Updated : 03 Dec 2022 13:26 IST

స్కైవిల్లాలు.. విల్లామెంట్‌లు

ఒక్కో ఫ్లాట్‌ నాలుగైదు వేల నుంచి పదహారు వేల విస్తీర్ణంలో
ఒక్క అంతస్థుకు ఒకటే ఉండేలా నిర్మాణాలు
ఈనాడు, హైదరాబాద్‌

ఇళ్ల నిర్మాణంలో హైదరాబాద్‌లో ప్రస్తుతం సరికొత్త పోకడ కనిపిస్తోంది. అపార్ట్‌మెంట్లలో ఒక్కో ఫ్లాట్‌ నాలుగైదు వేల విస్తీర్ణంలో విలాసవంతంగా కడుతుంటే ఔరా అనేవారు. అలాంటిది ఇప్పుడు కొన్ని చోట్ల వీటన్నింటినీ తలదన్నేలా 9వేల చదరపు అడుగుల వరకు, 16వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒకే ఒక ఫ్లాట్‌ను అత్యంత విలాసవంతంగా నిర్మిస్తున్నారు. స్కైవిల్లాలుగా, విల్లామెంట్స్‌గా తీర్చిదిద్దుతున్నారు. రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల ధరలు పలుకుతున్న వీటిని వ్యాపార, సినీ ప్రముఖులు కొనుగోలు చేస్తున్నారని నిర్మాణదారులు అంటున్నారు.  

బహుళ అంతస్తుల భవనాల్లో ఎక్కువగా రెండు, మూడు పడక గదుల ఇళ్లను నిర్మిస్తుంటారు. వీటి వాటానే 80 శాతం పైగా ఉంటుంది. నాలుగు, అంతకంటే ఎక్కువ పడక గదుల ఫ్లాట్లు కొనేవారు ఉన్నారు. అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో కొనేవారు సాధారణంగా విల్లాల వైపు మొగ్గు చూపేవారు. విల్లాల్లో ఆరువేల చదరపు అడుగుల విస్తీర్ణం వరకు త్రిఫ్లెక్స్‌లో కడుతుంటారు. అయితే ఇటీవల అపార్ట్‌మెంట్‌లలో ఇంత పెద్ద విస్తీర్ణంలో కడుతుండటం, వాటికి సైతం మంచి బుకింగ్స్‌ ఉండటం హైదరాబాద్‌ రియాల్టీలో ఇప్పుడు ప్రత్యేకంగా కనిపిస్తోంది. ఇవన్నీ కూడా ఎక్కువగా పశ్చిమ హైదరాబాద్‌లో వస్తున్నాయి. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, ఐటీ కారిడార్‌ చుట్టుపక్కల, కోకాపేటలో ఎక్కువగా నిర్మిస్తున్నారు.

విలాసాలకే విలాసం

అత్యంత విశాలంగా విలాసవంతంగా నిర్మిస్తున్న ఈ తరహా ఫ్లాట్లలో చాలా ప్రత్యేకతలే ఉంటున్నాయి. ఆరువేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫ్లోర్‌కు నాలుగు ఫ్లాట్లు ఉంటే.. పదివేలు, పదహారు వేల విస్తీర్ణంలో ఉన్నవైతే అంతస్తుకు ఒకటే ఫ్లాట్‌ ఉంటుంది. విశాలమైన కారిడార్‌తో ఫ్లాట్‌లో కాకుండా విల్లాలో ఉన్న అనుభూతి కలిగించేలా గాలి, వెలుతురు వచ్చేలా డిజైన్‌ చేస్తున్నారు. శ్లాబ్‌ ఎత్తును సైతం పెంచి.. ఇంకొన్నిచోట్ల రెండు అంతస్తుల ఎత్తులో శ్లాబ్‌ ఉండేలా కడుతున్నారు. ప్రతి ఫ్లాట్‌కు ప్రత్యేకంగా లిఫ్ట్‌ సదుపాయం కల్పిస్తున్నారు. ఎవరి లిఫ్ట్‌ వారికే. పని మనుషుల కోసం విడిగా గదులు ఉంటున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే రాజభవాలను తలపించేలా నిర్మిస్తున్నారు. నాలుగైదు పడక గదులతో పాటూ, పొడి, తడి వంటగదులు, కార్యాలయానికి ఒక గది, హోం థియేటర్‌, జిమ్‌, అతిథుల కోసం ప్రత్యేకంగా గదులతో పాటూ విశాలమైన సిట్‌ అవుట్‌, బాల్కనీ నుంచి నగరం మొత్తం వీక్షించేలా.. పార్కు, చెరువు వంటి అహ్లాదకర దృశ్యాలను వీక్షించేలా నిర్మిస్తున్నారు. పచ్చదనానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.

వాటిలోనే అధికం..  

30 నుంచి 50 అంతస్తుల భవనాల్లోనే స్కైవిల్లాలు వస్తున్నాయి. ప్రాజెక్ట్‌ను లాభసాటిగా మార్చుకునేందుకు ఈ తరహా నిర్మాణాలను బిల్డర్లు చేపడుతున్నారని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఆకాశహర్మ్యాల్లో ఎత్తుకు వెళ్లేకొద్దీ నిర్మాణ వ్యయం పెరుగుతుంది. తక్కువ విస్తీర్ణంలో ఫ్లాట్ల నిర్మాణం లాభసాటి కాదు. ఖర్చును తగ్గించుకునేందుకు ఆరువేల నుంచి పదహారు వేల విస్తీర్ణంలో ఒకటే ఫ్లాట్‌ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పై అంతస్తుల్లో ఈ తరహా స్కైవిల్లాలను కడుతున్నారు. వ్యాపార సంస్థలు, వ్యాపారులు, సినీ ప్రముఖులు ఎక్కువగా వీటిపై మొగ్గు చూపుతున్నారు. ‘బంజారాహిల్స్‌లో నివాసం ఉంటున్న సంపన్న కుటుంబాల వారసులు కొత్త ఇళ్ల కోసం చూస్తున్నారు. సమీపంలో ఉండాలని కోరుకుంటున్నారు. వ్యక్తిగత ఇళ్ల లభ్యత ఇక్కడ తగ్గిపోయింది. అధిక ధరలతో కొనే పరిస్థితులు లేవు. దీంతో అపార్ట్‌మెంట్లలో విశాలమైన ఫ్లాట్లను కొనుగోలు చేస్తున్నారు. రూ.15 కోట్ల నుంచి రూ.20కోట్ల వరకు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు’ అని బిల్డర్‌ ఒకరు తెలిపారు.

సౌకర్యాలకు లోటు లేకుండా

ఆకాశహర్మ్యాల్లో ప్రతి గేటెడ్‌ కమ్యూనిటీల్లో ఉన్నట్లే క్లబ్‌హౌస్‌తో పాటూ అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నారు. ఒక్కో క్లబ్‌హౌస్‌ని 50వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. సకలం కమ్యూనిటీల్లోనే అందుబాటులో ఉంటాయి. సినిమాలు సైతం మినీ థియేటర్‌లో ఇక్కడే చూసుకోవచ్చు. బిజినెస్‌ లాంజ్‌లు, కేఫ్‌లు, బార్‌లు సైతం ఏర్పాటు చేస్తున్నారు. వేడుకల కోసం బాంక్వెట్‌ హాల్‌,  టెర్రస్‌ పైనే ఈతకొలనులు, ఇతర ఇండోర్‌ క్రీడా సదుపాయాలు కల్పిస్తున్నారు. తొలిసారిగా  హైదరాబాద్‌లో ఒక సంస్థ స్కైడెక్‌ను ఏర్పాటు చేసింది. ఆకాశహర్మ్యాలన్నీ 40 నుంచి 50 అంతస్తుల్లో వేర్వేరు టవర్లుగా నిర్మిస్తుంటారు. దేనికదే ప్రత్యేకం. ఈ తరహా టవర్ల టెర్రస్‌ను కలిపి డెక్‌గా నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు విదేశాల్లోనే ఈ తరహా ఏర్పాట్లు ఉన్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు