మన మార్కెట్‌ పరిమాణం ఎంత?

వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌ నగరంలో అదే స్థాయిలో స్థిరాస్తి కార్యకలాపాలు జరుగుతున్నాయా? ఇతర నగరాలతో పోలిస్తే మనం ఎక్కడ ఉన్నాం? మన నిర్మాణాల పరిమాణం ఎంత? రాష్ట్రవ్యాప్తంగా సగటున ఏటా లక్ష కోట్ల విలువైన ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, స్థలాలు, భూముల లావాదేవీలు జరుగుతున్నాయి.

Published : 24 Jun 2023 04:03 IST

స్థిరాస్తి కార్యకలాపాల్లో హెచ్చుతగ్గులు

వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌ నగరంలో అదే స్థాయిలో స్థిరాస్తి కార్యకలాపాలు జరుగుతున్నాయా? ఇతర నగరాలతో పోలిస్తే మనం ఎక్కడ ఉన్నాం? మన నిర్మాణాల పరిమాణం ఎంత? రాష్ట్రవ్యాప్తంగా సగటున ఏటా లక్ష కోట్ల విలువైన ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, స్థలాలు, భూముల లావాదేవీలు జరుగుతున్నాయి. ఇళ్లతో పోలిస్తే భూ లావాదేవీల వాటానే ఇందులో అధికంగా ఉంటోంది. దేశంలోని ఇతర మెట్రో నగరాల్లో ఇందుకు భిన్నంగా ఇళ్ల నిర్మాణాల వాటా ఎక్కువగా ఉంటోంది. రియల్‌ ఎస్టేట్‌లో ప్రధానంగా నిర్మాణ సంస్థలు ఎక్కువగా గృహాలు, కార్యాలయాలు, వాణిజ్య భవనాలు, మాల్స్‌ నిర్మిస్తుంటాయి. ఈ జాబితాలోకి వేర్‌హౌసింగ్‌, డాటాసెంటర్లు ఇలా ఒక్కోటి వచ్చి చేరుతున్నాయి. గృహ నిర్మాణ పరంగా వ్యవస్థీకృత రంగంలో హైదరాబాద్‌ వాటా చాలా స్వల్పంగా ఉంది.

వేర్‌హౌసింగ్‌లో : సరుకు నిల్వ, ఈ-కామర్స్‌ సంస్థల కోసం నిర్మించే వేర్‌హౌసింగ్‌ లీజింగ్‌లో ముంబయి ముందువరసలో ఉంది. ఇక్కడ గత ఆర్థిక సంవత్సరంలో 9.5 మిలియన్‌ చదరపు అడుగుల విస్తీర్ణంలో లీజింగ్‌ ఒప్పందాలు కుదిరాయని నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా తెలిపింది. దిల్లీలో 8.6, బెంగళూరులో 7.4, పుణెలో 7.4 మి.చ.అ. లావాదేవీలు జరిగాయి. హైదరాబాద్‌ 5.1 మి.చ.అ.తో ఐదో స్థానంలో నిలిచింది.

కొత్త ఇళ్ల నిర్మాణపరంగా దిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాలు మన నగరం అందుకోనంత ఎత్తులో ఉన్నాయి. ఏటా ఆయా నగరాల్లో నిర్మిస్తున్న ఇళ్లు లక్షపైనే ఉంటున్నాయి. అనరాక్‌ సంస్థ వెల్లడించిన డాటా ప్రకారం ఈ ఏడాది దిల్లీ రాజధాని ప్రాంతంలో 1.70 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తిచేయబోతున్నారని తెలిపింది. ముంబయిలో యూనిట్ల సంఖ్య 1.31 లక్షలుగా ఉంది. పుణెలో 98,400 ఇళ్లు, బెంగళూరులో 80,100 ఇళ్లు పూర్తిచేయబోతున్నారట. హైదరాబాద్‌కు వచ్చేసరికి 23,800 మాత్రమే బిల్డర్లు పూర్తిచేయబోతున్నట్లు తెలిపింది. ఆయా నగరాలతో పోలిస్తే మనం ఎంతోదూరంలో ఉన్నాం. మన దగ్గర వ్యవస్థీకృత రంగంలోనూ ఇంత కంటే ఎక్కువ ఇళ్ల నిర్మాణం జరుగుతుంది. ఈ రెండూ కలిపినా కూడా ఆయా నగరాల్లో నిర్మించే ఇళ్ల సంఖ్యకు దరిదాపుల్లో కూడా లేము. రిజిస్ట్రేషన్‌ అయిన ఇళ్లను పరిగణనలోకి తీసుకుంటే 2022-23 ఆర్థిక సంవత్సరంలో 67,157 ఇళ్ల లావాదేవీలు జరిగాయి. ఇందులో కొత్తవి 50వేల వరకు ఉంటాయి.

  • ప్రీమియం, బడ్జెట్‌ ఆవాసాలతో పాటు అందుబాటు ధరల్లో ఇళ్ల నిర్మాణం చేపడితే మన మార్కెట్‌ కూడా ఆయా నగరాలకు దరిదాపుల్లో ఉంటుందని ఒక రియల్టర్‌ అన్నారు. కొన్ని వర్గాలు ఇళ్లు కొనగలిగే ధరల్లో ఇళ్లు లేవని..వీరిని కూడా దృష్టిలో పెట్టుకుని నిర్మించాలని సూచించారు. ఇందుకు కావాలంటే ప్రభుత్వ తోడ్పాటు తీసుకోవాలని అన్నారు.  

కార్యాలయాల్లో

దేశంలోని ఎనిమిది అగ్ర నగరాల్లో ఈ ఏడాది తొలి త్రైమాసికంలో కార్యాలయాల గ్రాస్‌ లీజింగ్‌ 12.8 మిలియన్‌ చదరపు అడుగులుగా నమోదైంది. గత రెండేళ్లతో పోలిస్తే ఇది ఎక్కువని జేఎల్‌ఎల్‌ సంస్థ తెలిపింది. హైదరాబాద్‌కు కొత్త సంస్థల రాక, ఐటీ కంపెనీల విస్తరణతో కార్యాలయాల లీజింగ్‌లో కొంత మెరుగ్గానే ఉన్నా.. దిల్లీ, బెంగళూరు, పుణె ఆధిపత్యం కొనసాగుతోంది. పూర్తి చేసుకున్న కొత్త కార్యాలయాల పరంగా బెంగళూరు, దిల్లీ, పుణె ముందున్నాయి. పెద్ద ఒప్పందాలు ఎక్కువగా ఇక్కడే జరిగాయి.

  • లక్ష అంతకంటే ఎక్కువ చదరపు అడుగుల లీజింగ్‌ కార్యకలాపాల్లో బెంగళూరు 76 శాతంతో మొదటి స్థానంలో ఉంటే హైదరాబాద్‌ 46 శాతంతో రెండో స్థానంలో నిలిచింది.
  • ఫ్లెక్సీ ఆఫీసు స్పేస్‌లో సీట్ల పరంగా చూస్తే మొత్తం లీజింగ్‌లో బెంగళూరు వాటా 30 శాతంతో అగ్రస్థానంలో ఉండగా.. దిల్లీ, పుణె, ముంబయి, చెన్నై తర్వాత హైదరాబాద్‌ 4.3 శాతంతో ఆరో స్థానంలో నిలిచింది.
  • ఈ విభాగంలో అప్పుడప్పుడు హైదరాబాద్‌ ముందు వరసలోకి వస్తున్నా.. అది ఆ ఏడాదికే పరిమితం అవుతోంది. తీవ్ర హెచ్చుతగ్గులు ఉంటున్నాయి. కార్యాలయాల నిర్మాణాలు, లీజింగ్‌లో ఇప్పటికీ ముంబయి, బెంగళూరు నగరాలదే ఆధిపత్యం కనిపిస్తుంది.
  • 2017-23 వరకు ఐదేళ్ల వృద్ధిలోనూ ముంబయి, బెంగళూరు తర్వాత హైదరాబాద్‌ నిలిచింది.

మున్ముందు  ఆ స్థాయికి

ఆయా నగరాలు జనాభా పరంగా చాలా పెద్దవి. ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరాలుగా స్థిరపడ్డాయి. మనది ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతూ వాటితో పోటీ పడుతోంది. రియల్‌ ఎస్టేట్‌ కార్యకలాపాలు ఆయా నగరాల్లో ఎన్నో ఏళ్ల క్రితమే మొదలయ్యాయి. అపార్ట్‌మెంట్లనే కూల్చి ఇప్పుడు డెవలప్‌మెంట్‌కు ఇస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. మన దగ్గర ఇప్పుడిప్పుడే అపార్ట్‌మెంట్లు, ఆకాశహర్మ్యాలు విస్తరిస్తున్నాయి. కాబట్టే మన మార్కెట్‌ వాటి కంటే తక్కువ అని ఒక స్థిరాస్తి ప్రముఖుడు అన్నారు. మౌలిక వసతుల పరంగా ఆయా నగరాల కంటే మనం ముందున్నామని.. భవిష్యత్తుల్లో ఆయా వాటిని దాటుతామని అన్నారు. అప్పటికే ఇక్కడివారి కొనుగోలు శక్తి పెరుగుతుందని విశ్లేషించారు. పదేళ్ల క్రితం సిటీలో ఆకాశహర్మ్యాలు అనేవి ఒకటి అరా ఉండేవని.. ఇప్పుడు పెద్ద సంఖ్యలో రావడానికి ప్రధాన కారణం కొనుగోలు శక్తి పెరగడమే అని అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని