ఎక్కడైనా పనికి చోటు

రియల్‌ ఎస్టేట్‌లో మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా నిర్మాణాల్లో మార్పులు వస్తున్నాయి. ప్రత్యేకించి కార్యాలయాల్లో సరికొత్త పోకడలు విస్తరిస్తున్నాయి. హైదరాబాద్‌లో ‘ఫ్లెక్సిబుల్‌ స్పేస్‌’ మార్కెట్‌

Updated : 11 Dec 2021 06:23 IST

ఈనాడు, హైదరాబాద్‌

రియల్‌ ఎస్టేట్‌లో మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా నిర్మాణాల్లో మార్పులు వస్తున్నాయి. ప్రత్యేకించి కార్యాలయాల్లో సరికొత్త పోకడలు విస్తరిస్తున్నాయి. హైదరాబాద్‌లో ‘ఫ్లెక్సిబుల్‌ స్పేస్‌’ మార్కెట్‌ పుంజుకుంటోంది. భవిష్యత్తు వీటిదేనని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. పలు ఐటీ, అంకుర సంస్థలు ఫ్లెక్సీ స్పేస్‌ను కోరుకుంటున్నాయి. ఈ తరహావి కార్యాలయ భవనాల్లోనే ఉండాల్సిన పనిలేదు.. షాపింగ్‌ మాల్స్‌లో, హోటళ్లలో.. ఇలా ఎక్కడైనా ఉండే వెసులుబాటే వీటి ప్రత్యేకత. ఇలాంటి నిర్మాణాల్లో ఐటీ నగరి బెంగళూరు మొదటి స్థానంలో ఉండగా.. ఆ తర్వాత హైదరాబాద్‌ రెండో స్థానంలో ఉంది. దిల్లీ మూడో స్థానానికి పడిపోయింది.

నిర్మాణ రంగంలో గృహ, వాణిజ్య, రిటైల్‌, వేర్‌హౌసింగ్‌, కో లివింగ్‌, హాస్పిటాలిటీతో పాటూ కార్యాలయాల్లో కొత్తగా ఫ్లెక్సిబుల్‌ స్పేస్‌ విభాగంలోనూ డెవలప్‌మెంట్‌కు అవకాశాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ఉత్పాదకత పెంచేందుకు  సైతం ఫ్లెక్సీ స్పేస్‌లు దోహదం చేస్తున్నాయని ఆయా సంస్థలు చెబుతుండటంతో వీటికి క్రమంగా డిమాండ్‌ పెరుగుతోంది.  అంకుర సంస్థలు, ఇంక్యుబేటర్స్‌, బిజినెస్‌ సెంటర్లు ఎక్కువగా వీటిలో ఏర్పాటు చేస్తున్నారు. కో వర్కింగ్‌ కేంద్రాలుగా పనిచేస్తున్నాయి.

ఇలా ఉంటాయి..

పూర్తి ఫర్నిచర్‌తో ఏర్పాటైన కార్యాలయాలు ఇవి. పని ప్రదేశాన్ని ఇతరులతో పంచుకోవాల్సి ఉంటుంది.  ఒకే కార్యాలయంలో ఎక్కువ సంస్థలు అద్దెకుంటాయి.  ప్రత్యేకంగా క్యూబ్స్‌ ఉంటాయి. ఇందులో పనిచేసేవారు స్వల్పకాలానికి సైతం వినియోగిస్తుంటారు. ఒక రోజు కూడా ఉపయోగించుకోవచ్చు. నెలకు కూడా లీజు తీసుకోవచ్చు. ఇలాంటి వెసులుబాటు ఉండటం వీటిలో ప్రత్యేకత.

సీబీఆర్‌ఈ నివేదిక ప్రకారం..

* ఫ్లెక్సిబుల్‌ స్పేస్‌లో కార్యాలయాల వాటా 2017లో 5 శాతం నుంచి  2018 నాటికి 10 శాతానికి పెరిగింది. 2021 వచ్చేసరికి రెట్టింపైంది. 3.6 కోట్ల చదరపు అడుగులకు పెరిగింది.

* బెంగళూరులో ఫ్లెక్సీ స్పేస్‌ కోటి 16 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటయ్యాయి. ఇక్కడ 6.3 శాతంతో విస్తరిస్తోంది.

* మూడేళ్ల క్రితం 12 లక్షల చ.అ. ఉన్న హైదరాబాద్‌లో ఇప్పుడు 57 లక్షలకు పెరిగింది. ఇక్కడ ఎక్కువగా దేశవాళీ సంస్థలే లీజింగ్‌ వ్యవహారాలను చక్కబెడుతున్నాయి.

* దిల్లీలో 66 లక్షల చ.అ. విస్తీర్ణంలో ఉంటే ముంబయి 46 లక్షల చ.అ.విస్తీర్ణంలో ఏర్పాటయ్యాయి.

* పుణెలో 28 లక్షల చ.అ., చెన్నైలో 21 లక్షల చ.అ. విస్తీర్ణంలో ఫ్లెక్సీ స్పేస్‌ కార్యాలయాలు ఉన్నాయి. ఎక్కువగా ఐటీ కార్యాలయాలు ఉన్నచోట వీటికి డిమాండ్‌ ఉంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని