ఓ వంతెన... రెండు మేకలు... ఒక పావురం!

మాపురాన్ని ఆనుకుని ఉన్న అడవి మధ్యలో ఒక జలాశయం ఉంది. బాటసారులు చుట్టూ తిరిగి వెళ్లడానికి కష్టం అవుతుందని నడవడానికి వీలుగా ఒక చిన్న వంతెన నిర్మించుకున్నారు.

Published : 11 Apr 2023 00:03 IST

రామాపురాన్ని ఆనుకుని ఉన్న అడవి మధ్యలో ఒక జలాశయం ఉంది. బాటసారులు చుట్టూ తిరిగి వెళ్లడానికి కష్టం అవుతుందని నడవడానికి వీలుగా ఒక చిన్న వంతెన నిర్మించుకున్నారు. ఆ వారధి చాలా సన్నగా, కర్రలతో నిర్మితమై ఉంది. దాని మీద నుంచి ఒకేసారి ఇద్దరు వ్యక్తులు కానీ, రెండు జంతువులు కానీ ఎదురెదురుగా వెళ్లడం కుదరదు. ఒకరు తప్పుకొంటేనే మరొకరు వెళ్లాలి.  

అడవి మేకల మందలో చిట్టి, చిన్ని అనే మేకలు ఉండేవి. అవి రెండూ ఎప్పుడూ పోట్లాడుకుంటూనే ఉండేవి. మిగతావి వాటికి బుద్ధి చెప్పాలని ప్రయత్నించి విసిగిపోయాయి. ఒకసారి వంతెన మీద చిట్టి, చిన్ని ఎదురెదురుగా వేగంగా వస్తున్నాయి. వంతెన మీద సూది దూరే సందులేదనీ, ఒక మేక వెనక్కు వెళితేనే, ఇంకొక మేకకు ముందుకు వెళ్లే అవకాశం ఉందని రెండింటికీ తెలుసు. కానీ వాటిలో ఏ ఒక్కటి కూడా మరొకదానికి దారి ఇవ్వడానికి ఇష్టపడడం లేదు.

చిట్టి, చిన్ని.. ‘నువ్వు పక్కకు తప్పుకో!’ అంటే.. ‘నువ్వే పక్కకు తప్పుకో’ అని పరస్పరం పోట్లాడుకోసాగాయి. ‘తగ్గితే తలవంపులు’ అని చిన్ని, ‘పక్కకు తప్పుకోవటం అంటే పరువు పోవడమే’ అని చిట్టి పంతానికి పోయాయి.  

ఈ రెండింటిలో ఏ ఒక్కటి కూడా ఓడిపోవటానికి సిద్ధంగా లేవు. చివరికి బలాబలాలు చూసుకుందాం.. అనే స్థాయికి వెళ్లి, కుమ్ముకోవటం మొదలుపెట్టాయి. కొమ్ములు గుచ్చుకొని రెండు మేకలకూ రక్తం చిమ్మింది. రక్తం చూసి మరీ రెచ్చిపోయి పోట్లాడుకుంటున్నాయి. అప్పుడే అటుగా వెళ్తున్న ఒక పావురం ఇదంతా చూసింది.  

‘అయ్యో! ఎంత పని చేస్తున్నారు అన్నయ్యలూ! ఒకసారి నన్ను చూడండి.. ఇటు’ అని వాటి చెవుల దగ్గరకు వెళ్లి అరిచింది. మేకలు రెండూ కొట్టుకోవడం ఆపి పావురాన్ని చూశాయి. ‘మీ ఇబ్బంది ఏంటో నాకు చెప్పండి.. గొడవలతో ఏ సమస్యలూ పరిష్కారం కావు. శాంతంగా చర్చించుకోచాలి’ అంది పావురం. అప్పుడు ఒకదాన్నొకటి రెండు మేకలు చూసుకున్నాయి.

‘నేను వెనక్కు తగ్గను... నేనే ముందు ఆవలి వైపు వెళ్లాలి’ అంది చిట్టి. ‘నేనూ త్వరగా వెళ్లాలి... నాకు తొందరగా వెళ్లే పనుంది’ అంది చిన్ని. పావురం రెండింటినీ తదేకంగా చూసింది. ‘నాకు మీ సమస్య ఏంటో అర్థమైంది. తొందరపడి మీరిద్దరూ గొడవ పడటం వల్ల ఇద్దరికీ ఆలస్యం అవుతుంది. మీలో ఉన్న అహం తొలగించుకుంటేనే మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఒక నిమిషం ప్రశాంతంగా ఆలోచించండి’ అంది పావురం.

గాయాలతో ఉన్న చిట్టి, చిన్ని నొప్పులతో బాధపడుతూ తల దించుకున్నాయి. ‘చిట్టి.. కాస్త దారి ఇస్తావా?’ అని అడిగింది చిన్ని. దాని అవసరాన్ని చిట్టి సహృదయంతో గుర్తించి వెనక్కు వెళ్లింది. చిన్ని వెళ్లిపోగానే తన బాటలో తాను ముందుకు వెళ్లింది చిట్టి.

‘అర్థంలేని అహంకారం అనర్థాలకు దారి తీస్తుంది. మంచి మనసుతో అర్థం చేసుకుంటే క్షేమంగా మీ గమ్యం మీరు చేరుకుంటారు’ అంది పావురం. ‘గొడవలు లేకుండా నీ మంచి మాటలతో శాంతియుతంగా సమస్యలను పరిష్కరిస్తావనే నిన్ను శాంతి కపోతం అంటారు నేస్తమా! ఇక నుంచి మేము కూడా పోట్లాడుకోకుండా స్నేహంగా ఉంటాం’ అన్నాయి చిట్టి, చిన్ని. వాటి మాటలు విని సంతోషంగా ఎగిరిపోయింది పావురం.

కె.వి.సుమలత


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని