2024పై అంచనాలు

కొత్త ఏడాదిలో స్థిరాస్తి రంగం ఎలా ఉండబోతుంది? మరో మూడు వారాల్లో నూతన సంవత్సరంలోకి ప్రవేశించబోతున్న తరుణంలో భవిష్యత్తు మార్కెట్‌ అంచనాలు ఎలా ఉన్నాయి? దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితే ఇక్కడా ఉంటుందా? 

Updated : 10 Dec 2023 06:33 IST

కొత్త ఏడాదిలో స్థిరాస్తి రంగం ఎలా ఉండబోతుంది? మరో మూడు వారాల్లో నూతన సంవత్సరంలోకి ప్రవేశించబోతున్న తరుణంలో భవిష్యత్తు మార్కెట్‌ అంచనాలు ఎలా ఉన్నాయి? దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితే ఇక్కడా ఉంటుందా? 

నిర్మాణ రంగంలో ఈ ఏడాది కన్పించిన గృహ కొనుగోలు సెంటిమెంటు 2024లోనూ కొనసాగుతుందని, అంచనా వేస్తున్నట్లు రియల్‌ఎస్టేట్‌ కన్సల్టెంట్‌ సంస్థ సీబీఆర్‌ఈ వెల్లడించింది. సరసమైన/బడ్జెట్‌, మధ్యశ్రేణి ఇళ్లు నిర్మించే ప్రాజెక్ట్‌లకు డిమాండ్‌ గత రెండేళ్ల పోకడలకు అనుగుణంగానే ఉంటోందని అంచనా వేసింది. విలాసవంతమైన ప్రీమియం విభాగం రూ.2-4కోట్లు అంతకంటే ఎక్కువ ఖరీదైన ఇళ్లు నిర్మించే ప్రాజెక్టుల్లో వృద్ధి కొనసాగుతుందని, మూలధన విలువ పెరుగుదల, కొత్త సబ్‌ మార్కెట్లు, స్థిరాస్తి విభాగంలో విభిన్న ధోరణులకు కొత్త సంవత్సరం సాక్ష్యంగా నిలుస్తుందని భావిస్తోంది. పేరున్న డెవలపర్లు తమ పోర్ట్‌ఫోలియోను విస్తరించడంతో పాటు కొత్త నగరాల్లో ప్రాజెక్ట్‌లు చేపట్టే అవకాశం ఉంటుందని తెలపింది.  

3 లక్షల మార్కు...

వడ్డీరేట్లు ప్రతిబంధకంగా ఉన్నా ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబరు వరకు దేశంలోని హైదరాబాద్‌తో సహా ప్రధాన నగరాల్లో 2.30 లక్షల యూనిట్ల అమ్మకాలు జరిగాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 5శాతం వృద్ధిని నమోదు చేసింది. స్థిరమైన డిమాండ్‌ ఉండటంతో 2.20 లక్షల యూనిట్లు ప్రారంభించేలా చేసింది. క్రితం ఏడాదితో పోలిస్తే 1శాతం మాత్రమే స్వల్ప వృద్ధి కన్పించింది. అమ్మకాలు, ప్రారంభాల పరంగా డిసెంబరు నాటికి 3లక్షల యూనిట్ల మార్క్‌ను దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఇది పదేళ్ల గరిష్ఠ స్థాయి కావడం విశేషం.

దేశంలో రూ.రెండు కోట్లు అంతకంటే ఎక్కువ ధర ఉన్న ప్రీమియం నివాసాల్లో జనవరి-సెప్టెంబరు నెలలో అమ్మకాలతో 70శాతం వార్షిక పెరుగుదల నమోదు చేసింది. దిల్లీ రాజధాని ప్రాంతం, ముంబై వంటి నగరంలో ఈ ధోరణి మరింత ఎక్కువగా కన్పించింది. అధిక ఆదాయ వర్గాలు, ప్రవాసీయులు వీటిలో పెట్టుబడికి మొగ్గు చూపుతున్నారు. హైదరాబాద్‌లోనూ ఇదే ధోరణి కొనసాగుతోంది. అమ్మకాలు, కొత్త ప్రాజెక్టులు ఈ విభాగంలోకి ఎక్కువగా వస్తున్నాయి. 2024లోనూ ఇదే ట్రెండ్‌ కొనసాగుతుందని అంచనా.

స్థోమత ఒక్కటే   నిర్ణయాత్మకం కాదు..

గృహ కొనుగోలులో ఇప్పటివరకు స్థోమత అనేది అత్యంత నిర్ణయాత్మక అంశం. కొన్ని సంవత్సరాలుగా మారుతున్న ప్రాధాన్యత క్రమంలో స్థోమత ఒక్కటే నిర్ణయాత్మక అంశం కాదని మార్కెట్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఆరోగ్యం, భద్రత, సామాజిక జీవనం, హరిత ఇళ్లు, స్మార్ట్‌హోమ్‌ టెక్నాలజీ వినియోగం వరకు గృహ కొనుగోలు నిర్ణయాల్లో కీలకంగా మారాయి. వచ్చే ఏడాది ఇది మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇంటి కొనుగోలు నిర్ణయాల్లో సాంకేతికతలు కీలక భూమిక పోషించబోతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.  

మౌలిక వసతులున్న చోటనే...

మౌలిక వసతులున్న ప్రాంతాల్లో చేపట్టిన ప్రాజెక్టులకు కొనుగోలుదారులు ఎక్కువ ప్రాధాన్యత చూపుతుంటారు. మౌలిక, అనుబంధ సౌకర్యాలు, అవసరాలకు తగిన ఇండోర్‌, అవుట్‌డోర్‌లు మెరుగైన అమ్మకాలకు దోహదం చేస్తుంటాయి. మున్ముందు డిమాండ్‌ స్థిరంగా కొనసాగడానికి ఇది ఉపయోగపడుతుందని చెబుతున్నారు. హైదరాబాద్‌లో మార్కెట్‌ స్థిరంగా పురోగమిస్తుంది. మరో ఏడాదిన్నర వరకు ఇళ్ల అమ్మకాల్లో ఆశాజనక వృద్ధి ఉంటుందని నగర బిల్డర్‌ ఒకరు తెలిపారు.

ఈనాడు, హైదరాబాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని