చికెన్‌ ధమాకా..!

చికెన్‌ ముక్కలను సన్నగా పొడవాటి ముక్కలుగా కోయాలి. వాటిమీద అల్లంవెల్లుల్లి, ఉప్పు, పసుపు, కారం, దనియాలపొడి, జీలకర్రపొడి, కొద్దిగా నూనె వేసి ముక్కలకు పట్టించి ఫ్రిజ్‌లో ఉంచాలి.

Published : 26 Jun 2021 16:03 IST

స్పైసీ చికెన్‌ 65

కావలసినవి

చికెన్‌ బ్రెస్ట్‌ ముక్కలు: అరకిలో, అల్లంవెల్లుల్లి: 2 టీస్పూన్లు, కారం: 2 టీస్పూన్లు, దనియాలపొడి: 2 టీస్పూన్లు, జీలకర్రపొడి: 2 టీస్పూన్లు, కార్న్‌ఫ్లోర్‌: టేబుల్‌స్పూను, మైదా: 2 టేబుల్‌స్పూన్లు, గుడ్డు: ఒకటి, ఆవాలు: టీస్పూను, కచ్చాపచ్చాగా నూరిన మిరియాలు: టీస్పూను, ఎండుమిర్చి: రెండు, కరివేపాకు: ఐదారు రెబ్బలు, ఉప్పు: తగినంత, సోడా: అరలీటరు, నూనె: వేయించడానికి సరిపడా

తయారుచేసే విధానం
* చికెన్‌ ముక్కలను సన్నగా పొడవాటి ముక్కలుగా కోయాలి. వాటిమీద అల్లంవెల్లుల్లి, ఉప్పు, పసుపు, కారం, దనియాలపొడి, జీలకర్రపొడి, కొద్దిగా నూనె వేసి ముక్కలకు పట్టించి ఫ్రిజ్‌లో ఉంచాలి.

* విడిగా ఓ గిన్నెలో గుడ్డు, మైదా, కార్న్‌ఫ్లోర్‌ వేసి బాగా బీట్‌ చేయాలి. తరవాత అందులోనే సోడా నీళ్లు పోసి బాగా కలిపి ఫ్రిజ్‌లో సుమారు పావుగంటసేపు ఉంచాలి.
* చికెన్‌ ముక్కలు, సోడా నీళ్లు బయటకు తీసి ఒక్కో చికెన్‌ ముక్కనీ సోడా మిశ్రమంలో ముంచి తీసి ప్లేటులో పెట్టాలి. మొత్తం ఇలాగే చేశాక కాగిన నూనెలో వేసి తీయాలి.
* విడిగా పాన్‌లో కొద్దిగా నూనె వేసి ఆవాలు, మిరియాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి పోపు చేసి ఆ ముక్కలమీద చల్లి అందించాలి.

చికెన్‌ షామి కబాబ్‌

కావలసినవి

బోన్‌లెస్‌ చికెన్‌: అరకిలో, సెనగపప్పు: కప్పు, జీలకర్ర: టీస్పూను, లవంగాలు: ఏడు, మిరియాలు: టీస్పూను, దనియాలు: 2 టీస్పూన్లు, వాము: టీస్పూను, ఎండుమిర్చి: మూడు, అల్లంతురుము: టీస్పూను, పచ్చిమిర్చి: రెండు, వెల్లుల్లి: రెండు రెబ్బలు, కొత్తిమీర తురుము: అరకప్పు, పుదీనా ఆకులు: అరకప్పు, గుడ్లు: రెండు
తయారుచేసే విధానం

* సెనగపప్పుని అరగంటసేపు నానబెట్టాలి.
* కుక్కర్‌లో నూనె వేసి కాగాక జీలకర్ర, లవంగాలు, మిరియాలు, దాల్చినచెక్క, దనియాలు, వాము, ఎండుమిర్చి వేసి వేయించాలి. తరవాత నానబెట్టిన సెనగపప్పు వేసి కలపాలి. ఇప్పుడు చికెన్‌ ముక్కలు కూడా వేసి, సరిపడా నీళ్లు పోసి మూతపెట్టి చికెన్‌ మెత్తగా అయ్యేవరకూ ఉడికించాలి. చల్లారిన తరవాత ఈ మొత్తాన్ని మిక్సీలో వేసి మెత్తగా రుబ్బాలి. అందులోకి అల్లం, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి ముద్ద, కొత్తిమీర తురుము, పుదీనా తురుము వేసి కలపాలి. తరవాత గుడ్డుసొనలు కూడా వేసి కలిపి మిశ్రమాన్ని చిన్న ఉండల్లా చేసుకుని అరచేతుల్లోనే బిళ్లల్లా చేసి పెనంమీద నూనె వేస్తూ రెండువైపులా కాల్చి తీసి సాస్‌తో అందిస్తే సరి.

చికెన్‌ సుక్కా

కావలసినవి

చికెన్‌: కిలో, ఉల్లిపాయ: ఒకటి, యాలకులు: రెండు, ఉప్పు: టీస్పూను, నూనె: 2 టేబుల్‌స్పూన్లు, తాజా కొబ్బరితురుము: కప్పు, మసాలాకోసం: దనియాలు: 2 టేబుల్‌స్పూన్లు, జీలకర్ర: పావుటీస్పూను, ఆవాలు: పావుటీస్పూను, మిరియాలు: అరటీస్పూను,
లవంగాలు: నాలుగు, దాల్చినచెక్క: ఒకటి, పచ్చిమిర్చి: పది, కశ్మీరీ ఎండుమిర్చి: ఆరు, పసుపు: పావుటీస్పూను, ఉల్లిపాయ: ఒకటి, వెల్లుల్లిరెబ్బలు: ఐదు, అల్లంముక్క: చిన్నది, ఉప్పు: టీస్పూను

తయారుచేసే విధానం

* నాన్‌స్టిక్‌పాన్‌లో పచ్చిమిర్చి వేసి పక్కన ఉంచాలి.
* పాన్‌లో దనియాలు, జీలకర్ర, ఆవాలు, మిరియాలు, లవంగాలు, దాల్చినచెక్క, ఉల్లిపాయ ముక్కలు, అల్లంవెల్లుల్లి అన్నీ వేసి వేయించి తీసి చల్లారాక వీటికి ఉప్పు, పసుపు కూడా జోడించి మిక్సీలో వేసి రుబ్బాలి.
* బాణలిలో నూనె వేసి కాగాక ఉల్లిముక్కలు వేసి వేయించాలి. తరవాత చికెన్‌ ముక్కలు, ఉప్పు, యాలకులు వేసి సుమారు పది నిమిషాలు వేయించాలి. ఇప్పుడు మసాలాముద్ద, కొబ్బరితురుము వేసి సరిపడా నీళ్లు పోసి ఉడికించి ఉప్పు సరిచూసి దించాలి.

చికెన్‌ రోస్ట్‌

కావలసినవి
చికెన్‌: కిలో, పసుపు: అరటీస్పూను, కారం: అరటీస్పూను, దనియాలపొడి: అరటీస్పూను, లవంగాలు: ఐదు, పచ్చిమిర్చి: ఎనిమిది, నిమ్మరసం: టీస్పూను, ఉల్లిపాయలు: మూడు, టొమాటో: ఒకటి, కరివేపాకు: 3 రెబ్బలు,
గరంమసాలా: టీస్పూను, మిరియాలపొడి: 2 టీస్పూన్లు, ఉప్పు: రుచికి సరిపడా, నూనె: తగినంత

తయారుచేసే విధానం

* లవంగాలు, ఆరు పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా రుబ్బాలి. అందులోనే పసుపు, కారం, దనియాలపొడి, టీస్పూను నిమ్మరసం వేసి కలిపి చికెన్‌ ముక్కలకు పట్టించి ఓ గంటసేపు పక్కన ఉంచాలి.
* బాణలిలో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించి తీసి పక్కన ఉంచాలి. ఇప్పుడు నానబెట్టిన చికెన్‌ ముక్కలు వేసి మూతపెట్టి ఉడికించాలి.
* మరో పాన్‌లో 2 టేబుల్‌స్పూన్ల నూనె వేసి కాగాక  చీల్చిన పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరవాత టొమాటో ముద్ద వేసి వేగాక, చికెన్‌ ముక్కలు వేసి బాగా వేయించాలి.  గరం మసాలా, మిరియాల పొడి వేసి కలపాలి. ఉప్పు సరిచూసి నిమ్మరసం పిండి, వేయించి పక్కన ఉంచిన ఉల్లిముక్కలు వేసి ఓసారి కలిపి దించితే సరి.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని