కొవిడ్‌ ప్రభావం.. అనుమతుల్లో జాప్యం

కొవిడ్‌ రెండో ఉద్ధృతి తగ్గుముఖం పట్టినా.. దాని ప్రభావం రియల్‌ ఎస్టేట్‌పై కొనసాగుతూనే ఉంది. ఏప్రిల్‌, మే నెలల్లో కార్యకలాపాలు పూర్తిగా స్తంభించాయి. జూన్‌లో లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించినా వ్యాపారం మందకొడిగా ఉందని.. మున్ముందు పుంజుకోవచ్చని రియల్‌ వ్యాపారులు అంచనా వేస్తున్నారు. కరోనా సమయంలో నిర్మాణ అనుమతులు సైతం తీవ్రంగా జాప్యం అయ్యాయని వాపోయారు. రెండో ఉద్ధృతి ప్రభావంపై క్రెడాయ్‌

Published : 12 Jun 2021 02:41 IST

కొవిడ్‌ రెండో ఉద్ధృతి తగ్గుముఖం పట్టినా.. దాని ప్రభావం రియల్‌ ఎస్టేట్‌పై కొనసాగుతూనే ఉంది. ఏప్రిల్‌, మే నెలల్లో కార్యకలాపాలు పూర్తిగా స్తంభించాయి. జూన్‌లో లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించినా వ్యాపారం మందకొడిగా ఉందని.. మున్ముందు పుంజుకోవచ్చని రియల్‌ వ్యాపారులు అంచనా వేస్తున్నారు. కరోనా సమయంలో నిర్మాణ అనుమతులు సైతం తీవ్రంగా జాప్యం అయ్యాయని వాపోయారు. రెండో ఉద్ధృతి ప్రభావంపై క్రెడాయ్‌ ఆధ్వర్యంలో ఈనెల మొదటివారంలో బిల్డర్ల నుంచి అభిప్రాయాలను సేకరించగా మొదటి వేవ్‌ కంటే రెండో వేవ్‌ ప్రభావం అధికంగా ఉందని హైదరాబాద్‌ బిల్డర్లలో 80 శాతం మంది అభిప్రాయపడ్డారు.

నిర్మాణ పనులు సకాలంలో పూర్తి కావాలంటే అనుమతులు వెంటవెంటనే వస్తే సాధ్యం అవుతుంది. ప్రభుత్వాలకు ఎన్నిసార్లు పరిశ్రమ వర్గాలు విజ్ఞప్తులు చేస్తున్నా  అనుమతుల జాప్యాన్ని నివారించలేక పోతుంది. స్థానిక సంస్థలు మొదలు రెరా, పర్యావరణ అనుమతుల వరకు ప్రతిచోట జాప్యం జరుగుతోందని వాపోతున్నారు.
* హైదరాబాద్‌లో సకాలంలో ప్రాజెక్టుకు అనుమతులు వచ్చాయని చెప్పిన బిల్డర్ల శాతం కేవలం 19గా ఉంది. టీఎస్‌ ఐపాస్‌, బీపాస్‌ వంటి సంస్కరణలు ప్రభుత్వం తీసుకొచ్చినా ఆచరణలోకి వచ్చేసరికి పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. కొవిడ్‌ సమయంలో తక్కువ సంఖ్యలో ఉద్యోగులు కార్యాలయాలకు హాజరు కావడం,  ఇంటి నుంచి పనితో అనుమతుల జారీ ప్రక్రియ ముందుకు సాగలేదు. సాధారణ రోజుల్లోనూ ఈ జాప్యం ఎక్కువే ఉంటోంది.
* మిగతా అన్నినగరాల్లోనూ ఇంచుమించు ఇదే పరిస్థితి ఉన్నా.. కోల్‌కతాలో సకాలంలో అనుమతులు వచ్చాయని చెప్పిన బిల్డర్లు 42 శాతం మంది ఉన్నారు. అక్కడి పరిస్థితులపై అధ్యయనం చేస్తే తదుపరి దశలో ఆలస్యాన్ని నివారించవొచ్చు.
50 శాతం మంది కూలీలతో పనులు..
దేశవ్యాప్తంగా వేర్వేరు మహానగరాల్లో చూస్తే దిల్లీలో వందకు వందశాతం కూలీల కొరత ఉందన్నారు. ముంబయి, పుణె, బెంగళూరులో 94 శాతం మంది బిల్డర్లు కూలీల కొరతపై స్పందిస్తే... చెన్నైలో ఇది 92 శాతంగా ఉంది. కోల్‌కతాలో 91 శాతం మంది ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తే.. హైదరాబాద్‌లో 83 శాతం మంది బిల్డర్లు కూలీల కొరత ఉన్నట్లు వెల్లడించారు.
* హైదరాబాద్‌లో 25 శాతం మంది కూలీలతో పనులు కొనసాగించినట్లు 15 శాతం మంది నిర్మాణదారులు చెబితే... 50 శాతం మందితో 51 శాతం బిల్డర్లు పనులు చేపట్టారు. 75 శాతం మంది పనికి వచ్చిన సైట్లు 29 శాతం వరకు ఉన్నాయి. 75 శాతంపైగా కూలీలతో కేవలం 5 శాతం మంది బిల్డర్లు మాత్రమే పనులు కొనసాగిస్తున్నారు.
నెమ్మదిగా..  సాగుతూ..
నిర్మాణ రంగానికి ఆంక్షల సడలింపులు ఉన్నా..  వేర్వేరు నగరాల్లో లాక్‌డౌన్‌ విధింపుతో సామగ్రి రవాణాలో జాప్యం జరిగి పనులు ఆలస్యం అవుతున్నాయని ఎక్కువ మంది బిల్డర్లు అభిప్రాయపడ్డారు.
* కొవిడ్‌ వచ్చినా హైదరాబాద్‌లో సకాలంలో ప్రాజెక్ట్‌ పనులు సాగుతున్నాయని 7 శాతం మంది బిల్డర్లు మాత్రమే చెప్పారు. దేశవ్యాప్తంగా కూడా ఇదే ఎక్కువశాతం. మిగతా మెట్రో నగరాల్లో సకాలం ప్రాజెక్టు పనులు నడుస్తున్నాయని చెప్పినవారు 2 నుంచి ఆరు శాతం లోపే ఉన్నారు. మిగతా 93 శాతం బిల్డర్ల ప్రాజెక్టులు ఆలస్యంగా నడుస్తున్నాయి.
నిర్మాణ వ్యయం పెరిగింది..
నిర్మాణ సామగ్రి ధరలు పెరగడంతో నిర్మాణ వ్యయం భారీగా పెరిగింది. ఒక్కో నగరంపై ఒక్కోలా వీటి ప్రభావం ఉంది.
* హైదరాబాద్‌లో ఐదు నుంచి పదిశాతం నిర్మాణ వ్యయం పెరిగిందని అని చెప్పిన బిల్డర్లు 14 శాతంగా ఉన్నారు. 10 నుంచి 20 శాతం వ్యయం పెరిగిందని చెప్పివారి శాతం అత్యధికంగా 50గా ఉంది. 20 శాతం పైన పెరిగిందని వెల్లడించిన వారు 35 శాతం మంది ఉన్నారు.

కొనుగోలుదారులు చెల్లించాల్సింది తక్కువే..

* కొవిడ్‌తో అమ్మకాలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. కానీ కొన్నవారు చెల్లింపులు వాయిదా వేసిన సంఖ్య హైదరాబాద్‌లో తక్కువే ఉంది. వారి నుంచి తమకు రావాల్సిన చెల్లింపులు ఆగిపోయాయని చెప్పిన బిల్డర్లు కేవలం 9 శాతం మందే ఉన్నారు. అన్ని నగరాల్లోనూ పదిశాతం బిల్డర్లకు మాత్రమే కొనుగోలుదారుల నుంచి వాయిదాలు రావాల్సి ఉంది.
* అయితే ఫైనాన్స్‌ పరంగా మాత్రం బిల్డర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రుణాలు పొందడంలో 54 శాతం మంది నిర్మాణదారులు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు.
* కొనుగోలుదారుల గృహరుణ మంజూరులో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు 70 శాతం మంది బిల్డర్లు చెప్పారు.

- ఈనాడు, హైదరాబాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని