విశాలమైన ఇల్లు..తగ్గేదేలే!

హైదరాబాద్‌ స్థిరాస్తి మార్కెట్‌లో ఇప్పటికీ విశాలమైన ఇళ్లకే అధిక డిమాండ్‌ ఉంది. అత్యధిక మంది 1000-2000 చదరపు అడుగుల లోపల విస్తీర్ణం కలిగిన ఇళ్లు కొనుగోలు చేస్తున్నారు. ధరలు పెరిగినా సౌకర్యం విషయంలో

Updated : 12 Mar 2022 03:21 IST

ఈనాడు, హైదరాబాద్‌

హైదరాబాద్‌ స్థిరాస్తి మార్కెట్‌లో ఇప్పటికీ విశాలమైన ఇళ్లకే అధిక డిమాండ్‌ ఉంది. అత్యధిక మంది 1000-2000 చదరపు అడుగుల లోపల విస్తీర్ణం కలిగిన ఇళ్లు కొనుగోలు చేస్తున్నారు. ధరలు పెరిగినా సౌకర్యం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదంటున్నారు. గత నెలలో చూస్తే మొత్తం రిజిస్టర్‌ అయిన  ఫ్లాట్లలో వెయ్యి నుంచి రెండువేల లోపు చదరపు అడుగుల విస్తీర్ణంలోని ఇళ్లవాటానే 74 శాతంగా ఉంది. గత ఏడాది కంటే ఇది 4 శాతం అధికం.

రాజధాని హైదరాబాద్‌ ప్రాంతంలో ఇళ్ల ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డి జిల్లాల పరిధిలో భూముల ధరలు పెరగడంతో ఇళ్ల ధరలకు రెక్కలు వచ్చాయి. దీనికి తోడు నిర్మాణ ముడిసరకు ధరలు రోజురోజుకు  పెరుగుతుండటంతో నిర్మాణదారులూ పెంచేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో చదరపు అడుగు సగటున రూ.4368 ఉంటే.. హైదరాబాద్‌లో రూ.4048, మేడ్చల్‌ జిల్లా పరిధిలో రూ.2872, సంగారెడ్డి జిల్లాలో రూ.2484గా ఉంది. నాలుగు జిల్లాల సగటు ధర రూ.3698 ఉంది. వార్షిక పెరుగుదల 21 శాతంగా ఉంది. ఇప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో సగటు చదరపు అడుగు రూ.5వేలు పలుకుతోంది. ఈ ప్రభావం విక్రయాలపై పడింది. ధరల పెరుగుదలతో కొనుగోలు వాయిదా వేస్తున్నారు తప్ప... విస్తీర్ణం పరంగా మాత్రం రాజీ పడటం లేదు.

ఉమ్మడి అవసరాలకే అధికం..

కొత్తగా కడుతున్న బహుళ అంతస్తుల గృహ నిర్మాణ ప్రాజెక్టుల్లో సౌకర్యాలకు పెద్ద పీట వేస్తున్నారు. విశాలమైన కారిడార్‌, క్లబ్‌హౌస్‌, ఫాట్ల మధ్య ఎడం వంటివి పాటిస్తున్నారు. 1000 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఇల్లు కొంటే 30 శాతం ఉమ్మడి అవసరాలకే పోతుంది. దీంతో కార్పెట్‌ ఏరియా తగ్గుతోంది. చూడటానికి ఇల్లు మరీ చిన్నగా కనబడుతోంది. స్టాండలోన్‌ అపార్ట్‌మెంట్లలో 800 చ.అ. విస్తీర్ణం వరకు వస్తుండగా.. గేటెడ్‌ కమ్యూనిటీల్లో 700 చ.అ. మాత్రమే ఉంటుంది. దీంతో ఎక్కువగా 2.5, 3 పడక గదులకు మొగ్గు చూపుతున్నారు. సహజంగా ఇవి వెయ్యి చదరపు అడుగులపైనే ఉంటాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని