ఫ్లాట్ల అమ్మకాలు అదరహో

కొవిడ్‌ అనిశ్చితి తొలగిపోయి సాధారణ పరిస్థితులు నెలకొనడంతో రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో అపార్ట్‌మెంట్ల విక్రయాలు పెరిగాయి. స్టీలు, సిమెంట్‌ వంటి ముడిసరకుల ధరలు చుక్కలనంటుతుండటం.. భవిష్యత్తులో ఇళ్ల ధరలు పెంచక

Published : 09 Apr 2022 02:39 IST

ఈనాడు, హైదరాబాద్‌: కొవిడ్‌ అనిశ్చితి తొలగిపోయి సాధారణ పరిస్థితులు నెలకొనడంతో రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో అపార్ట్‌మెంట్ల విక్రయాలు పెరిగాయి. స్టీలు, సిమెంట్‌ వంటి ముడిసరకుల ధరలు చుక్కలనంటుతుండటం.. భవిష్యత్తులో ఇళ్ల ధరలు పెంచక తప్పదని బిల్డర్లు చెబుతుండటంతో సొంతింటిపై త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొత్త ప్రాజెక్టుల్లో, నిర్మాణం పూర్తైన వాటిలో తమ అవసరాలు, అనుకూలతను బట్టి కొనుగోళ్లు చేస్తున్నారు. తొలి త్రైమాసికం మార్కెట్‌కు సానుకూల సంకేతాలను అందించింది. పలు కొత్త ప్రాజెక్టులు మొదలెట్టారు. హైదరాబాద్‌తో సహా దేశవ్యాప్తంగా మార్కెట్‌ పురోగమన దిశలో ఉంది.

దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లో ఈ ఏడాది తొలి త్రైమాసికంలో అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్ల విక్రయాలు ఆశాజనకంగా ఉన్నాయి. మూడునెలల్లోనే అరలక్షపైగా ఫ్లాట్లను విక్రయించారు. గత ఏడాది జనవరి-మార్చిలో 28,352 ఫ్లాట్లను విక్రయిస్తే... ఈ ఏడాది 51,849 యూనిట్లకు పెరిగింది. క్రితం ఏడాది వాయిదా వేసిన వారంతా ఈసారి కొనుగోలుకు ముందుకొచ్చారు.

బెంగళూరు మార్కెట్‌ బాగా కోలుకుంది. ఇక్కడ క్రితం సంవత్సరం తొలి త్రైమాసికంలో 5216 ఇళ్లను విక్రయిస్తే.. 2022లో 12,202 విక్రయించారు.

ముంబయిలో 5779 నుంచి 11,648కి, పుణెలో 3680 నుంచి 8098కి ఫ్లాట్ల విక్రయాలు పెరిగాయి.

దిల్లీ రాజధాని ప్రాంతం 5448 నుంచి 8633 ఇళ్లకు విక్రయాలు పెరగగా...  చెన్నైలో 3200 నుంచి 3450 యూనిట్లకు అమ్మకాలు పెరిగాయి.

కోల్‌కతాలోనూ 1320 నుంచి 3806 ఫ్లాట్ల విక్రయాలు ఊపందుకున్నాయి. కొవిడ్‌తో క్రితం ఏడాది దెబ్బతిన్న మార్కెట్లు ఈసారి బాగా పుంజుకున్నాయి.

హైదరాబాద్‌లోనూ గత ఏడాదితో పోలిస్తే అమ్మకాలు బాగున్నాయి. క్రితం సంవత్సరం మొదటి మూడునెలల్లో 3709 ఫ్లాట్లను అమ్మితే..  ఈసారి స్వల్పంగా పెరిగి ఈసంఖ్య 4012కి చేరింది.

కోటిపైన వాటికి డిమాండ్‌..

కోటి అంతకంటే ఎక్కువ ఖరీదైన ఇళ్ల విక్రయాల్లో 83 శాతం వృద్ధి నమోదైంది. విశాలమైన ఫ్లాట్లకు డిమాండ్‌ పెరగడమే ఈ విభాగంలో విక్రయాలు పెరుగుదలకు కారణమని స్థిరాస్తి కన్సల్టెన్సీ సంస్థ జేఎల్‌ఎల్‌ పేర్కొంది.

గత ఏడాది జనవరి నుంచి మార్చి వరకు మూడు నెలల కాలంలో 5,994 ఫ్లాట్లను విక్రయిస్తే.. ఈ ఏడాది ఇదే సమయంలో 10,988 ఫాట్లను విక్రయించారు.

1-1.15 కోట్ల మధ్య ధరలున్న ఇళ్లు క్రితం సంవత్సరం 3450 అమ్మితే.. ఈసారి ఏకంగా 6187 ఫ్లాట్లకు పెరిగింది.

కోటిన్నర పైన ధరలు పలుకుతున్న ఇళ్లుసైతం పుంజుకున్నాయి. 2544 ఫ్లాట్ల నుంచి 4801 ఫ్లాట్లకు అమ్మకాలు పెరిగాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని