భవిష్యత్తు బాగుండాలంటే..!

నిర్మాణ రంగం హైదరాబాద్‌లో మూడునాలుగేళ్లుగా దూకుడు మీద కొనసాగుతుండగా కొవిడ్‌-19తో ఆ వేగానికి కళ్లెం పడింది. లాక్‌డౌన్‌తో రెండు నెలలు పూర్తిగా కార్యకలాపాలు స్తంభించిపోగా కూలీల కొరతతో ప్రస్తుతం పనులు అరకొరగానే సాగుతున్నాయి. భవిష్యత్తు హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌పై బిల్డర్లు పూర్తి విశ్వాసంతో ఉన్నా.. ప్రస్తుతం ఏర్పడిన కొవిడ్‌ సంక్షోభం నుంచి ఈ రంగాన్ని త్వరితగతిన గట్టెక్కించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తోడ్పాటు కోరుకుంటున్నారు...

Published : 20 Jun 2020 04:34 IST

ఈనాడు, హైదరాబాద్‌: నిర్మాణ రంగం హైదరాబాద్‌లో మూడునాలుగేళ్లుగా దూకుడు మీద కొనసాగుతుండగా కొవిడ్‌-19తో ఆ వేగానికి కళ్లెం పడింది. లాక్‌డౌన్‌తో రెండు నెలలు పూర్తిగా కార్యకలాపాలు స్తంభించిపోగా కూలీల కొరతతో ప్రస్తుతం పనులు అరకొరగానే సాగుతున్నాయి. భవిష్యత్తు హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌పై బిల్డర్లు పూర్తి విశ్వాసంతో ఉన్నా.. ప్రస్తుతం ఏర్పడిన కొవిడ్‌ సంక్షోభం నుంచి ఈ రంగాన్ని త్వరితగతిన గట్టెక్కించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తోడ్పాటు కోరుకుంటున్నారు.
వాస్తవ పరిస్థితిలా..
4 నెలలుగా కొత్త బుకింగ్‌లు పెద్దగా లేకపోవడం, కొనుగోలుదారుల నుంచి వాయిదాల చెల్లింపుల్లో జాప్యంతో నగదు అందుబాటులో లేక నిర్మాణదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ రంగంలో 99 శాతం మంది చిన్న, మధ్య స్థాయి డెవలపర్సే. వార్షిక టర్నోవర్‌ రూ.100 కోట్ల లోపు ఉన్నవారే ఉన్నారు. కార్మికులు స్వస్థలాలకు వెళ్లడంతో నిర్మాణ పనులు నెమ్మదించాయి.
కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది..
నిర్మాణ రంగాన్ని ఎంఎస్‌ఎంఈగా గుర్తించాలి. రియల్‌ ఎస్టేట్‌కు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ హోదా ఇవ్వాలి. 20 శాతం వరకు అత్యవసర నిధుల నుంచి అదనపు రుణం పొందడానికి వీలవుతుంది.

మారటోరియం, ఎన్‌పీఏ ఒకేసారి 9 నెలలు వర్తించేలా ప్రకటించాలి.

అందుబాటు ధరల్లో ఇళ్లు రూ.45 లక్షల వరకు వర్తింపజేస్తున్న 1 శాతం జీఎస్‌టీని రూ.75 లక్షల విలువైన ఇళ్ల వరకు కొనసాగించాలి.ః జాయింట్‌ వెంచర్లలో భూయాజమానుల జీఎస్‌టీ వాటాకు వారినే బాధ్యుల్ని చేయాలి.
రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది..
విద్యుత్తు బిల్లుల్లో కనీస ఛార్జీలు, డిమాండ్‌ ఛార్జీలు రద్దు చేసి వినియోగం ఆధారంగా బిల్లింగ్‌ తీసుకోవాలి. కనీసం ఆరునెలల వరకైనా దీన్ని వర్తింపజేయాలి.

నిర్మాణ సమయంలో వాణిజ్య విభాగం కింద విద్యుత్తు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. కూలీల శిబిరాలు ఉండేవాటికి గృహ లేదంటే ప్రత్యేక విభాగం కింద విద్యుత్తు ఛార్జీలు ఉండాలి.

ఇప్పటికే కొనుగోలు చేసిన వారు రద్దు చేసుకోకుండా ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు ఉండాలి. రాబోయే ఆరునెలలపాటు మార్కెట్‌ సెంటిమెంట్‌ను పెంచే చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వడ్డీలో రాయితీ వంటి పథకాలు పరిశీలించవచ్చు.

రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను త్వరగా పూర్తిచేసుకునేవారికి ప్రోత్సాహకాలు ఉండాలి. ఉదాహరణకు.. రాబోయే 30 రోజుల్లో రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటే 33 శాతం, 31-60 రోజుల వరకు 25 శాతం, 61-120 రోజుల వరకు 15 శాతం ఛార్జీల్లో తగ్గింపు మాదిరి ప్రోత్సాహకాలను అందివ్వాలి.

సిమెంట్‌ ధరలు పెరగకుండా కొవిడ్‌కు ముందు ధరలకే సరఫరా చేసేలా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి.

ఆరునెలల వరకు ఆస్తి పన్ను మినహాయింపు ఇవ్వాలి.

రాత్రిపూట కూడా కూలీలు పనిచేసేందుకు అనుమతివ్వాలి. కార్మిక సుంకం కూలీల సంక్షేమానికి ఉపయోగించాలి.

 రెరా గడువును 9 నెలల వరకు పొడిగించాలి.
కొనుగోలుదారులకు ఇవ్వాల్సింది..
గృహరుణ వడ్డీరేట్లను గరిష్ఠంగా తగ్గించాలి. 5 శాతానికి అందుబాటులో ఉండేలా కనీసం ఐదేళ్ల వరకైనా ఈఎంఐ భారం తగ్గించే రుణ సబ్సిడీ పథకాన్ని వర్తింపజేయాలి.

ఆదాయపు పన్ను మినహాయింపులో గృహ రుణ అసలు మినహాయింపు రూ.2.5 లక్షల వరకు, వడ్డీపై రూ.10 లక్షల వరకు ఇవ్వాలి.

ఉద్యోగాలు ఉంటాయో ఊడతాయో అనే అనిశ్చితిలో ఇళ్లు కొనుగోలుకు వెనుకాడే పరిస్థితులున్నాయి. ఈఎంఐ లేకుండా 24 నెలలపాటు మార్జిన్‌ మనీ మాత్రమే చెల్లించే వెలుసుబాటును కొనుగోలుదారులకు కల్పించాలి.

ఇప్పటికైనా ఆదుకోవాలి
- సీహెచ్‌ రాంచంద్రారెడ్డి, అధ్యక్షుడు, క్రెడాయ్‌ తెలంగాణ

దేశంలో వేర్వేరు రంగాలను ఆదుకునేందుకు కేంద్రం రూ.20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించినా నిర్మాణరంగాన్ని పరిగణనలోకి తీసుకోకపోవడంపై స్థిరాస్తి సంఘాలు అసంతృప్తిగా ఉన్నాయి. రియల్‌ ఎస్టేట్‌ ప్రత్యక్షంగా 11 శాతం, పరోక్షంగా 9 శాతం మందికి ఉపాధి కల్పిస్తోంది. అనుబంధంగా 250 పరిశ్రమల భవితవ్యం ఆధారపడి ఉంది. ఇప్పటికైనా ఆదుకోవాలని అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తే బాగుంటుదనేదానిపై అన్ని సంఘాలు కలిపి పలు విజ్ఞప్తులు చేశాం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని