అక్కడ కొన్నారో.. అవస్థలే!

మహానగరంలో ఎక్కడైనా కాస్త సొంత జాగా ఉండాలనేది సగటు మనిషి కోరిక. భూమి బంగారమైన నేపథ్యంలో పైసాపైసా కూడబెట్టి పిల్లల చదువులు, పెళ్లిళ్లు ఇతర అవసరాలకు పనికొస్తుందని ఎక్కడో ఒకచోట పెట్టుబడి పెడుతుంటారు. అన్ని జాగ్రత్తలు తీసుకొని పూర్తి అవగాహనతో స్థలం కొనుగోలు చేస్తేనే భవిష్యత్తుకు భరోసా లభిస్తుంది.

Updated : 17 Feb 2024 03:43 IST

నీటి వనరుల చెంత లేఅవుట్లపై అప్రమత్తత అవసరం
పూర్తిస్థాయి పరిశీలన తర్వాతే ముందడుగు మేలు

మహానగరంలో ఎక్కడైనా కాస్త సొంత జాగా ఉండాలనేది సగటు మనిషి కోరిక. భూమి బంగారమైన నేపథ్యంలో పైసాపైసా కూడబెట్టి పిల్లల చదువులు, పెళ్లిళ్లు ఇతర అవసరాలకు పనికొస్తుందని ఎక్కడో ఒకచోట పెట్టుబడి పెడుతుంటారు. అన్ని జాగ్రత్తలు తీసుకొని పూర్తి అవగాహనతో స్థలం కొనుగోలు చేస్తేనే భవిష్యత్తుకు భరోసా లభిస్తుంది. అలాకాకుండా దళారులు, తెలిసిన వారు ఎవరో చెప్పారని...ఎక్కడ పడితే అక్కడ భూమిని కొంటే చివరికి పైసలు మొత్తం పోయి ఆందోళన.. ఆవేదన మిగులుతాయి. అందుకే రాజధాని నగరంలో భూమిపై పెట్టుబడి పెట్టడం ఎంత ప్రయోజనమో... కొనే వేళ ఆచితూచి వ్యవహరించడమూ అంతే ముఖ్యమని గుర్తించాలి. ప్రధానంగా చెరువులు, కుంటలు, వాగులు ఉన్న ప్రాంతాల్లోని వెంచర్లలో కొనేటప్పుడు ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

ఈనాడు, హైదరాబాద్‌: మహానగరం చుట్టుపక్కల భూముల ధరలు అనూహ్యంగా పెరగడంతో కొన్ని ప్రాంతాల్లో ఎక్కడ కొంచెం జాగా కన్పించినా సరే...లేఅవుట్‌ వేసి స్థిరాస్తి వ్యాపారానికి తెరలేపుతున్నారు. చెరువుల ఎఫ్‌టీఎల్‌ (నీటి నిల్వ సామర్థ్యం) ప్రాంతాలనూ వదలిపెట్టడం లేదు. ఇదే తర్వాత కొనుగోలుదారులకు అశనిపాతంగా మారుతోంది. హెచ్‌ఎండీఏ పరిధిలోని శివారు జిల్లాలైన రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి, మెదక్‌, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరిలోని కొన్నిచోట్ల లేఅవుట్‌ వేయాలంటే డీటీసీపీ (డైరెక్టరేట్‌ ఆఫ్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌) లేదంటే హెచ్‌ఎండీఏల నుంచి అనుమతి తప్పనిసరి. ఇందుకు రకరకాల నిబంధనలు ఉంటాయి. తొలుత అది వ్యవసాయేతర భూమై ఉండాలి. ప్రభుత్వానికి నాలా పన్ను చెల్లించాలి. చెరువుల ఎఫ్‌టీఎల్‌లు ఇతర నిషేధిత స్థలాలై ఉండకూడదు. ఇవన్నీ తప్పించుకోవటానికి చాలామంది ఫాం ల్యాండ్‌ పేరుతో చెరువుల ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌(ఎఫ్‌టీఎల్‌) ప్రాంతాలనూ విడిచి పెట్టడం లేదు. ఆయా ప్రాంతాల్లో పట్టాలున్న వారిని మభ్యపెట్టి వారి నుంచి భూమి అనధికారికంగా సేకరించి వెంచర్లు వేసి అమ్ముతున్నారు. ఇలాంటి చోట కొంటే డబ్బు పోగొట్టుకోవడమే కాకుండా.. నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు రావని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఎఫ్‌టీఎల్‌ పరిధిలో లేఅవుట్లు వేసే వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

ఎలా గుర్తించాలంటే...

  • జలవనరుల ఎఫ్‌టీఎల్‌ పరిధులు రెవెన్యూ, నీటిపారుదల శాఖల వద్ద నమోదై ఉంటాయి. చెరువు పూర్తిగా నిండినప్పుడు ఎక్కడి వరకు నీళ్లు వస్తాయనే అంచనాతో వీటిని రూపొందిస్తారు. కాలానుగుణంగా చాలా చెరువులు, గతంలో వాటికి నీటిని చేరవేసే నాలాలు రూపు కోల్పోయాయి. అయినప్పటికీ బఫర్‌జోన్‌లో ఉన్నట్లే లెక్క. ఇక్కడ ఎవరైనా ప్లాట్లు వేసి విక్రయిస్తుంటే కొనేటప్పుడు పూర్తిస్థాయిలో పరిశీలించాలి. సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆరా తీయాలి.
  • హెచ్‌ఎండీఏ పరిధిలోని ఏడు జిల్లాల్లో 3,532 చెరువులను గుర్తించారు. వీటిలో చాలా వరకు ఆక్రమణల పాలయ్యాయి. ఎఫ్‌టీఎల్‌ పరిధినీ కబ్జా చేశారు. తాజాగా హెచ్‌ఎండీఏ వీటి ఎఫ్‌టీఎల్‌ను మ్యాపింగ్‌ చేస్తోంది. ఇప్పటికే ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్లలో నిర్మాణాలు ఉన్నట్లు తేలింది. కోర్టు ఆదేశాలతో భవిష్యత్తులో వీటిని కూల్చివేసే అవకాశం లేకపోలేదు.
  • ఇప్పటికే 2500 పైగా చెరువులకు ఎఫ్‌టీఎల్‌ను నిర్ధారించారు. వీటికి అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా త్రిడీ మ్యాపింగ్‌ చేశారు. హెచ్‌ఎండీఏ, డీటీసీపీ అనుమతులు లేని ప్లాట్లను కొనే ముందే ఇవన్నీ పరిశీలించాలి. ఈ వివరాలను హెచ్‌ఎండీఏ వెబ్‌సైట్‌లో పొందుపర్చింది. కొనే సమయంలో సంబంధిత అధికారులను సంప్రదించి ఒకసారి సరిచూసుకోవడం చాలా అవసరం.
  • సాధారణంగా ఆయా ప్రాంతాల్లో భవిష్యత్తులో భూములు ధరలు పెరుగుతాయని ఆలోచించి చాలామంది  కొంటుంటారు. ఎల్‌ఆర్‌ఎస్‌ (భూ క్రమబద్ధీకరణ పథకం) ద్వారా క్రమబద్ధీకరించుకోవచ్చునని భావిస్తుంటారు. ముఖ్యంగా చెరువు శిఖం, ఎఫ్‌టీఎల్‌లో ఎట్టి పరిస్థితుల్లో కొనకపోవడమే మంచిది. ఇలాంటి స్థలాలను ఎల్‌ఆర్‌ఎస్‌కూ అనుమతించరు. దీంతో పెట్టుబడి పెట్టిన డబ్బులు పోవడమే కాకుండా.. మున్ముందు ఇబ్బందులు తప్పవని గుర్తించాలి.
  • వెంచర్లకు సమీపంలో చెరువు ఇతర జలవనరులు ఉంటే తప్పకుండా అనుమానించాలి. ఆ సర్వే నంబరు ఆధారంగా హెచ్‌ఎండీఏ వద్ద ఎఫ్‌టీఎల్‌ మ్యాపింగ్‌ పరిశీలించాలి. అది ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉంటే తెలిసిపోతుంది. వెంటనే జాగ్రత్త పడే వీలుంటుందని అధికారులు సూచిస్తున్నారు.
  • చాలామంది ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే ఫాం ల్యాండ్‌ పేరుతో రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారు. భవిష్యత్తులో ఈ భూముల్లో నిర్మాణాలు చేపట్టాలంటే లేఅవుట్‌కు అనుమతులు తప్పనిసరి అని గ్రహించాలి. ఇక నాలా, జోన్ల కన్వర్షన్‌కు అధిక ఫీజుల భారం భరించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఈ ఛార్జీలే ఎక్కువగా ఉంటాయి.
  • చెరువుల ఎఫ్‌టీఎల్‌ ప్రాంతంలో చాలామందికి పట్టా భూములు ఉన్నాయి. ఇక్కడ వ్యవసాయం మాత్రమే చేసుకోవాలి. కొన్ని ప్రాంతాల్లో ధరలు పెరగడంతో పట్టా భూములు వెంచర్లుగా మారిపోతున్నాయి. ఫ్లాట్లు, షెడ్లు నిర్మించి విక్రయిస్తున్నారు. ఇలాంటి వాటిని కొనుగోలు చేస్తే తర్వాత ఇక్కట్లు ఎదురవుతాయి. కొనకపోవడమే ఉత్తమం.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని