నక్క చేసిన చక్కని మేలు!

ఒక అడవిలో జంతువులు, పక్షులు కలిసిమెలిసి ఉండేవి. ఆ అడవిలో ఒక పాడలేని కోకిల, శబ్దం వినలేని కుందేలు ఉండేవి. ఒకరోజు ఓ నక్క కొత్తగా ఆ అడవికి వచ్చింది. జంతువులు, పక్షులు నక్కకు అతిథి మర్యాదలు చేశాయి. అది విశ్రాంతి తీసుకున్న తర్వాత వివరాలు అడిగాయి. ‘నేను చంపావతి అడవి నుంచి వచ్చాను. నాలుగు వనాలు తిరిగి అక్కడి పరిపాలనా విధానాలు...

Published : 02 Mar 2023 00:09 IST

క అడవిలో జంతువులు, పక్షులు కలిసిమెలిసి ఉండేవి. ఆ అడవిలో ఒక పాడలేని కోకిల, శబ్దం వినలేని కుందేలు ఉండేవి. ఒకరోజు ఓ నక్క కొత్తగా ఆ అడవికి వచ్చింది. జంతువులు, పక్షులు నక్కకు అతిథి మర్యాదలు చేశాయి. అది విశ్రాంతి తీసుకున్న తర్వాత వివరాలు అడిగాయి.

‘నేను చంపావతి అడవి నుంచి వచ్చాను. నాలుగు వనాలు తిరిగి అక్కడి పరిపాలనా విధానాలు, జీవన పద్ధతులు తెలుసుకొని రమ్మని మా మృగరాజు పంపాడు. నేను ఇప్పటి వరకు మూడు అడవులు తిరిగాను. నాలుగో అడవిగా మీ వనానికి వచ్చాను’ అని తన వివరాలు చెప్పింది నక్క.

ఏనుగు రాజు, మిగతా జంతువులు తమ రాజ్యం వివరాలను నక్కకు వివరించాయి. అక్కడి సంస్కృతి, సంప్రదాయాలను పరిశీలించడానికని నక్క అతిథిగా పదిరోజులపాటు అక్కడే ఉండిపోయింది. నక్కకు కూతరాని కోకిల గురించి, వినలేని కుందేలు గురించి తెలిసింది.

పక్షులు, జంతువులతో... ‘మిగతా కోకిలలు కమ్మగా పాటలు పాడుతుంటే, ఈ కూతరాని కోకిల మనసులో ఎంత బాధపడుతుందో కదా! శబ్దం వినిపించని కుందేలు ఏ పక్క నుంచి ఏ ప్రమాదం వస్తుందో అర్థంకాక ప్రాణభీతితో ఎంత నరకం అనుభవిస్తోందో కదా! మా అడవిలో వైద్యం తెలిసిన చంపకం అనే కోతి ఉంది. అది ఏ ఆరోగ్య సమస్యనైనా నయం చేయగల దిట్ట. కోకిల, కుందేలును మా అడవికి తీసుకెళతాను. వైద్యం చేయించి నయమయ్యాక తీసుకువస్తాను’ అని అంది నక్క.

అక్కడే ఉన్న ఓ కోతి.. జంతువులు, పక్షులను పక్కకు తీసుకెళ్లి... ‘మనం కూతరాని కోకిల, వినపడని కుందేలును ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాం. మనం ఈ కొత్త నక్క మాటలు నమ్మి వాటిని దాని వెంట పంపితే ఎలా? అది వాటిని దారిలోనే తినేయవచ్చు. కొత్తవారిని నమ్మరాదు’ అని తన అనుమానాన్ని వ్యక్తం చేసింది.

‘నువ్వు చెప్పింది నిజమే! ఆలోచించాల్సిన విషయమే’ అన్నాయి జంతువులు, పక్షులు. ‘తోడుగా దేనినైనా పంపుదాం’ అంది ఏనుగు. అన్నీ ఆలోచించి ఎలుగుబంటిని తోడుగా పంపాలని నిర్ణయించుకున్నాయి. ఎలుగుబంటి వెళ్లడానికి ఒప్పుకొంది. అవి నక్క దగ్గరకు వచ్చి.. ‘కోకిల, కుందేలుకు తోడుగా ఎలుగుబంటి వస్తుంది’ అన్నాయి.

నక్కకు వాటి అనుమానం అర్థమైంది. అవి చెప్పినదానికి సరేనంది. నక్క... కోకిల, కుందేలుతోపాటు ఎలుగును తన వెంట తీసుకెళ్లింది. కొంతకాలం తర్వాత అవి నక్కతో కలిసి తిరిగి వచ్చాయి. ఎలుగుబంటి.. జంతువులు, పక్షులతో ‘ఈ నక్క మాటలు నిజమే! చంపకం కోతి వీటిని పరీక్షించింది. ఆకు పసర్లు, వేర్లు, తేనె, వివిధ రకాల విత్తనాలతో మందులు తయారు చేసి వైద్యం చేసింది. ఇప్పుడు కోకిల పాడగలుగుతోంది.. కుందేలు వినగలుగుతోంది.. మనం ఊరికే నక్కను అపార్థం చేసుకున్నాం’ అంది.

జంతువులు, పక్షులు తమను క్షమించమని నక్కకు నమస్కరించాయి. నక్క నవ్వి.. ‘మీ నిర్ణయంలో తప్పు లేదు. నేను మీకు కొత్త కదా! కొత్తవారి మాటలు నమ్మరాదు. ముందుచూపుతో జాగ్రత్తగా వ్యవహరించాలనే పెద్దల మాటను మీరు ఆచరించారు. మీ స్థానంలో నేనున్నా ఇలాగే చేసేదాణ్ని. క్షమాపణ ఎందుకు? కోకిల, కుందేలు ఇప్పుడు ఆనందంగా ఉన్నాయి. నాకు ఇప్పుడు ఎంతో తృప్తిగా ఉంది. నలుగురికీ చేతనైన సాయం చేయడానికి మించిన సంతోషం ఎందులోనూ లేదు’ అంది.

ఆ మాటలకు కోకిల ‘కుహూ... కుహూ..’ అంది. కుందేలు ఆనందంతో గెంతులు వేసింది. నక్క నాలుగు రోజులు వాటితో గడిపి తన అడవికి వెళ్లిపోయింది.

డి.కె.చదువుల బాబు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు