నీలోకి నువ్వు!

మనం భగతుండిని అడగాల్సింది ఒక్కటే.. ‘నాకు  సరైన దారిని చూపించు’ అని. ఖురాన్‌ ప్రారంభంలో ‘ఇహ్‌ దినా అల్‌ సిరాతా...

Published : 08 Apr 2021 00:52 IST

ఈనెల 13 ఉగాది సందర్భంగా...

ఉరుకులు... పరుగులు...
ఏం చేస్తున్నామో అర్థం కాదు...
ఎక్కడకు వెళుతున్నామో తెలీదు...
దురాశ, కోపం, దురభిమానం...
వీటి వల్ల వచ్చే దుఃఖం...
అంతు,దరిలేని ఈ సంసార సాగరంలో ఒడ్డుకు దారిచూపే చుక్కాని ఉందా?
...ఉంది
అది అంతఃసమీక్ష!
మరి సామాన్యుడు దాన్ని సాధించేదెలా?

మనం భగతుండిని అడగాల్సింది ఒక్కటే.. ‘నాకు  సరైన దారిని చూపించు’ అని. ఖురాన్‌ ప్రారంభంలో ‘ఇహ్‌ దినా అల్‌ సిరాతా అల్‌ ముస్తాకిమా’ అనే వాక్యం వస్తుంది. నాకు మంచి మార్గాన్ని చూపు అని దాని అర్థం. భగవద్గీత చెప్పినా, ఖురాన్‌ చెప్పినా సందేశం ఒకటే. అదే ఆత్మావలోకనం. పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని ఆవిష్కరింపజేసుకోవడం. అవగాహనతో, అంతఃచేతనతో మనం ఎంచుకునే మార్గం కోటి వెలుగులకు కారణమవుతుంది.
న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః
న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే...

కర్తృత్వం అంటే పనిచేయడం. మనిషి చేసే పనులు, వాటి ఫలితం.. ఇవి ప్రకృతికి అనుగుణంగా జరుగుతూ ఉంటాయని భగవద్గీత చెబుతుంది. పరిస్థితులు, పరిసరాలు మనిషిని ప్రభావితం చేస్తూ ఉంటాయి. మన వ్యక్తిత్వాల్ని అవే తీర్చిదిద్దుతూ ఉంటాయి. ‘జన్మతః ప్రతి మనిషి స్వచ్ఛమైనవాడే. సహజమైనవాడే. కానీ ప్రాపంచిక జీవితంలో అతను అనుదినం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటాడు. కాలం వేసిన కళ్లెంలో ఇరుక్కుంటాడు. పరిస్థితుల మాయాజాలంలో చిక్కుకుంటాడు. దైనందిన జీవితంలోని అనుభవాలు అతని సహజ వ్యక్తిత్వంపై నకారాత్మక మచ్చలను ఏర్పరుస్తూ ఉంటాయి. ఆవేశం, ద్వేషం, ఈర్ష్య, పేరాశ, దురభిమానం, ఓర్వలేనితనం, గర్వం, వాస్తవాన్ని ఒప్పుకోకపోవటం, ప్రతీకారేచ్ఛ- ఇవన్నీ నకారాత్మక మచ్చలే. ఇవి మనిషి సహజత్వాన్ని కలుషితం చేస్తుంటాయి. ఇలాంటి పరిస్థితిలో మనిషి చేయాల్సిందేమిటి?
ఎడతెగని ఆత్మావలోకనం ద్వారా తన జీవితాన్ని తీర్చిదిద్దుకుంటూ ఉండాలి. స్వీయ సంస్కరణ కోసం పరితపించాలి. నిద్ర లేవగానే ఆ రోజు మనం చేయబోయే పనులను  బేరీజు వేసుకోవాలి. ఎలాంటి ఆశలు ప్రేరేపిస్తున్నాయి? ఎలాంటి మోసాలకు మనం పాల్పడబోతున్నాం? ఎంత గర్వంతో వ్యవహరించబోతున్నాం? ఆవేశం, ఈర్ష్య ఆ రోజు పనుల్లోకి చొరబడబోతున్నాయా? ఒకసారి విహంగవీక్షణంలా బేరీజు వేసుకోవాలి. వాటిని తిరిగి రాత్రి నిద్రపోయే ముందు సమీక్షించుకోవాలి. ఇది అసలైన ఆత్మవిమర్శ అవుతుంది. నిజానికి నకారాత్మక భావనల వలలో చిక్కుకోకుండా ఉండడం అసాధ్యమైనా నిరంతర సమీక్ష, అంతర్దర్శనం వల్ల క్రమంగా వ్యక్తిత్వం మెరుగవుతుంది.

-ముని


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని