ఆదాయంలో ఇంటి ఈఎంఐ ఎంత?

కొత్త సంవత్సరంలోనైనా సొంతిల్లు కొనాలనేది చాలామంది ఆలోచన. ప్రతినెలా భారీగా అద్దెలు చెల్లించడం కంటే.. గృహరుణం తీసుకుని ఇల్లు కొని దానికే ఈఎంఐ చెల్లిస్తే సరిపోతుంది కదా అనేది ఎక్కువ సామాన్య, మధ్యతరగతివారి ఆలోచన.

Updated : 30 Dec 2023 07:18 IST

కొత్త సంవత్సరంలోనైనా సొంతిల్లు కొనాలనేది చాలామంది ఆలోచన. ప్రతినెలా భారీగా అద్దెలు చెల్లించడం కంటే.. గృహరుణం తీసుకుని ఇల్లు కొని దానికే ఈఎంఐ చెల్లిస్తే సరిపోతుంది కదా అనేది ఎక్కువ సామాన్య, మధ్యతరగతివారి ఆలోచన. ఇంతకీ ఆదాయంలో ఎంత శాతం నెలవారీ కిస్తీలకు కట్టాల్సి ఉంటుంది అంటే 30 శాతమని నైట్‌ఫ్రాంక్‌ ఇండియా స్థోమత సూచిక చెబుతోంది.  

ఈనాడు, హైదరాబాద్‌

గరంలో ఇల్లు కొనేవారు, కట్టుకునేవారిలో అత్యధిక శాతం మంది గృహరుణాల మీదనే ఆధారపడుతుంటారు. తెలంగాణలోని ద్వితీయ, తృతీయ శ్రేణి పట్ణణాల్లోనూ ఇదే ధోరణి కనబడుతోంది. హైదరాబాద్‌లో చూస్తే ఒకప్పుడు తమ ఆదాయంలో ఈఎంఐకి 21 శాతం చెల్లిస్తే సరిపోయేది. అప్పట్లో ఇళ్ల ధరలు అందుబాటులో ఉండేవి. ఇటీవల కాలంలో పెరిగిన ఇళ్ల ధరలు, గృహరుణ వడ్డీరేట్ల దెబ్బకు నెలవారీ ఆదాయంలో 30 శాతం ఈఎంఐ చెల్లించేందుకు సిద్ధపడితేనే ఇల్లు కొనగల్గే పరిస్థితి ఉంది. గత ఏడాది ఇదే పరిస్థితి.. ఇప్పుడు కూడా పెద్ద మార్పు లేదు. 2024లో మాత్రం గృహరుణ వడ్డీరేట్లలో తగ్గుదల నమోదయ్యే అవకాశం ఉందనే అంచనాలతో స్థోమత మెరుగుపడే సూచనలు కన్పిస్తున్నాయని నిపుణులు అంటున్నారు.

ఇతర నగరాల్లో తక్కువే..

అత్యంత సరసమైన నివాస మార్కెట్‌లలో అహ్మదాబాద్‌, కోల్‌కతా, పుణె ముందు వరసలో ఉన్నాయి. ఈ నగరాల్లో 2023లో గృహ కొనుగోలు స్థోమత మెరుగుపడింది. గృహాలకు చెల్లించే ఈఎంఐ, ఆదాయ నిష్పత్తిని పరిగణనలోకి తీసుకుని స్థోమత సూచికను తయారు చేశారు.

  • అహ్మదాబాద్‌లో ఒక కుటుంబం ఆదాయంలో 21 శాతం ఈఎంఐ చెల్లించేందుకు సిద్ధపడితే ఇల్లు కొనుగోలు చేయవచ్చు.
  • కోల్‌కతా, పుణెలలో 24 శాతం చొప్పున, చెన్నైలో 25 శాతం చెల్లించాలి.
  • ముంబయిలో ఇల్లు అంటే ఎంత ఖరీదో అందరికీ తెలిసిందే. ఇక్కడ వచ్చిన ఆదాయంలో సగం కంటే ఎక్కువ 51 శాతం ఈఎంఐ చెల్లించగల్గితేనే గృహరుణంతో ఇల్లు కొనగలరు. గత ఏడాది ఏకంగా 53 శాతం ఉండేది.
  • ముంబయి తర్వాత అత్యంత ఖరీదైన మార్కెట్‌గా హైదరాబాద్‌ మారింది. బెంగళూరుతో పోలిస్తే అక్కడ ఆదాయంలో 26 శాతం ఈఎంఐకు కేటాయిస్తే చాలు. మన దగ్గర మాత్రం 30 శాతం కావాల్సిందే.
  • దేశీయ సగటు 40 శాతంగా ఉంది. ముంబయి మినహా మిగతా నగరాలన్నీ సగటు లోపే ఉండటం కొంత ఊరట. హైదరాబాద్‌లో 2010లో ఆదాయంలో 47 శాతం ఈఎంఐ చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడది 30 శాతానికి తగ్గింది. అయినప్పటికీ ఇతర నగరాల్లోని ప్రజల సగటు ఆదాయాలతో పోలిస్తే ఇక్కడ తక్కువగా ఉండటం.. పశ్చిమ హైదరాబాద్‌ రియాల్టీలో ధరలు ఎక్కువగా పెరగడంతో ఇల్లు చాలామందికి ఖరీదుగానే ఉంది.

ఎలా లెక్కకట్టారు

స్థోమత సూచికను లెక్కించేందుకు నగరంలో నిర్మాణంలో ఉన్న ఇంటి సగటు చదరపు అడుగు ధరను పరిగణనలోకి తీసుకున్నారు. రుణ కాలవ్యవధిని 20 సంవత్సరాలకు లెక్కించారు. ఇంటి విలువలో 80 శాతమే రుణ మంజూరుగా పరిగణనలోకి తీసుకున్నారు. 20 శాతం డౌన్‌పేమెంట్‌గా చెల్లించాల్సి ఉంటుంది. వీటి ఆధారంగా స్థోమత సూచికను రూపొందించారు.


2024లో స్థోమత వృద్ధికి అవకాశం

2024-25 ఆర్థిక సంవత్సరంలో స్థిరమైన జీడీపీ వృద్ధి, ద్రవ్యోల్బణంలో నియంత్రణను అంచనా వేస్తున్నాం. ఆర్‌బీఐ రెపో రేటు తగ్గించాలని నిర్ణయించుకుంటే గృహరుణ వడ్డీరేట్లు తగ్గే అవకాశం ఉంటుంది. ఫలితంగా గృహాల కొనుగోలు స్థోమత గణనీయంగా వృద్ధి చెందుతుందని భావిస్తున్నాం. ఇదే జరిగితే స్థిరాస్తి రంగానికి ప్రోత్సాహాన్ని అందిస్తుంది.

శిశీర్‌ బైజల్‌, సీఎండీ, నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని