పేదరాలి ఔదార్యం

క్రీస్తు ఒకరోజు దేవాలయంలో కూర్చుని, భక్తజనం వేస్తున్న కానుకలను గమనిస్తున్నాడు. జన సమూహాలలో చాలా మంది తాము వేస్తున్న డబ్బు ఎంతో తెలియాలని, బయటకు కనపడేలా హుండీలలో

Updated : 21 Oct 2021 05:33 IST

క్రీస్తు ఒకరోజు దేవాలయంలో కూర్చుని, భక్తజనం వేస్తున్న కానుకలను గమనిస్తున్నాడు. జన సమూహాలలో చాలా మంది తాము వేస్తున్న డబ్బు ఎంతో తెలియాలని, బయటకు కనపడేలా హుండీలలో వేస్తున్నారు. అంతలో ఓ పేద వితంతువు మెల్లగా నడుచుకుంటూ వచ్చి, హుండీలో రెండు కాసులు వేసింది. అవి ఏమంత విలువైనవి కాని రాగి నాణేలు. క్రీస్తు ప్రభువు తన శిష్యులను దగ్గరకు పిలిచి, ‘హుండీలో కానుకలు వేసిన వారందరి కంటే, ఈ పేదరాలే ఎక్కువ సొమ్ము వేసింది’ అన్నారు గంభీరంగా. ఆ మాటలు విని శిష్యులు ఆశ్చర్యపోయారు. వాళ్లు ఎక్కువ సొమ్ము వేసినవారిని కొందరిని చూశారు కనుక, ‘ఈమె ఇచ్చిన డబ్బు ఎక్కువెలా అవుతుంది?’ అనడిగారు. ‘మిగతా వాళ్లందరూ తమకు కలిగిన సంపదల నుంచి కొంత సొమ్ము వేశారు. కానీ ఈమె మాత్రం తన దారిద్య్రాన్ని లెక్కచేయకుండా ఉన్న అతి కొద్ది సొమ్ములోంచి కొంత వేసింది. నిజానికి ఈమెకి ఆమాత్రం డబ్బు వేయడం తలకు మించిన భారం. అయినా సరే, తాను ఎంత ఇవ్వగలదో అంతా ఇచ్చేసింది. మనం దేవునికి ఇచ్చే కానుక ఎంత విలువైంది అనేదానికన్నా, ఇవ్వడంలో ఉన్న అంకితభావాన్ని, త్యాగాన్ని ఆయన గమనిస్తాడు’ అంటూ వివరించారు క్రీస్తు.

మరో సందర్భంలో, దానధర్మాల విషయంలో కూడా క్రీస్తు ఒక సందేశం ఇచ్చారు. మనం చేసే దానధర్మాలు రహస్యంగా ఉండాలని చెప్పారు. ‘మీ కుడి చేయి చేసే ధర్మం ఎడమ చేతికి తెలియకూడదు’ అన్నారు.

- కొలికపూడి రూఫస్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని