నోరూరించే పరాఠా... చవులూరించే చికెన్‌!

పోషకాల ఆకుకూరలు... కారం, మసాలాలతో జతకూడి నోటికి రుచులు అందిస్తే... సెనగపిండితో స్నేహం చేసి బజ్జీల్లా నోరూరిస్తే.. అచ్చం ఈ ఆకుకూరల రుచుల్లా ఉంటాయి.పోషకాల ఆకుకూరలు... కారం, మసాలాలతో జతకూడి నోటికి రుచులు అందిస్తే... సెనగపిండితో స్నేహం చేసి బజ్జీల్లా నోరూరిస్తే.. అచ్చం ఈ ఆకుకూరల రుచుల్లా ఉంటాయి.

Published : 06 Jun 2021 00:23 IST

పోషకాల ఆకుకూరలు... కారం, మసాలాలతో జతకూడి నోటికి రుచులు అందిస్తే... సెనగపిండితో స్నేహం చేసి బజ్జీల్లా నోరూరిస్తే.. అచ్చం ఈ ఆకుకూరల రుచుల్లా ఉంటాయి.పోషకాల ఆకుకూరలు... కారం, మసాలాలతో జతకూడి నోటికి రుచులు అందిస్తే... సెనగపిండితో స్నేహం చేసి బజ్జీల్లా నోరూరిస్తే.. అచ్చం ఈ ఆకుకూరల రుచుల్లా ఉంటాయి.

పాలక్‌ పరాఠా

కావాల్సినవి: పాలకూర తురుము- కప్పు, పచ్చిమిర్చి- రెండు, అల్లం తురుము- చెంచా, వెల్లుల్లి- నాలుగైదు రెబ్బలు, సెనగపిండి- రెండు పెద్ద చెంచాలు, గోధుమపిండి- రెండు కప్పులు, సోంపు- అర చెంచా, జీలకర్ర- అరచెంచా, నూనె- మూడు పెద్దచెంచాలు, వెన్న- అర కప్పు, ఉప్పు- తగినంత.
తయారీ: పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి కొన్ని నీళ్లు పోసి వేడిచేయాలి. ఈ నీటిలో పాలకూర ఆకులు వేసి రెండు నిమిషాలపాటు మరిగించాలి. ఇప్పుడు ఆకులను నీటి నుంచి వేరే గిన్నెలోకి మార్చుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి. వీటితోపాటు పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, అల్లం తురుము, కాసిన్ని నీళ్లు పోసి మెత్తగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెద్ద గిన్నెలోకి మార్చుకోవాలి. ఇందులో ఉప్పు, సోంపు, జీలకర్ర, సెనగపిండి వేసి ఉండలు లేకుండా కలపాలి. దీంట్లోనే కొద్దికొద్దిగా గోధుమ పిండి వేస్తూ చపాతీ పిండిలా కలపాలి. చివరగా కొద్దిగా నూనె జత చేసి చక్కగా కలపాలి. దీనిపై తడి వస్త్రాన్ని ఓ పది నిమిషాలపాటు కప్పి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పిండిని చిన్న ఉండల్లా చేసుకుని చపాతీల్లా కాస్త మందంగా చేసుకోవాలి. పొయ్యి వెలిగించి పాన్‌ పెట్టి అది వేడయ్యాక వెన్న వేయాలి. ఇందాక తయారుచేసి పెట్టుకున్న పాలక్‌ చపాతీ వేసి రెండు వైపులా చక్కగా కాల్చుకోవాలి. అంతే రుచికరమైన పాలక్‌ పరాఠా రెడీ. దీన్ని టొమాటో కెచప్‌, రైతాతో తింటే చాలా బాగుంటుంది.


తోటకూర మసాలా


కావాల్సినవి: తోటకూర- రెండు కప్పులు, తరిగిన టొమాటో- ఒకటి, తరిగిన ఉల్లిపాయ- ఒకటి, తరిగిన పచ్చిమిర్చి- రెండు, అల్లంవెల్లుల్లి ముద్ద- చెంచా, ఉప్పు- తగినంత, కారం- చెంచా, పసుపు- చిటికెడు, జీలకర్ర, ఆవాలు, ధనియాల పొడి- చెంచా చొప్పున, కరివేపాకు- రెండు రెమ్మలు, గరంమసాలా- చెంచా, నూనె- మూడు పెద్ద చెంచాలు.
తయారీ: పొయ్యి వెలిగించి పాన్‌ పెట్టి నూనె వేయాలి. అది వేడయ్యాక  జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు,  కరివేపాకు వేసి వేయించాలి. ఇందులోనే పసుపు, అల్లంవెల్లుల్లి ముద్ద, టొమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత తోటకూర వేసి ఉడకనివ్వాలి.  కూర కాస్త ఉడికిన తర్వాత ఉప్పు, కారం, ధనియాల పొడి, గరంమసాలా వేసి కలపాలి. కొన్ని నీళ్లు పోసి మరికాసేపు ఉడికించాలి. అంతే తోటకూర మసాలా కర్రీ సిద్ధమైనట్లే.  


గంగవెల్లి మామిడికాయ పప్పు

కావాల్సినవి: కందిపప్పు- కప్పు, గంగవెల్లి కూర తురుము- కప్పు, మామిడికాయ తురుము- అరకప్పు, పచ్చిమిర్చి ముక్కలు- అర కప్పు, పసుపు- పావు చెంచా, ఎండుమిర్చి- మూడు, వెల్లుల్లి రెబ్బలు- అయిదు,  నూనె, ఉప్పు- తగినంత, ఇంగువ- చిటికెడు, పోపుదినుసులు- చెంచా, కరివేపాకు- రెండు రెమ్మలు, కొత్తిమీర తురుము- చెంచా, ధనియాల పొడి- చెంచా, నీళ్లు- తగినన్ని.  
తయారీ: మొదట కుక్కర్‌లో పప్పు, తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, పసుపు వేసి ఉడికించాలి. మరోసారి పొయ్యి వెలిగించి పాన్‌ పెట్టి నూనె పోసి అది వేడయ్యాక పోపుదినుసులు, పచ్చిమిర్చిముక్కలు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీంట్లో తరిగిన గంగవెల్లి కూర వేసి వేగనివ్వాలి. ఇందులోనే సన్నగా తరిగిన మామిడికాయ తురుము వేసి మగ్గించాలి. ఇది కాస్త ఉడికిన తర్వాత ఇందాక తయారుచేసి పెట్టుకున్న పప్పు, ధనియాల పొడి వేసి, కొన్ని నీళ్లు పోసి మరికాసేపు ఉడికించాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్‌ చేసుకోవాలి.


బచ్చలికూర బజ్జీలు

కావాల్సినవి: బచ్చలి ఆకులు- పది, సెనగపిండి- కప్పు, బియ్యప్పిండి- రెండు చెంచాలు, ధనియాల పొడి- అర చెంచా, అల్లంవెల్లుల్లి ముద్ద- చెంచా, ఉప్పు-తగినంత, పసుపు- పావు చెంచా, నూనె- వేయించడానికి సరిపడా, వాము- రెండు చిటికెలు, జీలకర్ర- పావు చెంచా.
తయారీ: గిన్నెలో సెనగపిండి, బియ్యప్పిండి, ఉప్పు, కారం, ధనియాల పొడి, అల్లంవెల్లుల్లి ముద్ద, పసుపు, వాము వేసి, తగినన్ని నీళ్లు పోసి బజ్జీల పిండిలా కలిపి పక్కన పెట్టుకోవాలి.
పొయ్యి వెలిగించి కడాయి పెట్టి నూనె పోసి అది వేడయ్యాక బచ్చలి ఆకులను సెనగపిండి మిశ్రమంలో ముంచి బజ్జీల్లా వేసుకోవాలి. బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి. 


చింత చిగురు చికెన్‌

కావాల్సినవి: చింతచిగురు- కప్పు, చికెన్‌- అరకిలో, ఉల్లిపాయలు- మూడు(సన్నగా తరగాలి), పసుపు- పావు చెంచా, కారం- రెండు చెంచాలు, అల్లంవెల్లుల్లి పేస్ట్‌- చెంచా, ఉప్పు- రుచికి సరిపడా, నూనె- తగినంత, ధనియాల పొడి- చెంచా, కొత్తిమీర తరుగు- అర కప్పు, గరంమసాలా- చెంచా, ఎండుమిర్చి- మూడు.
తయారీ: పొయ్యి వెలిగించి పాన్‌ పెట్టి నూనె పోయాలి అందులో ఉల్లిపాయ ముక్కలను వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. వీటిలో మూడునాలుగు ఎండు మిర్చి వేసి, కాసింత ఉప్పు కలిపి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి.
మరో పాన్‌ పొయ్యి మీద పెట్టి నూనె వేయాలి. అది వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, అల్లంవెల్లుల్లి ముద్ద, పసుపు, కారం, ధనియాల పొడి, గరంమసాలా.. ఇలా అన్ని వేసి వేయించాలి. ఇప్పుడు చికెన్‌ ముక్కలు వేసి అయిదు నిమిషాలపాటు మూత పెట్టి మగ్గించాలి. మూత తీసి ఇందాక తయారుచేసి పెట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమం, అర కప్పు కొత్తిమీర తరుగు, చింతచిగురు వేసి రెండు మూడు నిమిషాలపాటు మగ్గించాలి. (చాలా లేతగా ఉన్న చింతచిగురును ఎంచుకోవాలి.)చివరగా కాసిన్ని నీళ్లు పోసి ముక్కలు సరిపడా ఉప్పు వేసి పది నిమిషాటు లేదా ముక్కలు మెత్తగా ఉడికే వరకు, కూర గ్రేవీ చిక్కగా అయ్యేవరకు చిన్న మంటపై ఉడికించాలి.

ప్రయోజనాలు
*ఇవి శరీరానికి చాలా మేలు చేస్తాయి.
*ఇఆకుకూరల్లో పిండిపదార్థాలు చాలా తక్కువ మొత్తంలో ఉంటాయి. వీటి నుంచి లభించే కెలొరీలూ అత్యల్పమే. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు వీటిని రోజూ తీసుకోవచ్చు.  
*ఇఇవి రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రణలో ఉంచుతాయి.  
*ఇఆకుకూరల్లోని ఆల్ఫాలెనోలిక్‌ యాసిడ్‌ చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించి మంచి కొలెస్ట్రాల్‌ వృద్ధికి తోడ్పడుతుంది.
*ఇఈ కూరలు తింటే కంటికి చాలామంచిది. కారణం వీటిలో విటమిన్‌-ఎ సమృద్ధిగా ఉండటమే.
* రక్తం తయారీకి కావాల్సిన ఇనుము ఆకుకూరల నుంచే లభిస్తుంది. తోటకూర తీసుకుంటే రక్తవృద్ధి త్వరగా జరుగుతుంది.
* ఆకుకూరల్లో క్యాల్షియం కూడా ఎక్కువే. పాలతో పోలిస్తే వీటిలో మూడునాలుగు రెట్ల ఎక్కువగా క్యాల్షియం ఉంటుంది. తోటకూర, మునగాకు, పొనగంటికూర... వీటిలో ఈ మూలకం మెండుగా ఉంటుంది.
* ఆకుకూరల నుంచి సహజమైన పద్ధతిలో సోడియం లభిస్తుంది.
* వీటిలో యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని