కట్టాలంటే.. సహకరించాల్సిందే!

ప్రభుత్వం అభివృద్ధి పనులకు నిధుల సమీకరణ కోసం సర్కారు భూములను వేలం వేస్తోంది. కొద్దిరోజుల క్రితం కోకాపేటలో వేలం వేయగా ఎకరం సగటు ధర రూ.50 కోట్ల దాకా పలికింది. రూ.రెండువేల కోట్ల వరకు సర్కారుకు ఆదాయమూ వచ్చింది. ఇప్పుడు మరోసారి భూములను వేలం వేయబోతుంది.

Published : 25 Sep 2021 03:39 IST

- ఈనాడు, హైదరాబాద్‌

ప్రభుత్వం అభివృద్ధి పనులకు నిధుల సమీకరణ కోసం సర్కారు భూములను వేలం వేస్తోంది. కొద్దిరోజుల క్రితం కోకాపేటలో వేలం వేయగా ఎకరం సగటు ధర రూ.50 కోట్ల దాకా పలికింది. రూ.రెండువేల కోట్ల వరకు సర్కారుకు ఆదాయమూ వచ్చింది. ఇప్పుడు మరోసారి భూములను వేలం వేయబోతుంది. ఈసారి మంచి స్పందన వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రభుత్వమే బహిరంగంగా వేలం వేయడంతో ఒకరకంగా ధరలు పెరగడానికి కారణం అవుతోందని.. ఫలితంగా ఇళ్ల ధరలు అందుబాటులో లేకుండా పోయే అవకాశం ఉంటుందని స్థిరాస్తి వర్గాలు అంటున్నాయి. వేలంలో కొన్న ధర అందరికీ తెలుస్తుంది కాబట్టి సహజంగానే చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ ఆ మేరకు ధరలు పెంచేస్తారని.. ఇప్పుడు జరుగుతోందని అదేనని అంటున్నారు. ఆ ధరలకు భూములు కొంటే సహజంగానే ప్రీమియం ధరలకు నివాసాలను విక్రయించాల్సి వస్తోందని.. సామాన్య, మధ్యతరగతి వారు కొనుగోలు చేయలేరని పరిస్థితిని విశ్లేషించారు.  

దూరం వెళ్లాల్సిందే..

అందుబాటు ధరల్లో ఇళ్లంటే నగరానికి చాలా దూరంగా వెళ్లాల్సి వస్తోంది. అక్కడ మౌలిక సదుపాయాలు అంతంతమాత్రమే. ముఖ్యంగా బడ్జెట్‌ ధరల్లో కొనేవారు ఆయా ప్రాంతాల్లో ప్రజారవాణా ఎలా ఉందనేది ప్రధానంగా చూస్తుంటారు. రవాణా వంటి మౌలిక వసతులు లేకపోవడంతో దూరం వెళ్లేందుకు ఎక్కువ మంది మొగ్గు చూపడం లేదు. కొద్ది మంది మాత్రమే దూరమైనా ఫర్వాలేదు అని సాహసం చేస్తున్నారు. ప్రజారవాణా, మంచినీళ్ల వంటి మౌలిక వసతులు శివార్ల వరకు సర్కారు కల్పించగలిగితే కొనేందుకు కొనుగోలుదారులు ముందుకొస్తారు. కడితే కొంటారనే విశ్వాసంతో నిర్మాణదారులు అలాంటిచోట్ల ప్రాజెక్టులు చేపడతారు అని స్థిరాస్తి సంఘాలు అంటున్నాయి.

రాజీ  పడితేనే..  

దూరం వెళ్లలేరు.. ఎక్కువ ధర పెట్టే స్థోమత లేదు.. మరి ఏంటి పరిష్కారం? పెద్ద ఇంటిపై ఆశలు వదలుకోవాలంటున్నారు బిల్డర్లు. తక్కువ విస్తీర్ణంలో కట్టే ఫ్లాట్లకు సర్దుబాటు కావడం తప్ప వేరే మార్గం లేదని చెబుతున్నారు. ముంబయిలో ఆరు వందల గజాల చదరపు అడుగుల ఫ్లాట్‌ అంటే విలాసవంతం అని.. మన దగ్గర అందుబాటు ధరల్లో ఫ్లాట్‌ అయినా వెయ్యి నుంచి 1200 చ.అ. ఉండాలని కోరుకుంటారని ఒక బిల్డర్‌ అన్నారు.  చిన్న ఫ్లాట్‌కు సిద్ధపడితే బడ్జెట్‌ ధరల్లో సొంతింటి కలను నెరవేర్చుకోవచ్చు అని సూచించారు.

నగరంలో నిర్మాణదారులు అందుబాటు ధరల్లో ఇళ్లు కడుతున్నా.. వాటి లభ్యత పరిమితంగా ఉంది. రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల స్థాయిలో ధరలుంటే వాటిని అందుబాటు ఇళ్లుగా పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అవుటర్‌ లోపల ఈ ధరలకు అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లు కూడా రావడం లేదు. ఎక్కడ చూసినా సగటు చదరపు అడుగు రూ.4500 వరకు ఉంది.  సౌకర్యాలకు అదనంగా రూ.లక్షల్లో వసూలు చేస్తుండటంతో అర కోటి దాటుతోంది. భూముల ధరలు పెరగడంతో చూస్తుండగానే మూడేళ్లలో ఇళ్ల ధరలు భారీగా ఎగబాకి సామాన్యులకు అందనంటున్నాయి. పెరిగిన భూముల ధరలతో కొనుగోలు చేసి శివార్లలో అపార్ట్‌మెంట్లు కడితే అందులో ఫ్లాట్లను రూ.అర కోటిపైన విక్రయిస్తే తప్ప తమకు గిట్టుబాటు కాదని బిల్డర్లు అంటున్నారు. మరి విస్తీర్ణం వెయ్యి, 1200 చదరపు అడుగుల నుంచి ఎనిమిది వందలకు తగ్గించి తక్కువ ధరకు ఇద్దామంటే చిన్నగా ఉంటున్నాయని కొనడానికి హైదరాబాద్‌లో పెద్దగా ముందుకు రావడం లేదని బిల్డర్లు అంటున్నారు. సర్కారే మధ్యతరగతి వర్గాలు నివసించే ప్రాంతాలను గుర్తించి అక్కడ ప్రభుత్వ భూమిని డెవలప్‌మెంట్‌కి ఇవ్వడం ద్వారా అందుబాటు ధరల్లో ఇళ్ల నిర్మాణాన్ని పెంచడానికి, సొంతింటి కలను సాకారం చేసేందుకు ఆస్కారం ఉంటుందనే సూచనలు స్థిరాస్తి సంఘాల నుంచి వస్తున్నాయి.

 


రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు భారమే..

అందుబాటు ధరల్లో  ఇళ్లకు కేంద్రం జీఎస్‌టీని ఒక శాతం వసూలు చేస్తోంది. అయితే విస్తీర్ణం పరంగా పరిమితులు ఉండటంతో మన దగ్గర ఎక్కువ ఇళ్లకు ఇది వర్తించడం లేదు.  దీంతో నిర్మాణంలో ఉండగా కొనుగోలు చేస్తే 5 శాతం జీఎస్‌టీ చెల్లించాలి. మధ్యతరగతి వారికి ఇది చాలా భారంగా ఉంది. కేంద్రం రుణ ఆధారిత సబ్సిడీ పథకాన్ని అందిస్తోంది. రూ.2.60 లక్షల వరకు సబ్సిడీ ఇస్తున్నా.. ఎల్‌ఐజీ వరకే పరిమితం చేయడంతో హైదరాబాద్‌ లాంటి నగరాల్లో ఎక్కువ మంది ప్రయోజనం పొందడం లేదు. 2020 మార్చి వరకు ఈ పథకం ఎంఐజీ-1, 2 వరకు వర్తింపజేసినా..ఆ తర్వాత పొడిగించలేదు. దీన్ని మరికొంతకాలం కేంద్రం పొడిగించాలి. రాష్ట్రం వసూలు చేస్తున్న రిజిస్ట్రేషన్‌ ఛార్జీలను అందుబాటు ఇళ్ల వరకు తగ్గించాలనే డిమాండ్లు ఉన్నాయి. గతంలో ఆరు శాతం ఉన్న రిజిస్ట్రేషన్‌ ఛార్జీలను సర్కారు ఇటీవలే 7.5 శాతానికి పెంచింది. ఇది చాలా భారంగా ఉంది.  ఛార్జీలు తగ్గిస్తే సామాన్య, మధ్యతరగతి వారికి కొంత భారం తగ్గుతుందని పరిశ్రమ వర్గాలు సర్కారుకు సూచిస్తున్నాయి.
 


మౌలిక వసతులు, ఫీజుల్లో రాయితీలిస్తే..

అందుబాటు ధరల్లో ఇళ్లు కట్టేందుకు మొదటగా నగరంలో భూమి అందుబాటులో లేదు. 20 కి.మీ. దూరం వెళ్లి కడితే మౌలిక వసతులు ఉండవు. ప్రభుత్వం రహదారులు, ప్రజారవాణా, మంచి నీళ్లు, డ్రైనేజీ వసతులు కల్పించాలి. శివార్లలో కాబట్టి భూమి మార్పిడికి నాలా ఛార్జీలు, జోన్‌ మార్పు ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది. వీటితో పాటు నిర్మాణ అనుమతుల ఛార్జీల్లో రాయితీలు ఇవ్వాలి. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన రుణ ఆధారిత సబ్సిడీ పథకాలకు తుది గడువు లేకుండా నిరంతరం కొనసాగించాలి. కేంద్రం దీనిపై ఆలోచించాలి. రూ.45 లక్షల లోపు ఇళ్లకు కర్ణాటకలో రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు 2 శాతమే. ఇక్కడ ఈ ధరల లోపు వాటికి 1 శాతమే రిజిస్ట్రేషన్‌ ఛార్జీల వంటి ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ఇలాంటి వాటితో సర్కారుకు పరోక్షంగా లాభమే. నిర్మాణాలు పెరిగితే ఉపాధి లభిస్తుంది. సిమెంట్‌, స్టీల్‌, ఇతర కొనుగోళ్ల ద్వారా పన్నులు పెరుగుతాయి. ఈ దిశగా ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకం ఉంటే రూ.30-35 లక్షల లోపే ఫ్లాట్లు కట్టి ఇచ్చేందుకు చాలామంది బిల్డర్లు సిద్ధంగా ఉన్నారు.
 

- మారం సతీష్‌, కార్యవర్గ సభ్యులు, క్రెడాయ్‌ హైదరాబాద్‌


భూమి కొని కట్టడం లాభసాటి కాదనే..

హైదరాబాద్‌ ఆకర్షణీయంగా ఉండటంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నిధులతో ఇక్కడ పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేస్తున్నారు. దీంతో వాటి ధరలు బాగా పెరిగాయి. పెరిగిన ధరలకు భూమి కొనుగోలు చేసి ఇళ్లు కడితే ఇప్పుడున్న ధరలకు అమ్మడం సాధ్యం కాదు. మున్ముందు మరింత పెరిగేందుకు అవకాశం ఉంది. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల్లో ఇల్లు కొనేందుకు ఇదే సరైన సమయం. అందుబాటు ధరల్లో ఇళ్ల లభ్యత ఎక్కువ లేకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. మౌలిక వసతులున్న ప్రాంతాల్లో నిర్మాణదారే భూమిని కొని అందుబాటు ధరల్లో కట్టి ఇవ్వడం ఆర్థికంగా లాభసాటి కాకపోవడంతో ఎక్కువ మంది ముందుకు రావడం లేదు. స్టీల్‌, సిమెంట్‌, కూలీల వ్యయం బాగా పెరిగిపోయాయి. కాబట్టి ప్రభుత్వమే సామాన్య, మధ్యతరగతి వాసులు నివసించే ప్రాంతాలను గుర్తించి భూమిని డెవలప్‌మెంట్‌కు ఇవ్వగలిగితే అందుబాటు ధరలకే ఇళ్లు కట్టి ఇవ్వవచ్చు. ప్రభుత్వానికి కొన్ని ఇళ్లు ఇస్తాయి. ఉద్యోగులకు, ఇతర వర్గాలకు కేటాయించవచ్చు. బిల్డర్‌ తన వాటా కింద వచ్చిన వాటిని విక్రయించుకుంటారు. ఈ ధర కూడా ఎంత ఉండాలో సర్కారు ముందే నిర్ణయించవచ్చు. గతంలో హౌసింగ్‌ బోర్డు ఈ వర్గాలకు ఇళ్లు కట్టి ఇచ్చేది.  ఇప్పుడు బిల్డర్లకు భూమి ఇస్తే ఒప్పందం మేరకు కట్టించి ఇస్తారు.
 

- ఎం.విజయసాయి, ఉపాధ్యక్షుడు, ట్రెడా


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని