మ్యుటేషన్‌ తప్పనిసరి

ఇంటి స్థలం కొన్నాం.. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల కార్యాలయాల్లో మన పేరున స్థిరాస్తి రిజిస్ట్రేషన్‌ అయింది అంటే సరిపోదు. ఆ వివరాల ప్రకారం మన పేరుమీద ఆస్తి బదలాయింపు జరిగిందా లేదా అనేది చాలా ముఖ్యం. ధరణి వచ్చినప్పటి నుంచి రిజిస్ట్రేషన్‌తో పాటు మ్యుటేషన్‌ ఛార్జీలు ప్రత్యేకంగా తీసుకుని ఆ వివరాలను స్థానిక రెవెన్యూ లేదంటే మున్సిపల్‌ కార్యాలయాలకు పంపుతున్నారు. కొనుగోలు చేసిన ఆస్తికి యజమానిగా మన పేరు రికార్డులకు ఎక్కుతుంది.

Updated : 20 Jan 2024 04:42 IST

అప్పుడే స్థిరాస్తి యాజమాన్య మార్పిడి
ఈనాడు, హైదరాబాద్‌

ఇంటి స్థలం కొన్నాం.. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల కార్యాలయాల్లో మన పేరున స్థిరాస్తి రిజిస్ట్రేషన్‌ అయింది అంటే సరిపోదు. ఆ వివరాల ప్రకారం మన పేరుమీద ఆస్తి బదలాయింపు జరిగిందా లేదా అనేది చాలా ముఖ్యం. ధరణి వచ్చినప్పటి నుంచి రిజిస్ట్రేషన్‌తో పాటు మ్యుటేషన్‌ ఛార్జీలు ప్రత్యేకంగా తీసుకుని ఆ వివరాలను స్థానిక రెవెన్యూ లేదంటే మున్సిపల్‌ కార్యాలయాలకు పంపుతున్నారు. కొనుగోలు చేసిన ఆస్తికి యజమానిగా మన పేరు రికార్డులకు ఎక్కుతుంది. ధరణి కంటే ముందు కొన్నవాటి యాజమాన్య హక్కులు మారాయా లేదా అనేది పరిశీలించుకోవడం తప్పనిసరి అని స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ అధికారి రవీంద్రరావు తెలిపారు.

మ్యుటేషన్‌ అంటే రెవెన్యూ రికార్డుల్లో స్థిరాస్తి టైటిల్‌ మార్పు. ఆస్తి పత్రాలపై యజమానుల పేర్ల మార్పు. ఇది అనేక సందర్భాల్లో జరుగుతుంది. వారసత్వంగా స్థిరాస్తి సమకూరినా ఆ విషయం అధికారికంగా నమోదు చేయాలని రవీంద్రరావు తెలిపారు. ఆస్తిని ఎవరైనా కొనుగోలు చేసినప్పుడు కూడా ఆస్తి పత్రాలపై కొత్త యజమాని పేరు నమోదు చేయించాలి. ఇది రెవెన్యూ రికార్డులతో పాటు స్థానిక పరిపాలన సంస్థ మున్సిపాలిటీ రికార్డుల్లోనూ నమోదు కావాల్సి ఉంటుంది. ఎవరైనా తనకు నచ్చిన వ్యక్తికి ఆస్తిని బహుమతిగా ఇచ్చినప్పుడు సైతం ఇది జరుగుతుంది. ప్రజాసేవను ఆశించి కొంతమంది దాతలు తమ ఆస్తులను ట్రస్టులకు కానుకగా ఇస్తారు. దాని యజమాని నుంచి మరో వ్యక్తి కొనుగోలు చేసినప్పుడు దానిని ముందుగా రిజిస్టర్‌ చేయించాలి. ఇది స్థానిక సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో జరుగుతుంది. తర్వాత మ్యుటేషన్‌తో స్థిరాస్తి యాజమాన్యం మారుతుంది. అప్పుడే అధికారిక పత్రాలపై నమోదు అవుతుంది.

పన్ను విధింపు సైతం

మనం కొన్న స్థిరాస్తికి సంబంధించి స్థానిక పరిపాలన కార్యాలయం పన్ను విధింపు ఎవరి పేరుతో చేయాలో కూడా మ్యుటేషన్‌తోనే నిర్ణయం జరుగుతుంది. ఇలా జరగకపోతే గతంలో ఉన్న యజమాని పేరుతో పన్ను మదింపు చేస్తారు. దానికి ఆయనే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అందుకే ఆస్తులు చేతులు మారినప్పుడల్లా దాని మ్యుటేషన్‌ తప్పనిసరి. తండ్రి నుంచి పిల్లలకు ఆస్తులు సంక్రమిస్తుంటాయి. వారి తదనంతరం లేదా బతికి ఉన్నప్పుడే పిల్లల పేర్లతో ఆస్తుల రిజిస్ట్రేషన్‌ చేస్తుంటారు. ఇలా చేతులు మారిన ఆస్తులకు కొత్త యజమానులు వస్తారు. ఈ విషయాన్ని అధికారికంగా రెవెన్యూ, మున్సిపల్‌ రికార్డుల్లో నమోదు చేయడమే మ్యుటేషన్‌. ఇది ఆస్తుల కొనుగోలు సందర్భంగా కూడా చేయాల్సి ఉంటుంది. మ్యుటేషన్‌ ప్రక్రియ జరిగితేనే ఒక ఆస్తిపై కొత్త యజమానికి పూర్తి అధికారం దక్కుతుంది. లేదంటే యాజమాన్య హక్కులు అసంపూర్ణంగా ఉంటాయి.  


తెలుసుకోవడం ఎలా?

ల్లు లేదా ఫ్లాట్‌ కొనుక్కొని ఇంట్లో ఉండడం మాత్రమే కాదు. ఆ ఇంటి యజమాన్య హక్కులు మన పేరుమీద ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. అలాగే భూములు కొన్నప్పుడు సైతం. ప్రస్తుతం భూమికి సంబంధించిన యాజమాన్య హక్కులు ఎవరి పేరుమీద ఉన్నాయనేది ధరణి పోర్టల్‌లో సర్వే నంబర్ల ఆధారంగా పరిశీలించవచ్చు. ధరణి వ్యవస్థ రాక ముందు కొన్న ఆస్తులు మ్యుటేషన్‌ జరిగాయా లేదా అనేది స్థానిక ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లి చూసుకోవాల్సి ఉంటుంది. ఒక వేళ మ్యుటేషన్‌ జరగనప్పుడు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖలో రిజిస్టర్‌ చేసిన డాక్యుమెంట్‌ను తీసుకుని సంబంధిత ఎమ్మార్వో వద్దకు వెళ్తే ఆ స్థిరాస్తికి సంబంధించిన యజమాని పేరు మార్పు జరుగుతుంది.

అదే ఇంటికి సంబంధించినదైతే గ్రామాల్లో గ్రామ రికార్డుల్లోనూ, మున్సిపాలిటీ పరిధిలో స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో పరిశీలించాల్సి ఉంది. ఆ ఇంటిపైనా, అపార్టుమెంట్‌లోని ఫ్లాట్‌పైనా పన్ను చెల్లించడానికి పీటీఐ (ప్రాపర్టీ టాక్స్‌ ఐడెంటిఫికేషన్‌) నంబరు ఉంటుంది. అది ఎవరి పేరుమీద ఉంది అనేది పీటీఐ నంబరు ఆధారంగా తెలుసుకోవచ్చు. ఒక వేళ యజమాని పేరు మీద లేకుంటే స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న డాక్యుమెంట్‌ను చూసి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని