అసలు సరే.. కొసరూ భారమే!

కొత్త ఇంటి ధరల కంటే ఆపైన అయ్యే వ్యయమే కొనుగోలుదారులను భయపెడుతోంది. రూ.యాభై లక్షల ఇంటిని కొంటే అదనంగా మరో పన్నెండు నుంచి పదిహేను లక్షల రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది. చాలా మంది కొనుగోలుదారులకు ఇది భారంగా మారింది. కల్పించే సౌకర్యాలను బట్టి బిల్డర్లు అదనపు సొమ్మును వసూలు చేస్తున్నారు. అసలు కంటే కొసరే ముద్దు అన్నట్లుగా అదనపు వ్యయాలు పెరుగుతూ పోతున్నాయి. వీటికి తోడు జీఎస్‌టీ, రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు కొనుగోలుదారులపై మరింత భారం మోపుతున్నాయి.  ప్రభుత్వాలు, బిల్డర్లు ఈ భారం కొంతవరకు

Updated : 13 Dec 2020 06:01 IST

ఈనాడు, హైదరాబాద్‌: కొత్త ఇంటి ధరల కంటే ఆపైన అయ్యే వ్యయమే కొనుగోలుదారులను భయపెడుతోంది. రూ.యాభై లక్షల ఇంటిని కొంటే అదనంగా మరో పన్నెండు నుంచి పదిహేను లక్షల రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది. చాలా మంది కొనుగోలుదారులకు ఇది భారంగా మారింది. కల్పించే సౌకర్యాలను బట్టి బిల్డర్లు అదనపు సొమ్మును వసూలు చేస్తున్నారు. అసలు కంటే కొసరే ముద్దు అన్నట్లుగా అదనపు వ్యయాలు పెరుగుతూ పోతున్నాయి. వీటికి తోడు జీఎస్‌టీ, రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు కొనుగోలుదారులపై మరింత భారం మోపుతున్నాయి.  ప్రభుత్వాలు, బిల్డర్లు ఈ భారం కొంతవరకు తగ్గించగలిగితే సొంతిల్లు కొనుగోలు చేసేందుకు కొనుగోలుదారులు సిద్ధంగా ఉన్నారని వేర్వేరు నగరాల్లోని అనుభవాలు సూచిస్తున్నాయి. ధరలు అందుబాటులో ఉంటే అద్దె ఇంట్లో ఉండేవారిలో 47 శాతం మంది కొత్త ఇంటి కొనుగోలుకు సుముఖంగా ఉన్నారని నరెడ్కో సర్వేలో తేలింది.
అపార్ట్‌మెంట్లలోని ఫ్లాట్ల ధరలు ప్రాంతం, విస్తీర్ణాన్ని బట్టి ఉంటాయి. శివార్లలో రెండు పడకœల ఫ్లాట్‌ కొనుగోలు చేసేందుకు బేసిక్‌ ధర చ.అ. రూ.4150 చెబుతున్నారు. విస్తీర్ణం 1200 చ.అ. ఇంటి ధర రూ. సుమారు రూ.50 లక్షలు అవుతుంది. సాధారణ అపార్ట్‌మెంట్లలో కారు పార్కింగ్‌, జనరేటర్‌ సౌకర్యం కల్పించేందుకు రూ.2.5 లక్షల నుంచి అదనంగా తీసుకుంటున్నారు. అదే గేటెడ్‌ కమ్యూనిటీల్లో కారు పార్కింగ్‌కు, సౌకర్యాలకు వేర్వేరుగా తీసుకుంటున్నారు. ఇక మొత్తం ధరపై 5 శాతం జీఎస్‌టీ చెల్లించాలి. ఇందుకు దాదాపు రూ.3 లక్షలు సిద్ధం చేసుకోవాలి. ఒకటి రెండేళ్లు నిర్వాహణ ఛార్జీలు, కార్పస్‌ ఫండ్‌ కోసం మరో రెండు లక్షలు సిద్ధం చేసుకోవాలి. కొనుగోలు సమయంలోనే ఇవన్నీ చెల్లించాలి. చివరగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలంటే ఇంటి ధరలో 6 శాతం స్టాంప్‌డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ చెల్లించాలి. రూ.50లక్షల ఇంటికి రూ.3 లక్షలు అవుతుంది. జీఎస్‌టీ, స్టాంప్‌డ్యూటీనే ఆరు లక్షలు కట్టాల్సి రావడం తలకు మించిన భారంగా కొనుగోలుదారులు భావిస్తున్నారు.

ఇదీ తేడా..
* తక్కువ విస్తీర్ణంలో నిర్మించిన అందుబాటు ధరల ఇళ్లకు మాత్రం జీఎస్‌టీని ఒక శాతంగా, రిజిస్ట్రేషన్‌, స్టాంప్‌డ్యూటీ ఛార్జీలు యథాతథంగా 6 శాతం వసూలు చేస్తున్నారు.
* నిర్మాణంలో ఉన్న వాటికి మాత్రమే జీఎస్‌టీ వసూలు చేస్తున్నారు. నిర్మాణంలో కొంత తక్కువ ధరకు ఫ్లాట్‌ దొరుకుతుంది. పూర్తయిన ఇళ్లను కొంటే జీఎస్‌టీ వర్తించదు. ధర ఎక్కువే ఉంటుంది.
రెండు రకాలుగా..
పెద్ద సంస్థలు ఇంటి విక్రయ విలువ ప్రకారం పూర్తి ధరకు రిజిస్ట్రేషన్‌ చేయిస్తుండగా, చిన్న బిల్డర్లు ప్రభుత్వ మార్కెట్‌ ధరకు రిజిస్ట్రేషన్‌ చేస్తున్నాయి. రూ.50 లక్షలకు ఇల్లు కొంటే ఆ మేరకే రిజిస్ట్రేషన్‌ కొందరు చేస్తుండగా.. ఆ ప్రాంతంలో రిజిస్ట్రేషన్‌ ధర ప్రకారం కొందరు రూ.30 లక్షలకే చేస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో రూ.25 లక్షలకే రిజిస్ట్రేషన్‌, స్టాంప్‌డ్యూటీ ఛార్జీలు కట్టాలి. ఇక్కడ ఛార్జీలు సగానికి సగం తగ్గుతున్నాయి.

అక్కడ మూడు శాతం తగ్గింపుతో..

కరోనా వేళ స్థిరాస్తి మార్కెట్‌ మంద గమనంలో ఉండటంతో కొనుగోళ్లను ప్రోత్సహించేందుకు తాత్కాలికంగా ఏడు నెలల కాలానికి మహారాష్ట్ర ప్రభుత్వం స్టాంప్‌డ్యూటీని 3 శాతానికి తగ్గించింది. దీంతో ఇంటి విక్రయాలు అమాంతం పెరిగాయి. స్టాంప్‌ డ్యూటీని కర్ణాటకలో 3 శాతం తగ్గించారు. మధ్యప్రదేశ్‌లో రూ.30 లక్షల లోపు లావాదేవీలపై సుంకం తగ్గించారు. మన దగ్గర కూడా ఆరు శాతంగా ఉన్న స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఛార్జీల్లో కొంత తగ్గిస్తే తమపై భారం తగ్గుతుందని కొనుగోలుదారులు అంటున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని