగా చేర్చింది’ అని బదులిచ్చింది. తల్లిమేక, కపర్దిని.. ‘క్షమించండి! కోపంతో మీ అందరికీ దూరమైనా నా బుజ్జిని రక్షించారు’ అంటూ ధన్యవాదాలు చెప్పింది.
అప్పుడు కపర్ది నవ్వుతూ... ‘మందకు నువ్వు దూరం అయ్యావు.. కానీ మంద నీకు దూరం కాలేదు. నిన్ను జగడం అనుసరిస్తుందని నేను గమనించాను. నీ వెనుకనే మరికొన్ని మేకలతో నీకు తెలియకుండా అనుసరించాను. మా ఉనికిని గమనించని జగడం, బుజ్జిని పట్టుకుంది. మరో దారిలో జగడం వెంటపడ్డాను. బుజ్జిని రక్షించగలిగాను’ అంది.

‘నాయకుడికి అందరి క్షేమమూ కావాలి. కపర్ది, బుజ్జి కోసం జగడాన్ని వెంబడించడం నాకు తెలుసు. బుజ్జి క్షేమంగా వస్తుందని కూడా తెలుసు. అందుకే నీ తప్పు నీకు తెలిసేలా కఠినంగా మాట్లాడాను. అర్థమైందా?’ అని సుబుద్ధి అనేసరికి తల్లిమేకకు అంతా తెలిసొచ్చింది. ‘కపర్దిలాంటి వాళ్లు నాయకుడిగా ఉన్నంత కాలమూ.. జగడమే కాదు, ఏ క్రూర జంతువూ మన జోలికి రాదు. కపర్ది నాయకత్వానికి జై!’ అంది తల్లి మేక. ‘జై!.. జై!’ అని బుజ్జి హుషారుగా అనేసరికి కపర్దితో సహా మందలోని మేకలన్నీ ఆనందంగా నవ్వాయి.

కె.వి.లక్ష్మణరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని