Published : 17 Jan 2023 01:07 IST

క్రాంతిని మార్చిన సంక్రాంతి!

క్రాంతి అయిదో తరగతి చదువుతున్నాడు. సాయంత్రం బడి నుంచి ఇంటికి వచ్చాడు. వస్తూనే హాల్లో తన వయసు పిల్లాడిని విచిత్రంగా చూడసాగాడు. ‘అలా తెలియనట్టు చూస్తావేమిరా? మీ మావయ్య కొడుకు చందు. నాలుగు రోజులు ఇక్కడే ఉంటాడు!’ అని క్రాంతి వాళ్ల అమ్మ దేవి చెప్పింది.

‘హాయ్‌.. చందూ!’ అని క్రాంతి చందును విష్‌ చేశాడు. మొహమాటపడుతూ చిన్నగా నవ్వాడు చందు. ‘భయం భయంగా చూస్తున్నాడు. సరిగ్గా మాట్లాడలేడా?’ అని క్రాంతి వాళ్ల అమ్మను అడిగాడు. ‘ఇప్పుడే కదా వచ్చింది. కొంతసేపటికి నీతో కలిసిపోతాడు. నువ్వే కలుపుకోవాలి!’ అని అమ్మ సర్ది చెప్పింది.

‘చందూ.. కింద గ్రౌండ్‌ఫ్లోర్‌కు వెళ్లి ఆడుకుందామా?’ చందు చేయి పట్టుకుంటూ అడిగాడు క్రాంతి. ‘క్రాంతితో వెళ్లి ఆడుకో!’ అని దేవి చెప్పడంతో చందు కదిలాడు. చందు మెట్లు దిగుతూ ఉండగా... ‘మెట్లెందుకు దండగ.. ఎదురుగా లిఫ్ట్‌ ఉండగా!’ అంటూ క్రాంతి చందును లిఫ్ట్‌లోకి తీసుకుని వెళ్లాడు.

‘లిఫ్ట్‌ స్విచ్‌ ఆన్‌ చేయి’ అని క్రాంతి అన్నాడు. ‘నాకు రాదు. భయంగా ఉంది’ అని చందు లిఫ్ట్‌కేసి అదోలా చూస్తూ అన్నాడు. ‘హా.. హా.. లిఫ్ట్‌ అంటే భయమా! మా అపార్ట్‌మెంట్‌లో మూడేళ్ల బుడతడు కూడా లిఫ్ట్‌ ఆన్‌ చేస్తాడు. లిఫ్ట్‌లో ఆడుకుంటాడు’ అంటూ చందూకేసి వెటకారంగా చూస్తూ, వెక్కిరింపుగా నవ్వాడు క్రాంతి.

‘లిఫ్ట్‌ ఎక్కడం ఇదే మొదటిసారి. అలవాటు లేదుగా. అందుకే భయంగా ఉంది’ చందు బదులుగా అన్నాడు. గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉన్న స్నేహితులకు చందును పరిచయం చేశాడు క్రాంతి. చందు మొహమాటం చూసిన స్నేహితులు. ‘పల్లెటూరి పిల్లాడు కదా.. మొహమాటం వారికి మామూలే!’ చందును వెక్కిరింపుగా చూస్తూ అన్నారు. ‘భలేగా అన్నారు. లిఫ్ట్‌ ఎక్కడం కూడా రాదు’ అని క్రాంతి కూడా మళ్లీ వెక్కిరిస్తూ స్నేహితులకు వంతపాడుతూ అన్నాడు. చందు చాలా బాధపడ్డాడు. కొంతసేపటికి క్రాంతితో కలిసి అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లిపోయాడు. నాలుగు రోజుల తర్వాత తండ్రి రావడంతో తనింటికి వెళ్లిపోయాడు చందు.

ఈలోగా సంక్రాంతి వచ్చింది. బడికి సెలవులిచ్చారు. ‘క్రాంతీ.. ఈ సంక్రాంతికి మనం రామాపురంలో ఉన్న మావయ్య ఇంటికి వెళుతున్నాం’ అని అమ్మ అంది. ‘అమ్మా.. నేను ఆ పల్లెటూరుకు రాను. అక్కడ ఉండలేను’ అని క్రాంతి అసహనంగా అన్నాడు.
‘తింటే గారెలు తినాలి. వింటే భారతం వినాలి. అలాగే సంక్రాంతి సంబరాలు పల్లెటూరులోనే జరుపుకోవాలి. మొదటి రోజు భోగి. ఊరూరా భోగి మంటలు వేస్తారు. పిల్లలకు భోగి పండ్లు పోస్తారు. రెండోరోజు సంక్రాంతి. బంధువులందరూ ఒకే చోట కలిసి అనుబంధాలను పంచుకుంటారు. ఆత్మీయతను పెంచుకుంటారు. మూడోరోజు కనుమ. అన్నదాతలు పశువులను కొలుస్తారు. వాటిని అలంకరిస్తారు. ఇక పంట చేలలో జరిగే ప్రభల తీర్థాన్ని చూడటానికి జనాలు తండోపతండాలుగా తరలి వస్తారు. ఎంతో ముచ్చటగా జరుపుతారు. గంగిరెద్దు ఆటలు, హరిదాసు పాటలు, ప్రతి ఇంటి ముందూ ముత్యాలముగ్గులు, మధ్యలో బంతిపూల గొబ్బెమ్మలు, ఆ అందాలు చూడాలంటే పల్లెటూరు వెళ్లాల్సిందే. అందుకే వద్దనకు’ అని అమ్మ గట్టిగా చెప్పడంతో, క్రాంతి తప్పక రామాపురం వెళ్లాడు.
క్రాంతిని చూడగానే చందు ఎంతో సంతోషించాడు. ‘ఈరోజు బడికి సెలవు కదా! మా స్నేహితులందరూ తోటలో ఆడుకుంటారు. మనమూ వెళదాం. నాతో రా.. క్రాంతీ..’ క్రాంతి చేయి పట్టుకుంటూ అన్నాడు చందు.

‘వెళ్లి.. ఆడుకో’ అని అమ్మ అనడంతో కాదనలేక ముందుకు కదిలాడు క్రాంతి. దారికి ఇరువైపులా పొడవైన కొబ్బరి చెట్లు, పచ్చని పంటచేలు, వాటి నుంచి వీచే చల్లని గాలి.. ఇవన్నీ క్రాంతికి నచ్చాయి. తోటలోకి వెళ్లేందుకు చిన్నవాగు దాటాల్సి వచ్చింది. చందు, క్రాంతితో మాట్లాడుతూనే ఎంతో సులువుగా వాగుపై ఉన్న తాటి దుంగ మీద నడుస్తూ ఆవలి గట్టుకు చేరాడు. కానీ క్రాంతి భయపడుతూ ఆగిపోయాడు. అడుగు వేయలేక అలాగే ఉండిపోయాడు.

అది గమనించిన చందు... ‘నీకు అలవాటు లేదుగా.. కంగారు పడకు!’ అంటూ చేయి అందించాడు. చందు సాయంతో.. క్రాంతి కూడా ఆవలి గట్టుకు చేరాడు. ఆపై చందూ స్నేహితులతో కలిసి సంతోషంగా ఆడుకున్నాడు. వారి ఆదరణ, అందమైన పలకరింపులు చూసి మురిసిపోయాడు. తిరిగి ఇంటికి వచ్చి ఆ విషయాలను అమ్మతో ఆనందంగా చెప్పాడు.

అప్పుడు అమ్మ... ‘చూశావా... క్రాంతీ! నువ్వు చందుకు లిఫ్ట్‌ ఎక్కడం రాదని తెలిసి అప్పుడు వెక్కిరించావు. స్నేహితులతోనూ చెప్పి చందును చిన్నచూపు చూశావు. చందు నాతో చెప్పి బాధపడ్డాడు. అయితే ఇప్పుడు నీకు వాగు దాటడం రాదని చందు నిన్ను వెక్కిరించలేదు. చేయి అందించాడు. వాగు దాటించాడు. మనకు తెలిసిన పని మరొకరికి రాకపోతే వెటకారం చేయకూడదు. సాయం చేయాలి. ఈ విషయం నీకు తెలియాలనే నిన్ను ఇక్కడకు తీసుకువచ్చాను. చందుతో కలసి ఆడుకోమన్నాను. మనం నేర్చుకున్న విద్య నలుగురికీ పంచేలా ఉండాలి. అహంకారాన్ని పెంచేలా ఉండకూడదు. అప్పుడే విద్యకు సార్థకత చేకూరుతుంది. చందూ గుణం ఇప్పటికైనా తెలిసిందా?’ అని అమ్మ అడిగింది.

‘తెలిసింది. నాలో మార్పు మొదలైంది!’ అన్నాడు క్రాంతి. ‘సంక్రాంతి అంటేనే మార్పునకు స్వాగతం పలకడం. క్రాంతిని మార్చిన సంక్రాంతి’ అని అమ్మ నవ్వుతూ అంది. ‘భలేగా చెప్పావమ్మా!’ అని క్రాంతి కూడా నవ్వుతూ అమ్మతో అన్నాడు.  

కె.వి.లక్ష్మణరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు