నిర్మాణాలపైనా ప్రభావం

కార్యాలయాల లీజింగ్‌లో హైదరాబాద్‌ స్థిరాస్తి మార్కెట్‌ గత ఏడాది రికార్డు లావాదేవీలు నమోదు చేసింది. ఇదే దూకుడు 2020లోనూ కొనసాగుతుందని స్థిరాస్తి కన్సల్టెన్సీ సంస్థలు అంచనా వేశాయి. ముందస్తు ఒప్పందాలు ఇందుకు ఊతమిచ్చాయి. అనుమతుల్లో జాప్యం, కరోనా దరిమిలా లాక్‌డౌన్‌తో పరిస్థితులు మారిపోయాయి. జనవరి నుంచే కరోనా పలు రంగాలపై ప్రభావం చూపడం ప్రారంభించింది....

Published : 11 Apr 2020 02:29 IST

తొలి త్రైమాసికంపై జేఎల్‌ఎల్‌ నివేదిక

ఈనాడు, హైదరాబాద్‌: కార్యాలయాల లీజింగ్‌లో హైదరాబాద్‌ స్థిరాస్తి మార్కెట్‌ గత ఏడాది రికార్డు లావాదేవీలు నమోదు చేసింది. ఇదే దూకుడు 2020లోనూ కొనసాగుతుందని స్థిరాస్తి కన్సల్టెన్సీ సంస్థలు అంచనా వేశాయి. ముందస్తు ఒప్పందాలు ఇందుకు ఊతమిచ్చాయి. అనుమతుల్లో జాప్యం, కరోనా దరిమిలా లాక్‌డౌన్‌తో పరిస్థితులు మారిపోయాయి. జనవరి నుంచే కరోనా పలు రంగాలపై ప్రభావం చూపడం ప్రారంభించింది. ఈ ఏడాది తొలి త్రైమాసికం పూర్తికావడంతో జేఎల్‌ఎల్‌ సంస్థ కమర్షియల్‌ రియల్‌ ఎస్టేట్‌పై తాజాగా నివేదిక విడుదల చేసింది.
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది తొలి త్రైమాసికంలో పూర్తయిన కార్యాలయాల నిర్మాణాలు 68.4 శాతం తగ్గాయి. 2019లో రికార్డు స్థాయిలో 42.6 లక్షల చ.అ. భవన నిర్మాణాలు పూర్తిచేసుకోగా.. ఈసారి అది 13.5 లక్షల చ.అ.కు పడిపోయింది. 2016లో తొలి మూడు నెలల వ్యవధిలో 12.4 లక్షల చ.అ. నిర్మాణాలు పూర్తికాగా 2017లో నోట్ల రద్దుతో పూర్తిగా ఆగిపోయాయి. 2018 తొలి త్రైమాసికంలో 4 లక్షల చ.అ. మాత్రమే నిర్మితమయ్యాయి.  
కార్యాలయాల లీజింగ్‌ కూడా తగ్గింది. 9.2 లక్షల చ.అ. మాత్రమే సంస్థలు లీజింగ్‌కు తీసుకున్నాయి. క్రితం ఏడాది ఇది 35.5 లక్షల చ.అ.గా ఉంది. దాదాపుగా 74.1 శాతం తగ్గిపోయింది.
కార్యాలయాల ఖాళీల శాతం 2016లో 8.12 శాతం నుంచి 2019 నాటికి 4.67 శాతానికి పడిపోయింది. ఈ ఏడాదికి వచ్చేసరికి ఖాళీల వాటా పెరిగి 7.67 శాతానికి చేరుకుంది. కరోనాతో అంతర్జాతీయ ప్రయాణాలు ఆగిపోవడంతో ఆ ప్రభావం లీజింగ్‌పై పడింది. ప్రాజెక్ట్‌లను సందర్శించే అవకాశం లేకపోవడం, ఆర్థిక మందగమన ప్రభావంతో వాయిదా వేసుకుంటున్నారని ఈ రంగంలోని నిపుణులు విశ్లేషిస్తున్నారు. హైటెక్‌ సిటీలో కొన్ని ఖాళీలు ఏర్పడ్డాయి. ఇదివరకు ఇక్కడ ఉన్న కంపెనీలు అధిక విస్తీర్ణంలోని ఐటీ పార్కుల్లోకి మారడం ఖాళీలు పెరగడానికి కారణంగా కన్పిస్తోంది.
అద్దెలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. గత ఏడాది తొలి త్రైమాసికంలో కార్యాలయాల చ.అ. అద్దె సగటున రూ.53.25 ఉండగా.. ఈ ఏడాది రూ.56.10కు పెరిగింది. 5.3 శాతం వృద్ధి నమోదైంది. 2016లో రూ.47.68, 2017లో రూ.50.12, 2018లో రూ.51.23గా ఉంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని