మూడుకే.. మొగ్గు

నగరంలో గృహ కొనుగోలుదారుల అవసరాలు ఇతర నగరాలతో పోలిస్తే భిన్నంగా ఉన్నాయా? అవుననే అంటున్నారు బిల్డర్లు. ఎక్కువ విస్తీర్ణంలో మూడు పడక గదుల ఇళ్లే ముందుగా బుక్‌ అవుతున్నాయని చెబుతున్నారు.

Published : 30 Sep 2023 02:03 IST

రెండు పడక గదుల ఫ్లాట్లను అమ్మడం కష్టంగా ఉందంటున్న బిల్డర్లు
ఈనాడు, హైదరాబాద్‌

నగరంలో గృహ కొనుగోలుదారుల అవసరాలు ఇతర నగరాలతో పోలిస్తే భిన్నంగా ఉన్నాయా? అవుననే అంటున్నారు బిల్డర్లు. ఎక్కువ విస్తీర్ణంలో మూడు పడక గదుల ఇళ్లే ముందుగా బుక్‌ అవుతున్నాయని చెబుతున్నారు. రెండు పడకల గదుల ఇళ్ల విక్రయాలు తక్కువగా ఉన్నాయని.. ఒక పడక గది ఇళ్లు కొనేవారే కరవయ్యారంటున్నారు.

గరంలో గృహ కొనుగోలుదారుల్లో.. ముఖ్యంగా అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లను కొంటున్నవారిలో అధికాదాయ వర్గాలు, వ్యాపార, ఉద్యోగ వర్గాలే ఎక్కువ. వీరంతా విశాలమైన ఇళ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. కొవిడ్‌ తర్వాత ఇంటి నుంచి పనిచేసే సంస్కృతి పెరగడంతో కచ్చితంగా మూడు పడకల గదులు.. బడ్జెట్‌ సహకరిస్తే ఇంకా పెద్ద ఇళ్లు కొనాలని చూస్తున్నారు. బిల్డర్లు కూడా కొవిడ్‌ తర్వాత 2.5 నుంచి 3 పడకల ఫ్లాట్లను చేపట్టారు. అన్నివర్గాలకు ఇళ్లు అందుబాటులో ఉండేలా రెండు పడకల ఫ్లాట్‌, ఒక పడక స్టూడియో ఫ్లాట్లను సైతం కొందరు బిల్డర్లు నిర్మించారు. వీటి విక్రయాలు అంత ఆశాజనకంగా లేవని బిల్డర్ల నుంచి తమకు వస్తున్న ఫీడ్‌బ్యాక్‌ అని స్థిరాస్తి సంఘాలు అంటున్నాయి.

ఎందుకు వద్దనుకుంటున్నారు?

ఆకాశహర్మ్యాలు, గేటెడ్‌ కమ్యూనిటీల్లో సౌకర్యాల కోసం ఎక్కువ స్థలం వదిలి పెడుతున్నారు. విశాలమైన కారిడార్లు, మెట్లు, లిఫ్టులు ఇతర ఉమ్మడి అవసరాల కోసం వదిలే స్థలం ఎక్కువే ఉంటుంది. కొనుగోలు చేసిన ఇంటి విస్తీర్ణంలో 30 శాతం వరకు ఉమ్మడి అవసరాలకు పోతుంది. వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణం కల్గిన 2 పడకల ఫ్లాట్‌ కొంటే బిల్టప్‌ ఏరియా 700 వరకు మాత్రమే ఉంటుంది. ప్రాజెక్ట్‌ను బట్టి ఇందులో ఎక్కువ తక్కువలు ఉంటాయి. తక్కువ విస్తీర్ణం కాబట్టి సహజంగా ఇంట్లో గదులన్నీ ఇరుకుగా ఉంటాయి. ఈ కారణంగానే పెద్ద సంస్థలు చేపట్టే కమ్యూనిటీల్లో కొనుగోలుదారులు.. రెండు పడకల ఫ్లాట్‌కు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. 2.5 బీహెచ్‌కే కొంత ఫర్వాలేదు. ఇటీవల 3 పడకల ఫ్లాట్‌కు పూర్తిగా మొగ్గు చూపుతున్నారు.

రెండు పార్కింగ్‌లు సైతం..

మూడు పడక గదుల ఫ్లాట్లకు రెండు కార్ల పార్కింగ్‌ సదుపాయం బిల్డర్లు కల్పిస్తున్నారు. అదే రెండు పడక గదుల ఇంటికైతే ఒకటే వస్తుంది. అధికాదాయ వర్గాల్లో ఇటీవల కాలంలో చూస్తే ఇంటికి రెండు కార్లు ఉంటున్నాయి. ఇప్పటికే ఒక కారు ఉంటే.. కొత్తగా ఈవీ కొనుగోలు చేస్తున్నారు. ఇవన్నీ కొనుగోలుదారుల నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయి. మరింత విశాలమైన ఫ్లాట్లకు మూడు పార్కింగ్‌లు కల్పిస్తున్నారు.

పెద్దవే కడుతున్నారు..

కొనుగోలుదారుల ఆలోచనలు.. మార్కెట్‌ స్థితిగతులను గమనించిన కొందరు బిల్డర్లు కొత్త ప్రాజెక్టుల్లో పూర్తిగా మూడు పడకల ఫ్లాట్లనే కడుతున్నారు. ముఖ్యంగా ఆకాశహర్మ్యాల్లో 1600 నుంచి 2000 చదరపు అడుగుల విస్తీర్ణంలో వీటిని నిర్మిస్తున్నారు. వీటిల్లో విక్రయాలు బాగున్నాయని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. వీటితో పాటు ఇటీవల కాలంలో నాలుగు, ఐదు పడకలు... 5వేల నుంచి 16వేల విస్తీర్ణంలో విల్లామెంట్‌లు, డ్యూప్లెక్స్‌లను అధికాదాయవర్గాల కోసం బిల్డర్లు నిర్మిస్తున్నారు. వాటి మార్కెట్‌ వాటికుందని.. రెండు పడక గదుల ఫ్లాట్లే నేల చూపు చూస్తున్నాయని చెబుతున్నారు. ‘ఒక ప్రాజెక్ట్‌లో వేర్వేరు విస్తీర్ణంలో ఫ్లాట్లను నిర్మిస్తే.. ముందుగా మూడు పడక గదుల ఫ్లాట్లు బుక్‌ అవుతున్నాయని మా బిల్డర్లు చెబుతున్నారు. రెండు పడక గదుల ఫ్లాట్లు విక్రయించడం కష్టంగా ఉందని... ఒక పడక గది ఫ్లాట్‌ను కొనేవారు లేరని తమకు వచ్చిన ఫీడ్‌బ్యాక్‌. ఒక పడక గది ఫ్లాట్‌ను బ్రహ్మచారులు కొనొచ్చు. కానీ, మన దగ్గర ఎక్కువ విస్తీర్ణం కల్గినవే కావాలంటున్నార’ని నరెడ్కో తెలంగాణ ప్రధాన కార్యదర్శి ఎం.విజయసాయి అన్నారు.


అంతరం పెరగడం...

సాధారణంగా రెండు పడక గదుల ఫ్లాట్లను సామాన్య, మధ్య తరగతి వర్గాలు కొనుగోలు చేస్తుంటాయి. అయితే వడ్డీరేట్లు, ఫ్లాట్ల ధరలు పెరగడంతో ఈ వర్గాల కొనుగోలు శక్తి తగ్గింది. కొవిడ్‌ తర్వాత విద్య, రవాణా ఖర్చులు పెరగడంతో పొదుపు తగ్గింది. దీంతో ఈ వర్గాలు సొంతింటి కలను నెరవేర్చుకోవడంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయి. మార్కెట్లో నిర్మాణ ముడిసరకులు, కూలీల ఖర్చులు పెరగడంతో నిర్మాణ వ్యయం పెరిగిందని బిల్డర్లు చెబుతున్నారు. అలాగని ఈ వర్గాలు తక్కువ విస్తీర్ణంలో దొరికే 700 చ.అ. విస్తీర్ణంలో రెండు పడకల గది ఫ్లాట్‌ను అంగీకరించే పరిస్థితుల్లో లేరని నిర్మాణ ప్రముఖులు చెబుతున్నారు. ముంబయి లాంటి నగరాల్లో అక్కడి ధరల దృష్ట్యా 300 నుంచి 650 చదరపు అడుగుల విస్తీర్ణంలోని ఫ్లాట్లలో ఉంటారని గుర్తు చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని