కదిలే ఆవాసాలు

‘ఉద్యోగ విరమణ చేశాక హాయిగా పొలం దున్నుతూ వ్యవసాయం చేయాలి... ప్రకృతిని ఆస్వాదిస్తూ అక్కడ చిన్న ఫాంహౌస్‌ నిర్మించుకోవాలి..

Updated : 11 Nov 2023 09:42 IST

ఈనాడు, హైదరాబాద్‌: ‘ఉద్యోగ విరమణ చేశాక హాయిగా పొలం దున్నుతూ వ్యవసాయం చేయాలి... ప్రకృతిని ఆస్వాదిస్తూ అక్కడ చిన్న ఫాంహౌస్‌ నిర్మించుకోవాలి... ప్రతిచోటా ఆఫీస్‌ పెట్టడం కుదరడం లేదు...ఎక్కడికంటే అక్కడికి ఆఫీస్‌ను తరలించే సదుపాయం ఉంటే బాగుండు’... ఇలా ఆలోచించే వారి కోసమే కంటైనర్‌ హోమ్‌లు వచ్చేశాయి. నిర్మాణ ఖర్చు పెద్దగా లేకపోవడంతో 200 నుంచి 500 చదరపు అడుగుల్లోనే వీటిని నిర్మించుకునే వెసులుబాటు ఉండటంతో వీటికి డిమాండ్‌ ఏర్పడింది. ఎండా, వానల నుంచి రక్షణనివ్వడంతో పాటు ఎక్కువ కాలం మన్నిక ఇచ్చేలా వీటిని రూపొందిస్తుండటంతో కొనుగోళ్లు పెరుగుతున్నాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ చుట్టుపక్కల ఫాంహౌస్‌లలో ఎక్కువగా ఇవి తారసపడుతున్నాయి. ఓ చోట పని ముగియగానే అక్కడి నుంచి వీటిని తరలించే వెసులుబాటు ఉండటం విశేషం. ఖర్చు కూడా చదరపు అడుగుకు రూ.1000 నుంచి రూ.1200 వరకు ఉండటంతో చిన్నపాటి గూడును నిర్మించుకునేందకు ఆసక్తి చూపుతున్నారు.

ఎలా తయారు చేస్తున్నారంటే..

ఎన్ని రోజులు మన్నికగా ఉంటాయి..?, ఎండా, వానల నుంచి రక్షణ ఉంటుందా..? పైకప్పు, ఫ్లోర్‌ తుప్పుపడతాయేమో..?..విద్యుదాఘాతం జరిగితే?... కంటైనర్‌ హోమ్‌ అనగానే అందరి మదిలో మెదిలే ప్రశ్నలివే. వీటికి స్పష్టమైన సమాధానాలున్నాయని తయారీదారులు హామీ ఇస్తుండటంతో కొనుగోలుదారులు ఆసక్తి చూపుతున్నారు. రెండు నుంచి మూడేళ్ల పాటు ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరిస్తామని, అయితే నిర్వహణలో జాగ్రత్తలు తప్పనిసరి అని తయారీదారులు సూచిస్తున్నారు. జీడిమెట్ల, దుండిగల్‌, నాగోల్‌తో పాటు శివారు ప్రాంతాల్లో ఈ కంటైనర్‌ హోమ్‌ తయారీ కేంద్రాలున్నాయి.

  • గాల్వనైజింగ్‌ స్టీల్‌, ఎండీఎఫ్‌ బోర్డులను వీటి తయారీకి ఉపయోగిస్తున్నారు. గ్రిడ్‌ వేస్తూ బైసన్‌ బోర్డుతో మూడు లేయర్లుగా ఫ్లోర్‌ను తీర్చిదిద్దుతున్నారు. నచ్చినవారు టైల్స్‌ వేసుకోవచ్చు.
  • ఫ్లోర్‌ అంతా వాటర్‌ఫ్రూఫ్‌ మెటీరియల్‌ వేయడంతో నీటి వల్ల పాడైపోతుందనే సమస్య లేదు. అయితే నీరు నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తయారీదారులు సూచిస్తున్నారు.
  • టీవీ యూనిట్‌, ఏసీ ఏర్పాటుకు అవసరమైన వ్యవస్థ, స్విచ్‌బోర్డులు, ఎల్‌ఈడీ బల్బులు అన్నింటినీ తయారీదారులే ఇవ్వడంతో కొనుగోలు చేసేవారికి కొంత ఉపశమనం కలిగినట్టే.
  • విద్యుత్‌ వ్యవస్థ ఏర్పాటు కోసం పకడ్బందీగా పవర్‌ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. షార్ట్‌సర్క్యూట్‌కి అవకాశం లేకుండా పైపులను అమర్చుతూ అందులోంచి వైర్లను పవర్‌ యూనిట్‌కు అనుసంధానిస్తున్నారు. పైన 50 ఎంఎం ఇన్సులేషన్‌ చేయడంతో షార్ట్‌సర్క్యూట్‌కి అవకాశం ఉండదు.  
  • నీటి ట్యాంక్‌ కోసం ప్రత్యేకమైన స్టాండ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. 1000 నుంచి 1500 లీటర్ల సామర్థ్యంతో ట్యాంక్‌లను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇలా 200 చదరపు అడుగుల విస్తీర్ణంలో కంటైనర్‌ హోమ్‌లకు సుమారు రూ.2.5లక్షలు, వీటికి అదనంగా వాష్‌రూమ్‌, కిచెన్‌ అమర్చితే సుమారు రూ.3లక్షల వరకు ఖర్చవుతుందని చెబుతున్నారు. ఇంకా అదనపు హంగులు జోడిస్తే అనుగుణంగా ధరలున్నాయని చెబుతున్నారు. పై అంతస్తులు నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నామని మరికొంత మంది చెబుతున్నారు.

ఆహ్లాదం కోసం

రూ.లక్షల్లో వేతన ప్యాకేజీలున్న ప్రయివేటు ఉద్యోగులు సైతం వ్యవసాయ పొలాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. తక్కువ ఖర్చులో నాలుగైదు ఎకరాలున్న చోటును వెతికి పట్టుకొని అటు ఉద్యోగం ఇటు వ్యవసాయం రెండింటిలో సమతూకం పాటిస్తున్నారు. వారాంతాల్లో కుటుంబంతో కలిసి పచ్చని ప్రదేశాల్లో సేద తీరేందుకు ఇష్టపడుతున్నారు. ఇలా కుటుంబంతో కలిసి వచ్చి గడిపేందుకు ఈ కంటైనర్‌ హోమ్‌లను వినియోగిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రెండు పడక గదుల ఇళ్లు నిర్మించాలంటే రూ.5లక్షలు ఎటూ సరిపోవడం లేదు. అదే కంటైనర్‌ హోమ్‌ అంటే రూ.ఐదు లక్షలకు అటు ఇటుగా సకల సౌకర్యాలతో నిర్మించుకునే వీలుంది. పైగా ఆర్డర్‌ చేసిన కొద్ది రోజుల్లోనే నిర్మాణం పూర్తవుతుండటంతో డిమాండ్‌ పెరిగిందని రియల్‌ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్‌తో పాటు దిల్లీ, మహారాష్ట్ర, కర్నాటకల్లో వీటికి డిమాండ్‌ పెరిగిందని ఇటీవలే కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని