House Rents: హైదరాబాద్‌లో అద్దెలు పెరిగాయ్‌..

అద్దె ఇళ్లకు హైదరాబాద్‌లో ప్రస్తుతం డిమాండ్‌ పెరిగిందా? సౌకర్యంగా ఉన్న ఇళ్లు దొరకడం లేదా?... అవుననే అంటున్నాయి రియల్‌ ఎస్టేట్‌ ఆన్‌లైన్‌ పోర్టళ్లు.  కొవిడ్‌ భయాలు తొలగి సాధారణ పరిస్థితులు నెలకొనడంతో ఏడాదికాలంగా అద్దె ఇళ్లు కావాలని అడిగేవారు పెరిగారు.

Updated : 06 Aug 2022 09:36 IST

కిరాయి ఇళ్లకు క్రమంగా పెరుగుతున్న డిమాండ్‌

ఈనాడు, హైదరాబాద్‌: అద్దె ఇళ్లకు హైదరాబాద్‌లో ప్రస్తుతం డిమాండ్‌ పెరిగిందా? సౌకర్యంగా ఉన్న ఇళ్లు దొరకడం లేదా?... అవుననే అంటున్నాయి రియల్‌ ఎస్టేట్‌ ఆన్‌లైన్‌ పోర్టళ్లు.  కొవిడ్‌ భయాలు తొలగి సాధారణ పరిస్థితులు నెలకొనడంతో ఏడాదికాలంగా అద్దె ఇళ్లు కావాలని అడిగేవారు పెరిగారు. గత త్రైమాసికంలో ఇది 42 శాతం పెరిగింది. బెంగళూరు, గ్రేటర్‌ నోయిడా తర్వాత హైదరాబాద్‌లో డిమాండ్‌ అధికంగా ఉందని మ్యాజిక్‌ బ్రిక్స్‌ తాజాగా విడుదల చేసిన రెంటల్‌ ఇండెక్స్‌లో వెల్లడించింది.  దేశంలో అత్యధికంగా హైదరాబాద్‌లోనే అద్దెలు పెరిగాయని ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసిక నివేదికలో వివరించింది. 

అక్కడే ఉండాలనుకుంటున్నారు...
ఐటీ ఉద్యోగులు పని ప్రదేశానికి సమీపంలో ఉండేందుకు  ఇష్టపడుతున్నారు. ఈ కారణంగా ఆ కారిడార్‌ చుట్టుపక్కలే  అద్దెలకూ డిమాండ్‌ ఎక్కువ. సగటు అద్దెలు చూస్తే.. హైటెక్‌సిటీలో రెండు పడక గదుల ఇంటికి రూ.20 వేలు, మూడు పడక గదులైతే 30 వేల వరకు ఉంది. గచ్చిబౌలిలో రూ.20 వేల నుంచి రూ.29 వేల వరకు, కొండాపూర్‌లో రూ.17 వేల నుంచి రూ.24వేల వరకు చెబుతున్నారు. కోకాపేటలో రూ.19 వేల నుంచి రూ.25 వేల వరకు చెల్లిస్తున్నారు. మణికొండ, నార్సింగి, నల్లగండ్ల, కూకట్‌పల్లి, మియాపూర్‌ ప్రాంతాల్లోనూ అద్దె ఇళ్లకు డిమాండ్‌ అధికమైంది. గచ్చిబౌలి, కొండాపూర్‌, హైటెక్‌సిటీ ప్రీమియం అద్దె ఇళ్ల మార్కెట్‌ కాగా.. మిగతావి అందుబాటు మార్కెట్‌గా సంస్థలు పరిగణిస్తున్నాయి.

విశాలమైన ఇళ్లవైపే... అధికాదాయ వర్గాల వారు మూడు పడక గదుల కిరాయి ఇళ్లు కావాలని అడుగుతున్నారు. వీరి వాటా 45 శాతం కాగా.. రెండు పడక గదుల కోసం చూస్తున్నవారు 40 శాతంగా ఉన్నారు. చిన్న ఇళ్ల కోసం వెతికేవారు 11 శాతమే. వెయ్యి నుంచి రెండు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలోని వాటికి ప్రాధాన్యం ఇస్తున్నవారు 64 శాతం మంది ఉన్నారు.

అద్దెల వారీగా చూస్తే..
* రూ.10 వేలు-20 వేల మధ్య ఇళ్లకు డిమాండ్‌ అధికం. వీరి వాటా 35 శాతం. సరఫరా 19 శాతం. * రూ.20 వేలు-రూ.30 వేల మధ్య ఇంటి కోసం చూస్తున్నవారు 25 శాతంగా ఉన్నారు. సరఫరా 45 శాతం. * రూ.30 వేల నుంచి రూ.40 వేల మధ్య గృహాలకు 16 శాతం, రూ.40 వేలు-రూ.50 వేల మధ్య వాటికి 8 శాతం డిమాండ్‌ ఉండగా.. ఇళ్ల లభ్యత 18 శాతం, 8 శాతం ఉంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని