సర్కారు వారి రియల్‌ దారేది?

రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. రంగాల వారీగా సమీక్షిస్తూ.. తమ విధానాల ప్రకటనకు సిద్ధం అవుతోంది. ఇందుకు ఆయా రంగాల భాగస్వామ్యులతో ఆలోచనలు స్వీకరించేందుకు, నిపుణుల సలహాలు, సూచనలు తీసుకునేందుకు సిద్ధమనే సంకేతాలను సర్కారు ఇప్పటికే వెల్లడించింది.

Published : 23 Dec 2023 01:26 IST

కొత్త ప్రభుత్వం నుంచి ప్రోత్సాహంపై పరిశ్రమ వర్గాల ఆశాభావం
ఈనాడు, హైదరాబాద్‌

రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. రంగాల వారీగా సమీక్షిస్తూ.. తమ విధానాల ప్రకటనకు సిద్ధం అవుతోంది. ఇందుకు ఆయా రంగాల భాగస్వామ్యులతో ఆలోచనలు స్వీకరించేందుకు, నిపుణుల సలహాలు, సూచనలు తీసుకునేందుకు సిద్ధమనే సంకేతాలను సర్కారు ఇప్పటికే వెల్లడించింది. ఈ నేపథ్యంలో వ్యవసాయం తర్వాత అత్యంత ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తూ, రాష్ట్రానికి ఆదాయం అందిస్తూ, ఇంటి నిర్మాణాలతో సొంతింటి కలను నిజం చేసుకునే అవకాశం కల్పిస్తున్న రియల్‌ ఎస్టేట్‌ రంగం.. భవిష్యత్తులోనూ స్థిరమైన వృద్ధిని సాధించడానికి ప్రభుత్వం, పరిశ్రమ మధ్య పరస్పర సహకార ధోరణి ఉండాలని కోరుకుంటోంది. రియల్‌ ఎస్టేట్‌ పరిశ్రమకు అనుకూలమైన వాతావరణాన్ని పెంపొందించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని నూతన సర్కారు హామీ ఇచ్చినట్లు క్రెడాయ్‌ హైదరాబాద్‌ వెల్లడించింది. పరిశ్రమ దీర్ఘకాల బాగు కోసం ప్రభుత్వం నుంచి స్థిరాస్తి సంఘాలు ఏం ఆశిస్తున్నాయంటే...

కొన్నింటిపై భిన్నాభిప్రాయాలు..

అపరిమిత ఫ్లోర్‌ స్పేస్‌ ఇండెక్స్‌(ఎఫ్‌ఎస్‌ఐ), జీవో 111పై బిల్డర్లు, రియల్‌ఎస్టేట్‌ సంఘాల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వీటిపై అందరితో విస్తృతంగా చర్చించి పరిశ్రమకు, పర్యావరణానికి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాల్సి ఉందనే అభిప్రాయం వ్యక్తమైంది.


అక్రమ నిర్మాణాలు అరికట్టాలి...

  • గత ప్రభుత్వం మాదిరే కొత్త సర్కారు నుంచి ప్రోత్సాహం లభించాలని కోరుకుంటున్నాం. అన్ని సంఘాలను ఆహ్వానించి సమావేశం పెడితే మా సమస్యలను విన్నవిస్తాం. వారి ఆలోచనలు మాకు తెలుస్తాయి.
  • నగరం అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే రాష్ట్రానికి అత్యధిక ఆదాయం సిటీ నుంచే వస్తుంది. మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టాలి.  
  • ఆకాశహర్మ్యాలున్న చోట వెయ్యి నుంచి 2వేల అపార్ట్‌మెంట్లు వస్తున్నాయి. వీరంతా వాహనాలతో ఒకేసారి బయటికి వస్తే తట్టుకునే స్థాయిలో మౌలిక వసతులు అంతగా పెరగలేదు. రహదారుల విస్తరణ, కొత్తదారుల ఏర్పాటు, ఒకే వైపు అభివృద్ధి కేంద్రీకృతం కాకుండా చర్యలు చేపట్టాలి.
  • నగరంలో సొంతింటి కోసం ఎదురుచూస్తున్నవాళ్లు ఇంకా చాలామంది ఉన్నారు. ఇళ్లకు డిమాండ్‌ ఉంది. అధికంగా ఉన్న అనుమతుల ఫీజులు తగ్గిస్తే ఇంటి ధర కొంత తగ్గడానికి, మరింత పెరగకుండా ఉండేందుకు అవకాశం ఉంది.  
  • అక్రమ నిర్మాణాలను ఆపాల్సి ఉంది. మున్సిపల్‌ అధికారుల పర్యవేక్షణ తగ్గిపోయింది. పెంచాలని కోరుతున్నాం. రెండు వందల నుంచి మూడు వందల గజాల స్థలాల్లోనే సెట్‌బ్యాక్‌లు లేకుండా ఇంటియజమానులు ఆరేడు అంతస్తులు కడుతున్నారు. కానీ చెడ్డపేరు పరిశ్రమకు వస్తోంది. అక్రమ కట్టడాలపై రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా ప్రత్యేక దృష్టి పెట్టాలి.  
  • శివార్ల వరకు రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపరిస్తే దూరమైనా సరే అందుబాటు ధరల్లో నిర్మించే ఇళ్లను కొనుక్కోగలుగుతారు. ఆ రకంగా పరిశ్రమకు, కొనుగోలుదారులకు మేలు జరుగుతుంది.

ప్రభాకర్‌రావు, అధ్యక్షుడు, తెలంగాణ బిల్డర్స్‌ ఫెడరేషన్‌


నాలుగు వైపులా శాటిలైట్‌ సిటీలు రావాలి..  

  • ప్రాంతీయ వలయ రహదారి(ఆర్‌ఆర్‌ఆర్‌) రవాణాపరమైన రోడ్డు కోసమే కాకుండా ఒక గ్రోత్‌ ఇంజిన్‌లాగా మార్చాలి. ఇరువైపులా పరిశ్రమల ఏర్పాటుతో ఉత్పత్తి కేంద్రాలుగా అభివృద్ధి చేయాలి.
  • ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రవేశించే జిల్లాల్లో మూడు నుంచి పది ఎకరాల విస్తీర్ణంలో నైపుణ్య కేంద్రాలు, వసతి గృహాలు ఏర్పాటు చేయాలి. దీంతో అంతర్జాతీయంగా డిమాండ్‌ ఉన్న కార్మికులను సిద్ధం చేయాలి. కెనడా, యూరోప్‌, జపాన్‌, రష్యా వంటి దేశాల్లో కార్మికులకు డిమాండ్‌ ఉంది.
  • ఉపాధి కల్పనతో ఆర్‌ఆర్‌ఆర్‌, ఓఆర్‌ఆర్‌ మధ్యన లేఅవుట్‌, టౌన్‌షిప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. వీటికి రహదారి అనుసంధానం చేస్తే శాటిలైట్‌ టౌన్‌షిప్పులుగా అభివృద్ధి చెందుతాయి. సిటీపై జనాభా ఒత్తిడి తగ్గుతుంది. దీంతో దీర్ఘకాలానికి స్థిరాస్తి రంగం సుస్థిరాభివృద్ధికి దోహదం చేస్తుంది.
  • నగరం నాలుగువైపులా మేడ్చల్‌, సంగారెడ్డి, షాద్‌నగర్‌, ఘట్‌కేసర్‌ ప్రాంతాల్లో ఒక్కోటి 150 చదరపు కిలోమీటర్ల పరిధిలో శాటిలైట్‌ సిటీలు ఏర్పాటు చేయాలి. మౌలిక వసతులన్నీ కల్పించాలి. విద్యాలయాలు, ఆసుపత్రులు, క్రీడా సదుపాయాలు, పౌర సేవలు కల్పించాలి. అక్కడే ఉపాధి కల్పించే వర్క్‌స్టేషన్లు ఉండేలా ప్రోత్సాహించాలి. ఏటా 4 లక్షల వలసలను సిటీ తట్టుకోలేదు కాబట్టి టౌన్‌షిప్పుల అభివృద్ధితో భారం తగ్గుతుంది. దిల్లీ, బెంగళూరులో ఉన్నట్లు ట్రాఫిక్‌, కాలుష్య సమస్య లేకుండా ముందే మేల్కొన్నట్లు ఉంటుంది.
  • జీవో 111 పరిధిలో పర్యావరణహిత మాస్టర్‌ ప్లాన్‌ వచ్చేవరకు ఆపేయడం మేలు.
  • అపరిమిత ఫ్లోర్‌ స్పేస్‌ ఇండెక్స్‌(ఎఫ్‌ఎస్‌ఐ)తో పశ్చిమ హైదరాబాద్‌లో మౌలిక వసతులపై ఒత్తిడి పెరుగుతోంది. దీన్ని పునఃపరిశీలించాలి. అన్నివైపులా హైదరాబాద్‌ సుస్థిరాభివృద్ధికి ఇది చాలా అవసరం.

జి.వి.రావు. అధ్యక్షుడు, తెలంగాణ డెవలపర్స్‌ అసోసియేషన్‌


సిటీని మరింతగా విస్తరించాలి..

  • హైదరాబాద్‌ స్థిరాస్తి రంగం ప్రస్తుతం వృద్ధి బాటలో ఉంది. కొత్త ప్రభుత్వం, కొత్త నాయకుడి ఆధ్వర్యంలో మరింత ముందుకు వెళ్తుందని ఆశాభావంతో ఉన్నాం. కొత్త సీఎం కూడా రియల్టర్‌ కాబట్టి  రియల్‌ ఎస్టేట్‌పై, హైదరాబాద్‌ అభివృద్ధిపై విజన్‌ ఉంటుంది.
  • ఎన్నికల సమయంలో ఎప్పుడైనా మార్కెట్‌ నిలకడగా ఉంటుంది. ప్రభుత్వ విధానాలపై స్పష్టత రాగానే మళ్లీ గాడిలో పడుతుంది. నగరంతో పాటూ శివార్ల అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. ప్రాథమిక అవసరాలైన ట్రాఫిక్‌, పారిశుద్ధ్యం, మురుగునీటి సమస్యలు లేకుండా చూడాలి. ఒకవైపే సిటీ రద్దీగా మారకుండా అన్నివైపుల అభివృద్ధి చెందేలా ప్రణాళికలు ఉండాలి. సిటీలో ట్రాఫిక్‌, నీటి వంటి సమస్యలు లేకుండా మరింతగా విస్తరించాలి.
  • మార్కెట్‌ ఎంతలా పెరుగుతున్నా.. సామాన్యులు ఇళ్లు కొనే పరిస్థితి ఉండాలి. అందుబాటు ఇళ్ల నగరంగా హైదరాబాద్‌కు ఉన్న పేరును పోగొట్టుకోవద్దు. అందుకు ప్రభుత్వం వైపునుంచి తోడ్పాటు ఉంటేనే సాధ్యం అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం స్టాంపుడ్యూటీని అందుబాటు ఇళ్లపై నామమాత్రం చేయాలి.
  • కేంద్రం సైతం అందుబాటు ఇళ్ల విస్తీర్ణాన్ని పెంచాలి. రెండు పడక గదుల ఇల్లు అంటే రూ.70-80 లక్షలు అవుతుంది. ఈ ధరల శ్రేణిలో కట్టే ప్రాజెక్టులకు జీఎస్‌టీ తగ్గించాలి. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో సామాన్యులకు ఇంటి కలను సాకారం చేయవచ్చు.
  • మున్ముందు దక్షిణం వైపు వృద్ధి ఉంటుందని అంచనా వేస్తున్నాం. విమానాశ్రయం ఉండటం, సిటీని రహదారి అనుసంధానం, ఖాళీ ప్రదేశాలు ఉండటంతో అటువైపు సిటీ విస్తరణ ఉంటుంది.

జైదీప్‌రెడ్డి, ప్రెసిడెంట్‌ ఎలెక్ట్‌, క్రెడాయ్‌ హైదరాబాద్‌


రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు తగ్గించాలి...

  • ఇప్పటివరకు కొనసాగిన విధానాలను, అభివృద్ధి పనులను కొత్త ప్రభుత్వం కొనసాగించాలి.
  • కొన్ని విధానపరమైన నిర్ణయాలు తీసుకునే ముందు తమను కూడా భాగస్వామ్యం చేస్తే ఆచరణలో సాధ్యమయ్యే సూచనలు చేసేందుకు అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఆలోచనలు, అంచనాలు తమకు అర్థమవుతాయి.
  • కొత్త సర్కారు శాటిలైట్‌ టౌన్‌షిప్పుల ఆలోచన చేస్తున్నట్లు ప్రకటించింది. అక్కడ అందుబాటు ధరల్లో ఇళ్ల నిర్మాణం కోసం బిల్డర్లు, అసోసియేషన్లను భాగస్వామ్యం చేస్తే బాగుంటుంది. చిన్న, స్థానిక బిల్డర్లకు ఆయా టౌన్‌షిప్పుల్లో ప్రాధాన్యం ఇవ్వాలి.
  • రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి తగ్గిస్తే మేలు. రిజిస్ట్రేషన్‌, స్టాంప్‌డ్యూటీ, ట్రాన్స్‌ఫర్‌, మ్యుటేషన్‌ ఛార్జీలు కలిపి 7.6 శాతంగా ఉన్నాయి. ఇందులో 3 శాతం వరకు తగ్గిస్తే కొనుగోలుదారులకు మేలు జరుగుతుంది. రిజిస్ట్రేషన్‌, జీఎస్‌టీ.. కొనుగోలుదారులు భారంగా భావిస్తున్నారు. వడ్డీరేట్లు అధికంగా ఉన్నాయి. ఈ ప్రభావం విక్రయాలపై పడకుండా ఉండేందుకు ఛార్జీల రూపంలో సర్కారు ఉపశమనం కల్గిస్తే కొనుగోలుదారులు ముందుకొస్తారు.
  • ఇళ్లపై జీఎస్‌టీ ఇదివరకు ఇన్‌పుట్‌ టాక్స్‌ సబ్సిడీ తీసుకుంటే 12 శాతం, సబ్సిడీ లేకుండా 5 జీఎస్‌టీ చెల్లించే వెసులుబాటు ఉండేది. రెండింటిలో బిల్డర్‌ తమకు అనువైన దాన్ని ఎంచుకునేవారు. ఇప్పుడా అవకాశం లేదు. నిర్మాణంలో ఉన్న ఇళ్లపై 5 శాతం చెల్లిస్తున్నాం. గతంలో మాదిరి రెండింటిలో ఏది కావాలంటే దాన్ని ఎంచుకునే అవకాశం బిల్డర్‌కు ఇవ్వాలి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలి. 

ఎం.విజయసాయి, ప్రధాన కార్యదర్శి, నరెడ్కో తెలంగాణ


ఉపాధి అవకాశాలు కల్పిస్తేనే...

ఫార్మాసిటీ భూముల్లో టౌన్‌షిప్పులను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. టౌన్‌షిప్పు అభివృద్ధి చెందాలంటే ఉపాధి అవకాశాలు పెరగాలి.. కంపెనీలను ఆయా ప్రాంతాల్లో ఏర్పాటుకు ప్రోత్సహించాలి. ఫార్మా వద్దనుకుంటే ఐటీ, హార్డ్‌వేర్‌ ఏదైనా సరే కంపెనీలు అక్కడికి వచ్చేలా ప్రోత్సాహకాలు అందించాలి. సిటీకి దగ్గరలో ఇంత పెద్ద ఎత్తున భూమి లభ్యత ఉండటం గొప్ప అవకాశం. దీని సద్వినియోగానికి పారిశ్రామిక విధానం చాలా ముఖ్యం.    

విక్రాంత్‌ వాసిరెడ్డి, డైరెక్టర్‌, ఎన్‌సీఎల్‌ హోమ్స్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని