ఇంటి ఎంపికకు పెరిగిన అవకాశాలు

కొవిడ్‌ అనంతరం హైదరాబాద్‌ స్థిరాస్తి మార్కెట్‌లో పెద్ద ఎత్తున ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. రాబోయే రెండు మూడేళ్లలో పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించుకున్నారు నిర్మాణదారులు. వీటిలో ఎక్కువగా హై ఎండ్‌, ప్రీమియం ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ విభాగంలో ఎంపిక చేసుకునేందుకు గతం కన్నాఅవకాశాలు ప్రస్తుతం ఎక్కువ ఉన్నాయని నిర్మాణదారులు అంటున్నారు....

Updated : 20 Nov 2021 06:44 IST

కొవిడ్‌ అనంతరం హైదరాబాద్‌ స్థిరాస్తి మార్కెట్‌లో పెద్ద ఎత్తున ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. రాబోయే రెండు మూడేళ్లలో పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించుకున్నారు నిర్మాణదారులు. వీటిలో ఎక్కువగా హై ఎండ్‌, ప్రీమియం ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ విభాగంలో ఎంపిక చేసుకునేందుకు గతం కన్నాఅవకాశాలు ప్రస్తుతం ఎక్కువ ఉన్నాయని నిర్మాణదారులు అంటున్నారు.

ఈనాడు, హైదరాబాద్‌: నిర్మాణ సంస్థలు 2020 తర్వాత దూకుడు పెంచాయి. కొవిడ్‌ అడ్డంకులు ఎదురైనా తాత్కాలిక ప్రభావమే చూపెట్టాయి. హైదరాబాద్‌లో ప్రధానమైన ఐటీ, ఫార్మా రంగాలు కరోనా సమయంలోనూ భారీ వృద్ధి నమోదు చేయడంతో పరోక్షంగా ఇది స్థిరాస్తి మార్కెట్‌కు కలిసి వచ్చింది. సొంతింటి అవసరాలు పెరగడంతో విశాలమైన ఇళ్లకు డిమాండ్‌ పెరిగింది. విల్లాలు, ఆకాశహర్మ్యాల ప్రాజెక్టులు ప్రకటించడమే ఆలస్యం బుకింగ్స్‌ ఊహించినదానికంటే ఎక్కువే నమోదయ్యాయి. దీంతో అప్పటివరకు వేచి చూసే ధోరణిలో ఉన్న పలు సంస్థలు కొత్త ప్రాజెక్టులను మొదలెట్టాయి. ఫలితంగా కొనుగోలుదారులు నచ్చిన ఇల్లు ఎంచుకునేందుకు అవకాశాలు పెరిగాయి.

కోటి ఉంటేనే..

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ప్రాజెక్టుల్లో లభ్యత ఎక్కువ ఉన్న ఇళ్లు రూ.70 లక్షల నుంచి కోటిన్నర ధర పలుకుతున్నాయి. జీఎస్‌టీ, ఇంటీరియర్స్‌ వ్యయం కలుపుకొంటే కోటి నుంచి రెండు కోట్ల మధ్య అవుతోంది. విస్తీర్ణం పరంగా 1500 చ.అ. నుంచి రెండు వేల చ.అ. వరకు ఉన్నాయి. ఎక్కువగా మూడు పడక గదులు నిర్మిస్తున్నారు. ఆకాశహర్మ్యాల్లో రెండు పడక గదులు సైతం ఇవే ధరలు చెబుతున్నారు. వీటిలో చ.అ. రూ.5వేలు మొదలు రూ.12వేల వరకు ప్రాంతాన్ని బట్టి విక్రయిస్తున్నారు. రాయదుర్గం, కాజాగూడ, కొండాపూర్‌, మాదాపూర్‌, నార్సింగి, కోకాపేట, గండిపేట, మంచిరేవుల, నల్లగండ్ల, తెల్లాపూర్‌, పుప్పాలగూడ, నానక్‌రాంగూడ, మణికొండ, మియాపూర్‌, హాఫిజ్‌పేట, లింగంపల్లి, పటాన్‌చెరు, బాచుపల్లి, కూకట్‌పల్లి, మూసాపేట, అప్పా, కిస్మత్‌పూర్‌, అత్తాపూర్‌, రాజేంద్రనగర్‌, శంషాబాద్‌, ఎల్బీనగర్‌, ఉప్పల్‌, పోచారం ప్రాంతాల్లో బహుళ అంతస్తుల ప్రాజెక్టులు విస్తృతంగా అందుబాటులో ఉన్నాయి. నగరం మధ్యలో పంజాగుట్ట, సోమాజిగూడ, బంజారాహిల్స్‌లోనూ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి.

నిర్ణయం తీసుకునే ముందు ఒక్కసారి..

గతంలో కంటే ప్రాజెక్టులు పెరగడంతో ఇంటి ఎంపికలో అవకాశాలు పెరగడంతోపాటు వీటిలో వేటిని ఎంపిక చేసుకోవాలనే సందిగ్ధం కూడా ఉంటుంది.

మొదటగా ఏ ప్రాంతంలో ఇల్లు తీసుకోవాలనుకుంటున్నారో నిర్ణయించుకోవాలి. కార్యాలయానికి దగ్గరలో ఉండాలనా? పిల్లలకు మంచి స్కూల్‌ దగ్గరలో ఉండాలనా? ఇంటి విలువ భవిష్యత్తులో వేగంగా వృద్ధి చెందాలానా? వీటి ఆధారంగా ఒక నిర్ణయానికి రావొచ్చు.  

పైన చెప్పుకొన్న మూడు కుదిరే ప్రాంతాల్లో సైతం ఇళ్లు ఉన్నాయి. సహజంగానే వీటి ధరలు కాస్త ఎక్కువ ఉంటాయి.

అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌, విల్లా ఏది అనేది కూడా నిర్ణయించుకుంటే తప్ప ఎంపిక సులువు కాదు.

ఆకాశహర్మ్యాలను ఎంపిక చేసుకునేటప్పుడు గతంలో పూర్తిచేసిన ప్రాజెక్టుల గురించి కూడా ఆరా తీయండి. నమ్మకం కుదిరితేనే వారి ప్రాజెక్టులో తీసుకోండి.

ఎంత బడ్జెట్‌లో ఇల్లు చూస్తున్నారనేది కూడా కీలకం. బడ్జెట్‌ మీద స్పష్టత ఉంటే ఎంపిక సులువు అవుతుంది.

ప్రత్యేకత చాటేలా..

హైఎండ్‌, ప్రీమియం ఇళ్ల ప్రాజెక్టుల్లో పోటీ పెరగడంతో నిర్మాణ సంస్థలు తమ ప్రత్యేకత చాటేందుకు ప్రయత్నిస్తున్నాయి. కొన్ని సంస్థలు తమ బ్రాండ్‌ విలువను బట్టి విక్రయిస్తుంటే.. మరికొన్ని సంస్థలు కొత్త సౌకర్యాలతో ముందుకొస్తున్నాయి. ఒక నిర్మాణ సంస్థ తమ గేటెడ్‌ కమ్యూనిటీలో ఏకంగా 50 వరకు సౌకర్యాలను కల్పిస్తోంది. మరికొన్ని సంస్థలు పర్యావరణహితంగా హరిత భవనాలను కడుతున్నాయి. వీటిపై ఎక్కువ మంది కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నారు. స్మార్ట్‌హోమ్స్‌ కడుతున్న రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు ఉన్నాయి. ఇంకొన్ని సంస్థలు నిర్మాణం పూర్తయ్యే వరకు ఈఎంఐ భారం భరిస్తామని భరోసా ఇస్తున్నాయి.

బడా సంస్థలు..

ఇటీవల పలు కొత్త సంస్థలు స్థిరాస్తి రంగంలోకి అడుగు పెట్టడంతో బడా సంస్థలు తమ పంథా మార్చుకున్నాయి. గతంలో ఒక ప్రాజెక్టు పూర్తయ్యాక మరోటి అనేలా వీరి ప్రణాళికలు ఉండేవి. ఇప్పుడు ఏకకాలంలో ప్రాజెక్టులు చేపడుతున్నారు. అనుభవం కల్గిన ఒక్కో సంస్థ 10 అంతస్తులు మొదలు 40 అంతస్తుల ప్రాజెక్టులు చేపట్టాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని