పండ్లను వండేద్దాం!

పండ్లు ఆరోగ్యానికి ఎంత మంచివో మనందరికీ తెలిసిందే. ఆయా సీజన్లలో దొరికే తాజా పండ్లను అలాగే తింటాం. లేదా సలాడ్‌, కస్టర్డ్‌ రూపంలో ఆరగిస్తాం. ఆ సంగతలా ఉంచితే.. కాయగూరలతో చేసినట్లు పండ్లతోనూ కూరలు చేయొచ్చు.

Published : 10 Dec 2023 00:18 IST

పండ్లు ఆరోగ్యానికి ఎంత మంచివో మనందరికీ తెలిసిందే. ఆయా సీజన్లలో దొరికే తాజా పండ్లను అలాగే తింటాం. లేదా సలాడ్‌, కస్టర్డ్‌ రూపంలో ఆరగిస్తాం. ఆ సంగతలా ఉంచితే.. కాయగూరలతో చేసినట్లు పండ్లతోనూ కూరలు చేయొచ్చు. ఎప్పుడూ సొర, బీర, దోస.. లాంటివేనా అనిపిస్తే.. ఈ వెరైటీ వంటలు చేసి చూడండి..


గ్రీన్‌ యాపిల్‌ కర్రీ

కావలసినవి: గ్రీన్‌ యాపిల్స్‌ - 4, ఉల్లి తరుగు - అర కప్పు, నూనె - టేబుల్‌ స్పూన్‌, ఆవాలు, జీలకర్ర - అర చెంచా చొప్పున, కరివేపాకు - 2 రెబ్బలు, వెల్లుల్లి తరుగు - రెండు చెంచాలు, పచ్చిమిర్చి - 3, జీడిపప్పు పలుకులు - పావు కప్పు, ఉప్పు - తగినంత, కారం - చెంచా, కొబ్బరి పాలు - కప్పు, బ్రౌన్‌ షుగర్‌ - చెంచా, కొత్తిమీర తరుగు - చారెడు

తయారీ: కడాయిలో నూనె కాగనిచ్చి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి తరుగు, పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. అవి కాస్త వేగాక.. జీడిపప్పు పలుకులు, ఉల్లి తరుగు వేసి వేయించాలి. రెండు నిమిషాల తర్వాత కారం, ఉప్పు, గ్రీన్‌ యాపిల్‌ ముక్కలు వేయాలి. బాగా కలియ తిప్పి కొన్ని నీళ్లు పోసి ముక్కలను మెత్తబడనివ్వాలి. అందులో  కొబ్బరి పాలు, బ్రౌన్‌ షుగర్‌ వేసి ఇంకో రెండు నిమిషాలు ఉడికించి, కొత్తిమీర తరుగు వేసి దించేయాలి. ఇది అన్నం, చపాతీలు.. ఎందులోకైనా సూపర్‌గా ఉంటుంది.


మిక్స్‌డ్‌ ఫ్రూట్‌ కుర్మా

కావలసినవి: ఈ కాలంలో దొరికే యాపిల్‌ తదితర పండ్ల ముక్కలు - రెండు కప్పులు, టొమాటో గుజ్జు - కప్పు, జీడిపప్పు - పావు కప్పు, గుమ్మడి గింజలు - 2 చెంచాలు, కొబ్బరి తురుము - 2 టేబుల్‌ స్పూన్లు, దానిమ్మ గింజలు - చెంచా, జీలకర్ర - చెంచా, దాల్చిన చెక్క - అంగుళం ముక్క, యాలకులు - 4, బిర్యానీ ఆకులు - 2, అల్లం ముద్ద - చెంచా, పసుపు - పావు చెంచా, కారం - 2 చెంచాలు, నూనె, ఉప్పు - తగినంత, మెంతి ఆకుల పొడి, మిరియాల పొడి, గరం మసాలా - చెంచా చొప్పున, ధనియాల పొడి - 2 చెంచాలు, పుదీనా పొడి - 2 చెంచాలు, పెరుగు - అర కప్పు, నెయ్యి - 2 టేబుల్‌ స్పూన్లు, కుంకుమ పువ్వు - చిటికెడు

తయారీ: జీడిపప్పు, గుమ్మడి గింజలను అర గంట వేడినీళ్లలో నానబెట్టి గ్రైండ్‌ చేయాలి. కడాయిలో నూనె కాగిన తర్వాత జీలకర్ర, దాల్చిన చెక్క, యాలకులు, బిర్యానీ ఆకులు, అల్లం ముద్ద, టొమాటో గుజ్జు, జీడిపప్పు పేస్టు, కారం, ఉప్పు, పసుపు, మిరియాల పొడి, ధనియాల పొడి, పుదీనా పొడి వేసి కలియ తిప్పాలి. సన్న సెగ మీద ఐదు నిమిషాలుంచి.. పెరుగు, మెంతి ఆకుల పొడి, గరం మసాలా వేయాలి. అడుగు భాగం మందంగా ఉన్న పాత్రలో నెయ్యి వేసి డ్రైఫ్రూట్స్‌ పలుకులు, మఖానా, కిస్‌మిస్‌, పైనాపిల్‌, యాపిల్‌ ముక్కలు వేసి వేయించాలి. గ్రేవీ ఉన్న కడాయిలో ఈ వేయించిన పండ్ల మిశ్రమం వేసి కలియ తిప్పి మూత పెట్టాలి. నాలుగు నిమిషాల్లో కుర్మా ఉడికిపోతుంది. అందులో కొబ్బరి తురుము, దానిమ్మ గింజలు, కుంకుమ పువ్వు, కొత్తిమీర తరుగు వేసి, నిమిషం తర్వాత దించేయాలి. ఈ మిక్స్‌డ్‌ ఫ్రూట్‌ కుర్మా హోటల్‌ స్టైల్లో చాలా బాగుంటుంది.


స్పైసీ కివీ కర్రీ

కావలసినవి: కివీ పండ్లు - 4, క్యాప్సికం, టొమాటో ముక్కలు, ఉల్లి తరుగు - పావు కప్పు చొప్పున, పచ్చిమిర్చి - 5, కొబ్బరి పాలు - కప్పు, నూనె - 2 టేబుల్‌ స్పూన్లు, గరం మసాలా - చెంచా, మిరియాల పొడి - చెంచా, జీలకర్ర - అర చెంచా, యాలకులు - 3, దాల్చిన చెక్క - అంగుళం ముక్క, లవంగాలు - 4, జీడిపప్పుల పొడి - 2 చెంచాలు, బియ్యప్పిండి - చెంచా, కరివేపాకు - రెండు రెెబ్బలు, కారం, పసుపు, ఉప్పు - తగినంత, అల్లం- వెల్లుల్లి పేస్టు - చెంచా, కొత్తిమీర తరుగు - చారెడు

తయారీ: కివీ పండ్లను కడిగి ముక్కలు కోసుకోవాలి. కడాయిలో నూనె కాగిన తర్వాత జీలకర్ర, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు వేయాలి. అవి కాస్త వేగాక.. ఉల్లి తరుగు, అది వేగాక, టొమాటో, క్యాప్సికం, మిర్చి ముక్కలు, అల్లం- వెల్లుల్లి పేస్టు జతచేయాలి. నాలుగు నిమిషాల తర్వాత కొన్ని నీళ్లు, పసుపు, ఉప్పు,  గరం మసాలా, కారం, మిరియాల పొడి, జీడిపప్పుల పొడి, బియ్యప్పిండి వేసి కలియ తిప్పాలి. అందులో కొబ్బరి పాలు, కివీ ముక్కలు వేసి.. దగ్గరపడిన తర్వాత దించి, కొత్తిమీర తరుగు వేయాలి. అంతే.. రంగూ, రుచీ అద్భుతంగా ఉండే స్పైసీ కివీ కర్రీ రెడీ. ఇది అన్నం, రోటీ.. ఎందులోకైనా బాగుంటుంది.


జామకాయ కూర

కావలసినవి: దోర జామకాయలు - 4, నూనె - 2 టేబుల్‌ స్పూన్లు, ఉల్లి తరుగు - కప్పు, పచ్చిమిర్చి - 4, టొమాటో గుజ్జు - కప్పున్నర, నువ్వుల పొడి - ముప్పావు కప్పు, గరం మసాలా - చెంచా, అల్లం వెల్లుల్లి పేస్టు - చెంచా, కొత్తిమీర తరుగు - చారెడు, పసుపు - పావు చెంచా, కారం - చెంచా, ఉప్పు - తగినంత, కరివేపాకు - రెండు రెబ్బలు, తాలింపు దినుసులు

తయారీ: జామకాయలు కోసి మధ్యలో విత్తనాలున్న భాగాన్ని తీసేసి ముక్కలుగా కోసుకోవాలి. కడాయిలో నూనె కాగనిచ్చి తాలింపు దినుసులు వేయాలి. ఆవాలు చిటపటలాడాక.. కరివేపాకు, ఉల్లి తరుగు, పచ్చిమర్చి  ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు వేయాలి. అవి దోరగా వేగాక..     టొమాటో గుజ్జు, కారం, పసుపు, ఉప్పు వేయాలి. అది కూడా వేగిన తర్వాత.. నువ్వుల పొడి, గరం మసాలా వేసి కలియ తిప్పి.. కొన్ని నీళ్లు పోసి మగ్గనివ్వాలి. దగ్గరగా అయ్యాక.. కొత్తిమీర తరుగు వేసి దించేయాలి. అంతే.. నోరూరించే జామకాయ కూర సిద్ధం. తిని ఆనందించడమే తరువాయి.


సీమచింత పప్పు కూర

కావలసినవి: సీమచింత (గుబ్బ) కాయలు - పావు కిలో, ఉల్లి తరుగు - కప్పు, పచ్చిమిర్చి - మూడు, టొమాటో గుజ్జు - కప్పు, నూనె - నాలుగు చెంచాలు, ధనియాలు, గసగసాలు, నువ్వులు - రెండు చెంచాలు చొప్పున, జీలకర్ర - చెంచా, జీడిపప్పు - అర కప్పు, లవంగాలు - ఆరు, దాల్చిన చెక్క పొడి, యాలకుల పొడి - పావు చెంచా చొప్పున,  కొబ్బరి కోరు - అర కప్పు, బిర్యానీ ఆకులు - రెండు, షాజీరా - చెంచా, పసుపు - పావు చెంచా, ఉప్పు - తగినంత, అల్లం, వెల్లుల్లి ముద్ద - రెండు చెంచాలు, కారం - చెంచా, కొత్తిమీర తరుగు

తయారీ: ముందుగా సీమచింత కాయలను కడిగి, గింజలు తీసేసి, పప్పులను పక్కనుంచుకోవాలి. కడాయిలో ధనియాలను కాస్త వేగనిచ్చి.. జీలకర్ర, గసగసాలు, నువ్వులు వేసి వేయించాలి. వీటికి జీడిపప్పు జతచేసి గ్రైండ్‌ చేయాలి. కడాయిలో నూనె కాగనిచ్చి.. దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు, లవంగాలు, షాజీరా, ఉల్లి తరుగు, పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. అవి దోరగా వేగిన తర్వాత టొమాటో గుజ్జు, పసుపు, ఉప్పు, రెండు చెంచాల అల్లం, వెల్లుల్లి ముద్ద వేసి మగ్గనివ్వాలి. అందులో సీమచింత పప్పులు, ధనియాలు, జీడిపప్పుల పొడి, కారం, ఉప్పు, యాలకుల పొడి వేసి కలియ తిప్పి, సన్న సెగ మీద ఐదు నిమిషాలు ఉడకనిచ్చి.. కొబ్బరి కోరు, కొత్తిమీర చల్లి దించేయాలి. అంతే ఘుమఘుమలాడే సీమచింత పప్పు కూర రెడీ.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని