పరిపాలన చెంత అభివృద్ధి

తూర్పున రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌.. ఉత్తరాన మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయం.. నగరానికి రెండు దిక్కులా రెండు బడా ప్రభుత్వ కార్యాలయాల సముదాయం అందుబాటులోకి వచ్చింది. ఇన్నాళ్లు కలెక్టరేట్లు నిర్మించినా.. ప్రారంభోత్సవానికి నోచుకోకపోవడంతో

Published : 03 Sep 2022 01:21 IST

కలెక్టరేట్‌ మార్గాల్లోని ధరల్లో కదలిక

ఈనాడు, హైదరాబాద్‌

తూర్పున రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌.. ఉత్తరాన మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయం.. నగరానికి రెండు దిక్కులా రెండు బడా ప్రభుత్వ కార్యాలయాల సముదాయం అందుబాటులోకి వచ్చింది. ఇన్నాళ్లు కలెక్టరేట్లు నిర్మించినా.. ప్రారంభోత్సవానికి నోచుకోకపోవడంతో రాకపోకలు లేక ప్రాంతాలు స్తబ్దుగా ఉండేవి. ఇప్పుడు అవి అందుబాటులోకి రావడంతో స్థిరాస్తిలో కొంతమేర కదలిక వచ్చిందని వ్యాపారవర్గాలు చెబుతున్నాయి.

గత నెల 17న మేడ్చల్‌ సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం.. 25న రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించారు. ప్రస్తుతం ఆయా భవనాల్లోకి జిల్లా కార్యాలయాలు తరలివెళ్లాయి. ప్రజల నుంచి రాకపోకలు మెల్లగా షురూ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో స్థిరాస్తి రంగంలో కొంత కదలిక వచ్చింది. ప్రస్తుతం కలెక్టరేట్లకు సమీపంలోని స్థలాలలో ప్లాట్లు కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. మేడ్చల్‌ జిల్లా కలెక్టరేట్‌ అంతాయిపల్లి వద్ద నిర్మించగా.. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ కొంగరకలాన్‌ వద్ద నిర్మించారు. ఆయా ప్రాంతాలకు వెళ్లే దారుల్లో ఉన్న మార్గాలలో ప్రత్యేక టెంట్లు వేసి విక్రయాలను ప్రోత్సహిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా చుట్టుపక్కల చాలావరకు ప్రభుత్వ భూములు ఉన్నట్లు చెబుతున్నారు. ఆదిభట్ల అవుటర్‌ రింగురోడ్డు నుంచి కలెక్టరేట్‌కు వెళ్లే దారిలో ఖాళీ స్థలాలపై స్థిరాస్తి వ్యాపారులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే కొన్నిచోట్ల వెంచర్లు ఏర్పాటు చేశారు. గతంలో రూ.17-18వేలుగా ఉన్న చదరపు గజం విలువలో మార్పులు కనిపిస్తున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా రూ.20-25వేల మధ్య ధరలు పలుకుతున్నాయి. దీనికితోడు ఎకరా రూ.4-5కోట్ల వరకు పలుకుతోంది. మేడ్చల్‌ జిల్లా కలెక్టరేట్‌ సమీపంలోనూ ధరలు ఆకాశాన్నంటాయి. ఎకరా రూ.7 కోట్ల వరకు పలుకుతున్నట్లు మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. చదరపు గజం రూ.25-30వేల వరకు ఉంటోంది. ఇప్పుడే కలెక్టరేట్‌లు అందుబాటులోకి రావడంతో ప్రజల రాకపోకలు పెరగడం, వాహనాల సంచారం పెరిగితే ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు భావిస్తున్నారు.

రంగారెడ్డి కలెక్టరేట్‌ అవుటర్‌ రింగురోడ్డుకు చేరువలో ఉంది. కొంగరకలాన్, ఆదిభట్ల, రావిర్యాల గ్రామాలకు సమీపంలో ఉండటంతో ఆ ప్రభావం చుట్టుపక్కల ప్రాంతాలపై పడుతోంది. ఇప్పటికే నగరం తుర్కయాంజల్‌ వరకు విస్తరించింది. గత కొన్నేళ్లుగా ఆదిభట్లలో ఐటీ కంపెనీల రాకతో భూముల ధరలు ఆకాశాన్నంటాయి. అపార్టుమెంట్లు నిర్మించి ఫ్లాట్లు విక్రయాలు చేపడుతున్నారు. మరికొన్ని అపార్టుమెంట్లు నిర్మాణదశలో ఉన్నాయి. మేడ్చల్‌ జిల్లా కలెక్టరేట్‌ వద్ద అంతాయిపల్లి, బాబాగూడ దగ్గరలో ఉంది. ఇది తూంకుంట మున్సిపాలిటీ పరిధిలో ఉంది. ఇక్కడ ఎక్కువగా ఫాంహౌస్‌ సంస్కృతి నడుస్తోంది. కొన్నేళ్లుగా అర ఎకరా నుంచి పది ఎకరాల మేరకు భూములు కొనుగోలు చేసి ఫాంహౌస్‌లు నిర్మించుకున్నారు. లే అవుట్లు పెద్దగా లేకపోవడంతో వీటి కోసం అన్వేషిస్తున్నారు. దీనికితోడు బిట్స్‌ సమీపంలో ఉండటంతో రాకపోకలు ఎక్కువగా జరుగుతున్నాయి. కలెక్టరేట్‌కు కేవలం రెండు కిలోమీటర్ల దూరంలోనే బిట్స్‌ ఉంది. ప్రస్తుతం హకీంపేట వరకు పెద్దఎత్తున నివాసాలు విస్తరించాయి. తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోని స్థిరాస్తి వ్యాపారంలోనూ మార్పులు రానున్నాయని చెబుతున్నారు. ప్రస్తుతం కలెక్టరేట్‌ను చూపించి బాబాగూడ-బొమ్మరాశిపేట మధ్యలో భూముల విక్రయాలు పెద్దఎత్తున చేపడుతున్నారు. ఇక్కడి నుంచి కలెక్టరేట్‌ నుంచి నాలుగు కిలోమీటర్లలో ఉంది. కలెక్టరేట్‌ వద్ద ఒకే లేఅవుట్‌ ఉండటంతోపాటు ఖాళీ స్థలాలు తక్కువగా ఉండటంతో బాబాగూడ, బొమ్మరాశిపేట ప్రాంతాల్లో స్థిరాస్తి వ్యాపారులు క్రయవిక్రయాలపై దృష్టి పెట్టారు.


దశలవారీగా చేపట్టే ప్రాజెక్టుల్లో...

ఈనాడు, హైదరాబాద్‌

నిర్మాణ సంస్థలు ఇటీవల భారీ ప్రాజెక్టులు చేపడుతున్నాయి. పదుల ఎకరాల విస్తీర్ణంలో పది టవర్ల వరకు నిర్మిస్తున్నాయి. కొనుగోలుదారుల నుంచి వచ్చే స్పందనను బట్టి దశలవారీగా చేపడుతుంటారు.

వీటిలో కొనేటప్పుడు...

* దశలవారీగా చేపట్టే ప్రాజెక్ట్‌ల్లో అంతకుముందు పూర్తికావొచ్చిన నిర్మాణాన్ని కొనుగోలుదారులు ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం ఉంటుంది. చెప్పిన సౌకర్యాలన్నీ కల్పించారా లేదా? నిర్మాణం నాణ్యత ఎలా ఉంది వంటి విషయాలను పరిశీలించవచ్చు. * ఆమోదిత ప్రాజెక్టులు కాబట్టి గృహరుణాలు పొందడం సులువు. * మొదటి దశకు, తర్వాత చేపట్టే దశ ప్రాజెక్ట్‌ల్లో ధరల పరంగా చాలా వ్యత్యాసం ఉంటుంది. దీన్ని బట్టి అక్కడ కొనడం తెలివైన నిర్ణయమా కాదా అనేది తేల్చుకోవడానికి ఎక్కువ ఆలోచించాల్సిన పని ఉండదు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని