కొనడమా? ఆగడమా?

మార్కెట్‌ స్తబ్ధుగా ఉంది.. ఇప్పుడు కొనడం మేలా? కొంతకాలం ఆగి.. మార్కెట్‌ మళ్లీ పెరిగేటప్పుడు కొనడం ఉత్తమమా? సొంతిల్లు కొనుగోలు చేసేవారికి మొదటిదే సరైన సమయం అంటున్నారు నిర్మాణ రంగ నిపుణులు.

Updated : 04 Mar 2023 08:55 IST

ఈనాడు, హైదరాబాద్‌: మార్కెట్‌ స్తబ్ధుగా ఉంది.. ఇప్పుడు కొనడం మేలా? కొంతకాలం ఆగి.. మార్కెట్‌ మళ్లీ పెరిగేటప్పుడు కొనడం ఉత్తమమా? సొంతిల్లు కొనుగోలు చేసేవారికి మొదటిదే సరైన సమయం అంటున్నారు నిర్మాణ రంగ నిపుణులు. ఇటీవల వరకు మార్కెట్లో పెట్టుబడిదారులు పెద్ద సంఖ్యలో ఉండేవారు. ఈ రోజు పెట్టుబడి పెట్టి నెల, రెండు నెలల్లోనే ధరలు పెరగ్గానే అమ్మేసేవాళ్లు. దీంతో ఏ రోజుకారోజు భూముల ధరలు పెరిగేపోయేవి. ఏడాది రెండేళ్లలోపే ధరలు రెండింతలైన దాఖలాలు ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో అటువంటి పరిస్థితి లేకపోవడంతో ఇన్వెస్టర్లు చాలామంది దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఇల్లు ఎవరికైతే అవసరం ఉందో వారే కొనుగోలు చేస్తుండటంతో మార్కెట్లో ధరలు కొద్దికాలం నుంచి నిలకడగా ఉన్నాయి. కొనుగోలుదారులకు ఇదే సరైన సమయం అని స్థిరాస్తి సంస్థలు చెబుతున్నాయి.

కొవిడ్‌ తర్వాత..

భూముల ధరలు పెరిగితే.. ఆ మేరకు ఇళ్ల ధరల్లో పెరుగుదల ఉంటోంది. కొవిడ్‌ తర్వాత పెరిగిన ధరల ప్రభావం ఇప్పుడు కనిపిస్తోంది. భూముల ధరలకు తోడు నిర్మాణ సామగ్రి, కూలీల వ్యయం పెరగడంతో ఇంటి ధరలు పెంచేశారు. రెండేళ్లలోనే చాలా ప్రాంతాల్లో చదరపు అడుగు వెయ్యి నుంచి పదిహేను వందల వరకు పెరిగింది. ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతులు మెరుగు కావడం కూడా ధరల పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది. ఫిబ్రవరిలో నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా విడుదల చేసిన నివేదిక ప్రకారం హైదరాబాద్‌ రాజధాని జిల్లాల పరిధిలోని ప్రాంతాల్లో సగటు చదరపు అడుగు రూ.3,665గా రిజిస్ట్రేషన్‌ విలువల ప్రకారం లెక్కకట్టారు. హైదరాబాద్‌ జిల్లాలో సగటు చదరపు అడుగు ధర రూ.4,149గా ఉంది. రంగారెడ్డిలో రూ.4,148, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో రూ.2,990, సంగారెడ్డి జిల్లాలో చ.అ.ధర రూ.2,973గా ఉంది. గరిష్ఠ ధరలు చూస్తే సిటీలో చుక్కలను తాకుతున్నాయి. ఐటీ కారిడార్‌ చుట్టుపక్కల చదరపు అడుగు రూ.7వేల నుంచి రూ13వేల మధ్య నడుస్తోంది. ప్రీమియం ప్రాజెక్టుల్లో ఇంకా ఎక్కువే ఉంది. ఐటీ కారిడార్‌ నడిబొడ్డున ఉన్న ఒక గేటెడ్‌ కమ్యూనిటీలో రీసేల్‌లోనే చదరపు అడుగు రూ.16వేలు చెబుతున్నారని బిల్డర్‌ ఒకరు అన్నారు. కొత్తవాటిలో ఇంతకంటే చాలా తక్కువకే దొరుకుతున్నాయని చెప్పారు. హైదరాబాద్‌ ఈస్ట్‌లో కొవిడ్‌ తర్వాతే పెద్ద ప్రాజెక్టుల్లో చదరపు అడుగు ధర రూ.1500 వరకు పెరిగింది. ప్రస్తుతం ఈ ధరలు కొద్ది రోజులుగా నిలకడగా ఉన్నాయి. ఈ పరిస్థితి ఎన్నికల వరకు ఉంటుందని మరొక బిల్డర్‌ అన్నారు. నిలకడైన వృద్ధే కొనుగోలుదారులకు, నిర్మాణదారులకు మేలు చేస్తుందని చెబుతున్నారు.

ఒక్కసారిగా పెరుగుతోంది..  

హైదరాబాద్‌ మార్కెట్లో గతంలోని పరిస్థితులు చూస్తే స్తబ్ధుగా ఉన్న తర్వాత ఒక్కసారిగా ధరల పెరుగుదల ఉంటోంది. గతంలో అనేక పర్యాయాలు ఇది జరిగింది. తెలంగాణ వచ్చిన కొత్తలో ధరలు తగ్గుతాయని ప్రచారం జరిగింది. మార్కెట్‌ కొంతకాలం స్తబ్ధుగా ఉంది. సర్కారు నిలదొక్కుకుని ప్రభుత్వ ప్రాధాన్యాలు అర్థం అయ్యాక హైదరాబాద్‌ భవిష్యత్తుకు ఢోకా ఉండదని భరోసా వచ్చాక కొనుగోళ్లు పెరిగాయి. సహజంగా డిమాండ్‌ పెరగడంతో ధరలు పెరిగాయి. ఆ తర్వాత నోట్ల రోద్దు, ఇటీవల కొవిడ్‌ ప్రభావం సమయంలో కొన్నాళ్లుగా మార్కెట్‌ ఒడిదొడుకులు ఎదుర్కొన్నా.. ఆ తర్వాత ఒక్కసారిగా పెరుగుతోంది. దీన్నే బేస్‌ ప్రభావం అని ఆర్థిక నిపుణులు చెబుతుంటారు. ఈసారి కూడా పెరిగే వరకు ఎదురుచూడకుండా నిజంగా ఇంటి అవసరం ఉన్నవారు కొనుగోలు చేయడం ఉత్తమం అని చెబుతున్నారు.

బేరమాడితే..

నిజంగా ఇంటి అవసరం ఉండి కొనుగోలు చేసేవారు ఉంటే బిల్డర్లు సైతం కొంత ధర తగ్గించడానికి సిద్ధపడుతున్నారు. ఇన్వెంటరీ పెరిగే కొద్దీ వారికి నష్టం.. అందువల్ల సాధ్యమైనంత వరకు విక్రయించేందుకే చూస్తుంటారు. బేరమాడితే ధర తగ్గే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ప్రాజెక్టులు సైతం విస్తృతంగా అందుబాటులో ఉన్నాయి. నచ్చిన వాటిని ఎంపిక చేసుకోవచ్చు.

ఆలస్యంతో అందుకోనంతగా..

ఐటీ కారిడార్‌లో అత్యధికంగా గృహ నిర్మాణ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వాటిలో రెండు, మూడు పడక గదుల అపార్ట్‌మెంట్ల ఫ్లాట్లే ఎక్కువ. వీటి ధరలు ఇదివరకు కోటి లోపు ఉండేవి. ప్రస్తుతం కోటి నుంచి రెండు కోట్ల లోపు ధరల్లో ఇళ్లు వస్తున్నాయి. కొత్త ప్రాజెక్టులో ఎక్కువగా ప్రీమియం విభాగంలో నిర్మిస్తున్నారు. ఇంటి విస్తీర్ణంలో నాలుగైదువేల చదరపు అడుగులు ఉంటోంది. స్కైవిల్లాలు డిజైన్‌ చేస్తున్నారు. ఈ తరహా ప్రాజెక్టులో ఫ్లాటే ఆరేడు కోట్ల రూపాయలు అవుతోంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌ లాంటి మార్కెట్లో ఇళ్ల ధరలు ఎదురుచూసే కొద్దీ పెరగడమే తప్ప తగ్గిన సందర్భాలు అత్యంత తక్కువని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్‌ ఈస్ట్‌లో ప్రధాన ప్రాంతాల్లో చదరపు అడుగు ధర నాలుగైదు వేల రూపాయల లోపు ఉండేది. రూ.50 లక్షల్లో ఫ్లాట్‌ వచ్చేది. ఇప్పుడు అక్కడ కూడా ఆరేడువేలు చెబుతున్నారు. గేటెడ్‌ కమ్యూనిటీల్లో కోటి రూపాయల దాకా అవుతోంది. దక్షిణ హైదరాబాద్‌ అత్యంత తక్కువ ధరలతో అందుబాటులో ఉండేవి. ఇప్పుడు ఈ మార్గంలో దూరం వెళ్లినా సరే ఐదారువేలకు తక్కువ చెప్పడం లేదు. ఉత్తరం వైపు ఇదే పోకడ కనిపిస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని