సొంతింటి వారు అవ్వండిలా

నగరంలో సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు ఇదో చక్కటి అవకాశం. అతి తక్కువ ధరలోనే నగరంలో కీలక ప్రాంతాల్లో ప్లాట్లు దక్కించుకునేందుకు హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) మరో అవకాశం కల్పించింది.

Updated : 24 Dec 2022 07:05 IST

మిగిలిపోయిన రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్లకు మళ్లీ లాటరీ
రూ.13 లక్షలకే సింగిల్‌ బెడ్‌రూం ఇళ్లు పొందే అవకాశం

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలో సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు ఇదో చక్కటి అవకాశం. అతి తక్కువ ధరలోనే నగరంలో కీలక ప్రాంతాల్లో ప్లాట్లు దక్కించుకునేందుకు హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) మరో అవకాశం కల్పించింది. బండ్లగూడ, పోచారం రాజీవ్‌ స్వగృహకు సంబంధించి అపార్ట్‌మెంట్లలో మిగిలిపోయిన ఫ్లాట్లను తిరిగి లాటరీలో విక్రయించనున్నారు. నిబంధనల ప్రకారం వాటిని దక్కించుకోవాలంటే జనవరి 18లోపు టోకెన్‌ అడ్వాన్సు చెల్లించాల్సి ఉంటుంది. 1బీహెచ్‌కెకు రూ.లక్ష, 2బీహెచ్‌కెకు రూ.2 లక్షలు, 3బీహెచ్‌కె, డీలక్స్‌ ఫ్లాట్లకు రూ.3 లక్షల వంతున టోకెన్‌ అడ్వాన్సు కింద నిర్ణయించారు. ఈ రెండు చోట్ల మొత్తం 3200 ఫ్లాట్లు తొలుత అందుబాటులో ఉండేవి. అయితే విడతల వారీగా జరిపిన లాటరీల్లో చాలా మేరకు అమ్ముడుపోయాయి. బండ్లగూడలో ఇప్పటికే 3బీహెచ్‌కే ఫ్లాట్లు అన్నీ విక్రయించారు. ప్రస్తుతం ఇక్కడ 1బీహెచ్‌కె, 1బీహెచ్‌కే సీనియర్‌ సిటిజన్ల ఫ్లాట్లు మిగిలి ఉన్నాయి. పోచారంలో కేవలం 16 మూడు పడకల గదుల ఫ్లాట్లు ఉన్నాయని అధికారులు తెలిపారు. రూ.13 లక్షలతో ఇక్కడ 1బీహెచ్‌కె ఫ్లాటును సొంతం చేసుకునే అవకాశం ఉంది. చిరుద్యోగులు సైతం వీటిని దక్కించుకునే అవకాశం ఉంది. రెండు చోట్ల 3బీహెచ్‌కె హాట్‌ కేక్‌ల్లా అమ్ముడు పోయాయి. పోచారం చుట్టూ ఐటీ కంపెనీలు విస్తరించనున్న నేపథ్యంలో ఇక్కడ డిమాండ్‌ నెలకొంది. బండ్లగూడ, పోచారంలలో రెండు చోట్ల 3బీహెచ్‌కే డీలక్స్‌, 3బీహెచ్‌కె, 2బీహెచ్‌కె, 1బీహెచ్‌కె కేటగిరీలకు సంబంధించి దాదాపు 3200 ఫ్లాట్లకు గతంలో లాటరీ నిర్వహించిన సంగతి తెలిసిందే. వీటిని దక్కించుకున్న వారిలో చాలామంది డబ్బులు కట్టేందుకు ముందుకు రాలేదు. అలా ఈ రెండు చోట్ల దాదాపు 2 వేల పైనే మిగిలిపోయాయి. తర్వాత టోకెన్‌ అడ్వాన్సు నిబంధన పెట్టడంతో అవసరమైన వారు మాత్రమే ముందుకొచ్చి ఇళ్లు దక్కించుకున్నారు. ఈ మేరకు అందుబాటులోని 3బీహెచ్‌కే, 3బీహెచ్‌కే డీలక్స్‌ ఫ్లాట్ల కంటే మూడు రెట్లమంది టోకెన్‌ అడ్వాన్సులు చెల్లించారు. బండ్లగూడలో 2బీహెచ్‌కె ఇళ్లకు మంచి డిమాండ్‌ వచ్చింది. ఇప్పటికే అన్నీ అమ్మేశారు. 1బీహెచ్‌కె ఫ్లాట్లు మాత్రం ఖాళీగా ఉన్నాయన్నారు. వీటిని కూడా పూర్తి స్థాయిలో విక్రయించాలని అధికారులు భావిస్తున్నారు. బండ్లగూడలో 1బీహెచ్‌కె రూ.15 లక్షలు, పోచారంలో రూ.13 లక్షలకే కొనుక్కునే అవకాశం లభించనుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని