Updated : 31 Dec 2022 08:54 IST

బహుళ అంతస్తులకు.. భలే ఆదరణ

ఏడాదిలో 88 భవన సముదాయాలకు అనుమతి
16 గేటెడ్‌ కమ్యూనిటీలకు జీహెచ్‌ఎంసీ పచ్చజెండా
ఈనాడు, హైదరాబాద్‌

గ్రేటర్‌ పరిధిలో ఆకాశహర్మ్యాలకు ఆదరణ పెరుగుతోంది. ఎత్తైన భవంతుల్లో నివసించేందుకు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. 2022 సంవత్సరంలో జీహెచ్‌ఎంసీ ద్వారా ఎత్తైన భవనాలకు మంజూరైన నిర్మాణ అనుమతులే అందుకు నిదర్శనం. గతంలో 50 నుంచి 60 మధ్య ఉండే అనుమతులు ఈ సంవత్సరం 88కి పెరిగాయి. సొంతింటి విషయంలో హైదరాబాద్‌ ప్రజలు మెట్రో నగరాలకు దీటుగా ఆలోచిస్తున్నారని, నగరాభివృద్ధి అంతకంతకు పెరుగుతుండటంతో.. భాగ్యనగరంలో ఇంటిని సొంతం చేసుకునేందుకు జనం పోటీపడుతున్నారని నగర ప్రణాళిక విభాగం సంతోషం వ్యక్తం చేసింది.

ఎత్తైన నిర్మాణాలు ఇలా..

* నివాస సముదాయాలకు సంబంధించి 60, వాణిజ్య సముదాయాలకు 18, గేటెడ్‌ కమ్యునిటీలకు 16 అనుమతులు మంజూరయ్యాయి.
* బహుళ అంతస్తుల నిర్మాణాల్లో 30 అంతస్తులకు పైబడినవి 14 ఉన్నాయి. మిగిలినవి 10 అంతస్తుల నుంచి 30 అంతస్తుల ఎత్తు ఉంటాయి.
* నగరంలో ఈ ఏడాది గరిష్ఠంగా శేరిలింగంపల్లిలో గ్రౌండ్‌+47 అంతస్తుల అపార్ట్‌మెంట్‌కు అనుమతి లభించింది. అదే ప్రాంతానికి చెందిన 50 అంతస్తుల అపార్ట్‌మెంట్‌ దరఖాస్తు పరిశీలనలో ఉంది.
* నిర్మాణ అనుమతుల జారీ, అందుకు అనుసరిస్తోన్న విధానాలు సరళంగా ఉండటంతో.. నిర్మాణ సంస్థలు పెద్దయెత్తున కట్టడాలకు అనుమతి తీసుకుంటున్నాయి. పౌరులు సైతం.. అనుమతి ఉన్న ప్రాజెక్టుల్లో భాగస్వామ్యమవుతున్నారు.

టీఎస్‌బీపాస్‌లో  

నిర్మాణ అనుమతులను సులభతరం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్‌-బీపాస్‌లో 2022లో 16,114 అనుమతులు జారీ చేశారు. ఇందులో 75 గజాల నివాసాలు మొదలు వందల ఎకరాల్లో చేపడుతున్న లేఅవుట్ల వరకు ఉన్నాయి. కొన్ని విభాగాల్లో అనుమతుల కంటే తిరస్కరణలే ఎక్కువగా ఉన్నట్లు పట్టణ ప్రణాళిక నివేదిక చెబుతోంది.  

75 గజాల లోపు...

టీఎస్‌ బీపాస్‌ ప్రకారం 75 గజాల లోపు ఉన్న స్థలంలో ఇళ్లు కట్టుకునేందుకు రూపాయి చెల్లించి నమోదు(ఇన్‌స్టాంట్‌ రిజిస్ట్రేషన్‌) చేయిస్తే చాలు. గ్రౌండ్‌+ఒక అంతస్తు వరకు కట్టుకోవచ్చు.
* 1921 దరఖాస్తులు రాగా.. 716కు అనుమతులు ఇచ్చారు. పరిశీలన అనంతరం 993 దరఖాస్తులను తిరస్కరించారు. 51 దరఖాస్తుల రద్దుకు షోకాజ్‌ నోటీసులు ఇవ్వగా... 61 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి.

500 మీటర్ల వరకు...

నగరంలో 500 మీటర్ల విస్తీర్ణం, 10 మీటర్ల ఎత్తు వరకు నిర్మాణాలకు సంబంధించి ఏడాదిలో 11,088 అనుమతులు జారీ చేశారు. మొత్తం 13,455 దరఖాస్తులు వచ్చాయి. 182 దరఖాస్తులను తిరస్కరించారు. 56 అర్జీలకు షోకాజ్‌ నోటీసులు జారీగా చేయగా..327 పరిశీలనలో ఉన్నాయి.  ః ఈ విభాగం కిందకు వ్యక్తిగత గృహాలు వస్తాయి. 1314 నివాస యోగ్య ధ్రువీకరణకు దరఖాస్తు చేసుకోగా.. 876 ఇళ్లకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు జారీ చేశారు. 390 తిరస్కరించారు. 48 పరిశీలనలో ఉన్నాయి.

అపార్ట్‌మెంట్లకు..

స్థల విస్తీర్ణం 500 మీటర్లు, 10 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో కట్టే అపార్ట్‌మెంట్లు, వాణిజ్య సముదాయాలు, లేఅవుట్‌ల దరఖాస్తుల పరిశీలనకు సింగిల్‌ విండో విధానం తీసుకొచ్చారు. సక్రమంగా ఉన్నవాటికి 21 రోజుల్లోనే అనుమతులు జారీ చేస్తారు. ఈవిధానంలో

* 1920 దరఖాస్తులకు ఆమోదం తెలిపారు.  684 దరఖాస్తులు తిరస్కరించగా... 328  పరిశీలనలో ఉన్నాయి.
* 1499 అక్యుపెన్సీ సర్టిఫికెట్లు జారీ చేశారు. మొత్తం 2529 వచ్చాయి. 335 తిరస్కరించారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు