ప్రేమతో మీ బొంబాయి రవ్వ!

ఉప్మా అనగానే చిన్నా పెద్దా అంతా ముఖం అదోలా పెడతారు.. రవ్వతో కేవలం ఉప్మా,  కేసరి మాత్రమే కాదు.. రుచికరమైన మరెన్నో వంటకాలు చేసుకోవచ్చు. పెసరపప్పు-రవ్వ పొంగలి, కారంకారం

Updated : 20 Mar 2022 03:55 IST

ఉప్మా అనగానే చిన్నా పెద్దా అంతా ముఖం అదోలా పెడతారు.. రవ్వతో కేవలం ఉప్మా,  కేసరి మాత్రమే కాదు.. రుచికరమైన మరెన్నో వంటకాలు చేసుకోవచ్చు. పెసరపప్పు-రవ్వ పొంగలి, కారంకారం సూజీబాల్స్‌; కారం, తీపి రుచుల చౌ చౌ బాత్‌, నోరూరించే కేకు, మృదువైన ఇడ్లీలు... ఇలా ఎన్నో రకాలు ప్రయత్నించొచ్చు. ఇవి తింటే బొంబాయి రవ్వతో మీరూ ప్రేమలో పడతారు!

సూజీ బాల్స్‌...

కావాల్సినవి: బాల్స్‌ కోసం... రవ్వ (సూజీ)- కప్పు, నూనె- మూడు చెంచాలు, పచ్చిమిరపకాయ, అల్లం- ఒకటి చొప్పున (సన్నగా), నీళ్లు-రెండున్నర కప్పులు, ఉప్పు- తగినంత, పచ్చికొబ్బరి తురుము-పావు కప్పు.

పోపులోకి... నూనె- మూడు చెంచాలు, ఆవాలు- చెంచా, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు- అర చెంచా చొప్పున, జీడిపప్పు- అయిదారు, కరివేపాకు- రెండు రెబ్బలు, ఎండుమిరపకాయ- ఒకటి, పసుపు, కారం- పావు చెంచా చొప్పున, ఉప్పు- తగినంత, కొత్తిమీర తురుము- రెండు పెద్ద చెంచాలు, నిమ్మరసం- రెండు చెంచాలు.

తయారీ: పొయ్యి మీద పాన్‌ పెట్టి రవ్వ వేసి లేత గోధుమ రంగు వచ్చేవరకు చిన్నమంటపై వేయించాలి. ఆ తర్వాత దించేయాలి. మరో కడాయిలో మూడు చెంచాల నూనె వేసి వేడయ్యాక పచ్చిమిరపకాయ, అల్లం తరుగు వేసి వేయించాలి. దీంట్లో రెండున్నర కప్పుల నీళ్లు పోయాలి. ఉప్పు, కొబ్బరి తరుగు వేసి బాగా కలిపి నీళ్లను మరిగించాలి. మంటను చిన్నగా చేసి రవ్వను నెమ్మదిగా పోస్తూ కలుపుతూనే ఉండాలి. ఆ తర్వాత మూత పెట్టి మూడు నిమిషాలు లేదా రవ్వ పూర్తిగా మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. ఇప్పుడీ మిశ్రమాన్ని చల్లార్చి చపాతీ పిండిలా కలిపి అయిదు నిమిషాలాగి చిన్న లడ్డూల్లా చేసుకోవాలి. వీటిని పది నిమిషాలు ఆవిరి మీద ఉడికించాలి. కడాయిలో నూనె పోసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, జీడిపప్పు, కరివేపాకు, ఎండు మిరపకాయలను ఒకదాని తర్వాత మరొకటి వేసి వేయించాలి. పసుపు, కారం, ఉప్పును జత చేయాలి. ఇప్పుడు ఉండలను వేసి బాగా కలపాలి. దీంట్లో కొత్తిమీర తురుము, నిమ్మరసం వేసి చక్కగా కలపాలి. కారం రవ్వ లడ్డూలు సిద్ధమైనట్లే. వీటిని స్పైసీ చట్నీతో తింటే భలే బాగుంటాయి.


రవ్వ పొంగలి...

కావాల్సినవి: పెసరపప్పు- పావు కప్పు, రవ్వ- కప్పు, నెయ్యి- మూడు పెద్ద చెంచాలు, జీడిపప్పు- అయిదారు, కరివేపాకు-  రెండు రెబ్బలు, అల్లం తరుగు, జీలకర్ర, మిరియాలు- చెంచా చొప్పున, పచ్చిమిరపకాయలు- రెండు (ముక్కలుగా కోసుకోవాలి), ఉప్పు- సరిపడా.

తయారీ: పెద్ద గిన్నెలో ఎక్కువగా నీళ్లు పోసి మరిగించాలి. మరో పొయ్యి మీద కడాయి పెట్టి నెయ్యి వేసి వేడయ్యాక పెసర పప్పు వేసి దోరగా వేయించాలి. సువాసన వచ్చేవరకు ఫ్రై చేసి పొయ్యి కట్టేయాలి. ఇప్పుడీ పప్పును మరుగుతున్న నీళ్లలో వేసి దాదాపు అరవై శాతం ఉడికించాలి. ఇందాక పప్పును వేయించిన పాన్‌లోనే నెయ్యి వేసుకుని వేడయ్యాక జీలకర్ర, మిరియాలు, అల్లం తరుగు వేసి ఫ్రై చేయాలి. వీటితోపాటు జీడిపప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసి మరికాసేపు ఫ్రై చేయాలి. ఇష్టమైతే ఇంగువ వేసుకోవచ్చు. ఇప్పుడు రవ్వను చేర్చి మరికాసేపు వేయించాలి. ఉడుకుతున్న పప్పులో ఉప్పు వేసి కలపాలి. కావాలనుకుంటే కొన్ని నీళ్లు పోయొచ్చు. ఇందులోనే రవ్వ మిశ్రమాన్ని వేస్తూ మెల్లిగా కలపాలి. ఆపై మూత పెట్టి చిన్న మంటపై మూడు నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత  ప్లేట్‌లోకి తీసుకుని వడ్డించడమే తరువాయి. కొబ్బరి, అల్లం చట్నీతో తింటే చాలా బాగుంటుంది.


కేక్‌...

కావాల్సినవి: రవ్వ- రెండు కప్పులు, నూనె, పెరుగు- అర కప్పు చొప్పున,  చక్కెర, పాలు- కప్పు చొప్పున, ఉప్పు- తగినంత, బేకింగ్‌ పౌడర్‌- ముప్పావు చెంచా, వంటసోడా- పావు చెంచా, టూటీఫ్రూటీలు- పావు కప్పు, బేకింగ్‌ పేపర్‌- ఒకటి, దాల్చిన చెక్క పొడి- అర చెంచా.

తయారీ: రవ్వను మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. గిన్నెలో నూనె, పెరుగు, చక్కెర వేసి బాగా గిలక్కొట్టాలి. దీంట్లో పాలు పోసి మరోసారి బాగా కలపాలి. ఇందులో రవ్వ పొడిని వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి. తగినంత ఉప్పు వేసి చక్కగా కలిపి ఓ వస్త్రంతో పది నిమిషాలు కప్పేయాలి. ఆ తర్వాత మందమైన అడుగు ఉండే (సాసింగ్‌ పాన్‌) పాత్రను తీసుకుని దాని లోపలంతా నూనె రాసి అడుగున బేకింగ్‌ పేపర్‌ వేయాలి. ఇప్పుడు కేకు బ్యాటర్‌లో వంటసోడా, బేకింగ్‌ పౌడర్‌, దాల్చిన చెక్క పొడి, పాలు పోసి బాగా కలపాలి. కొన్ని టూటీఫ్రూటీలను జత చేయాలి. వీటన్నింటిని మరోసారి బాగా కలపాలి. ఈ కేకు మిశ్రమాన్ని సాస్‌ పాన్‌లో పోయాలి. అలంకరణ కోసం పై నుంచి మరిన్ని టూటీ ఫ్రూటీలను చల్లాలి. ఈ గిన్నెను పొయ్యి మీద పెట్టి మూత అంచులను పిండితో మూసేయాలి. గంట చిన్నమంటపై ఉడికించాలి. చల్లారిన తర్వాత వేరే ట్రేలోకి తీసుకుని బ్లోరా వేసి బేకింగ్‌ పేపర్‌ తీసేయాలి. కావాల్సిన ఆకారంలో కోసుకుంటే సరి.


చౌ చౌ బాత్‌...

ఖారా బాత్‌...

కావాల్సినవి: రవ్వ- అర కప్పు, నెయ్యి- రెండు పెద్ద చెంచాలు, మినప్పప్పు, ఆవాలు, శనగపప్పు- చెంచా చొప్పున, జీడిపప్పు- పది, కరివేపాకు- గుప్పెడు, ఉల్లిపాయ- సగం ముక్క (సన్నగా), అల్లం ముక్క- అంగుళమంత (తరగాలి), పచ్చిమిరపకాయ- ఒకటి (నిలువుగా కోయాలి), టమాటా- ఒకటి (ముక్కలుగా), బీన్స్‌, క్యారెట్‌, క్యాప్సికమ్‌ - ఒక్కోటి చొప్పున (చిన్న ముక్కలుగా), బఠాణీలు- రెండు పెద్ద చెంచాలు, పసుపు- పావు చెంచా, వంగీబాత్‌ మసాలా పొడి- చెంచా, ఉప్పు- తగినంత, నీళ్లు- కప్పున్నర, కొబ్బరి, కొత్తిమీర తురుము- రెండు పెద్ద చెంచాల చొప్పున, నిమ్మరసం- చెంచా.

తయారీ: పొయ్యి మీద పాన్‌ పెట్టి రవ్వ వేసి మంచి వాసన వచ్చేవరకు చిన్నమంటపై వేయించాలి. ఆ తర్వాత వేరే గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద పెద్ద కడాయి పెట్టి నెయ్యి వేసి వేడయ్యాక ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, జీడిపప్పు, కరివేపాకు వేసి వేయించాలి. దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, అల్లం తరుగు, నిలువుగా చీల్చిన పచ్చిమిరపకాయ వేసి బాగా కలపాలి. ఇందులో టమాటా ముక్కలు వేసి మెత్తగా అయ్యేవరకు కలుపుతూనే ఉండాలి. వీటికి జతగా క్యాప్సికమ్‌, క్యారెట్‌, బీన్స్‌ ముక్కలు, బఠాణీలను జోడించాలి. అలాగే సరిపడా ఉప్పు వేసి కాసేపు మగ్గించాలి. దీంట్లో పసుపు, వంగీబాత్‌ మసాలా పొడి/రసం పొడి వేసి మసాలా ముక్కలకు పట్టేలా కలపాలి. ఇప్పుడు కప్పున్నర నీళ్లు పోసి మరోసారి కలిపి మూత పెట్టాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు మంట చిన్నగా చేసి, రవ్వ వేసి ఉండలు లేకుండా కలపాలి. రవ్వ నీళ్లను పూర్తిగా పీల్చుకునే వరకు కలుపుతూనే ఉండాలి. అయిదు నిమిషాలు లేదా ఉప్మా బాగా ఉడికే వరకు మూత పెట్టి ఉడికించాలి. పొయ్యి కట్టేసి కొబ్బరి, కొత్తిమీర తురుము, నిమ్మరసం జత చేసి బాగా కలపాలి. చివరగా కొబ్బరి చట్నీ, రవ్వ కేసరితో ఈ ఖారా బాత్‌ను ఆరగించేయండి మరి.

షీరా...

కావాల్సినవి: రవ్వ, చక్కెర- అర కప్పు చొప్పున, నెయ్యి- రెండు పెద్ద చెంచాలు, జీడిపప్పు- ఏడు, కిస్‌మిస్‌- రెండు పెద్ద చెంచాలు, యాలకుల పొడి- అర చెంచా,  నెయ్యి- పావు కప్పు, ఎల్లో ఫుడ్‌ కలర్‌- రెండు మూడు చుక్కలు, యాలకుల పొడి- అర చెంచా, నీళ్లు- కప్పున్నర.
తయారీ: పాన్‌లో నెయ్యి వేసి వేడయ్యాక జీడిపప్పు, కిస్‌మిస్‌ వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్‌లో రవ్వ వేసి చిన్న మంటపై దోరగా, మంచి వాసన వచ్చేవరకు వేయించాలి. మరో పాన్‌లో కప్పున్నర నీళ్లు పోసి మరిగించాలి. ఈ నీళ్లలో రవ్వ వేసి ఉండలు లేకుండా కాసేపు బాగా కలపాలి. ఇప్పుడు చక్కెర వేసి మరికాసేపు కలియబెట్టాలి. దీంట్లోనే పావు కప్పు, నెయ్యి, రెండు మూడు చుక్కల ఎల్లో ఫుడ్‌ కలర్‌ వేసి బాగా కలిపి మూతపెట్టి అయిదు నిమిషాలు మగ్గించాలి. ఆ తర్వాత వేయించిన డ్రైఫ్రూట్స్‌ పలుకులు, యాలకుల పొడి వేసి కలపాలి.


ఇన్‌స్టంట్‌ ఇడ్లీ...

కావాల్సినవి: నూనె- మూడు చెంచాలు, జీలకర్ర- అర చెంచా, ఆవాలు, శనగపప్పు- చెంచా చొప్పున, ఇంగువ- చిటికెడు, కరివేపాకు- కొద్దిగా, పచ్చిమిరపకాయ, అల్లం ముక్క- ఒకటి చొప్పున (తరగాలి), క్యారెట్‌ తరుగు- రెండు పెద్ద చెంచాలు, పసుపు- పావు చెంచా, రవ్వ- కప్పు, పెరుగు- ముప్పావు కప్పు, కొత్తిమీర తరుగు- రెండు పెద్ద చెంచాలు, ఉప్పు- తగినంత, నీళ్లు- అర కప్పు, ఫ్రూట్‌సాల్ట్‌- పావు చెంచా, జీడిపప్పు పలుకులు- అయిదు.

తయారీ: పొయ్యి మీద కడాయి పెట్టి నూనె వేసుకోవాలి. అది వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఇంగువ, కరివేపాకు వేసి వేయించాలి. దీంట్లో పచ్చిమిరపకాయ, అల్లం తరుగు వేసి నిమిషం వేయించాలి. ఆ తర్వాత క్యారెట్‌ తరుగు, పసుపు జత చేసి రెండు నిమిషాలు కలపాలి. ఇందులోనే రవ్వ వేసి చిన్న మంటపై అయిదు నిమిషాలు దోరగా వేయించాలి. మంచి వాసన వచ్చిన తర్వాత దించి వేరే గిన్నెలోకి మార్చి చల్లార్చాలి. ఈ రవ్వలో పెరుగు, కొత్తిమీర తురుము, తగినంత ఉప్పు, నీళ్లు వేసి బాగా కలిపి ఇడ్లీ పిండిలా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పదిహేను నిమిషాలు పక్కన పెట్టాలి. ఆ తర్వాత మరోసారి కలిపి మరీ గట్టిగా ఉందనిపిస్తే కాసిన్ని నీళ్లు పోసి కలపాలి. పావు చెంచా ఫ్రూట్‌ సాల్ట్‌ కూడా వేసి కలపాలి. ఇప్పుడు ఇడ్లీ మూతకు నెయ్యి/నూనె రాసి జీడిపప్పు పలుకులు మధ్యలో పెట్టి తయారు చేసుకున్న రవ్వ మిశ్రమాన్ని ఇడ్లీల్లా వేసుకోవాలి. వీటిని కుక్కర్‌లో పెట్టి పావు గంట ఆవిరి మీద ఉడికించాలి. అంతే రుచికరమైన రవ్వ ఇడ్లీలు తయారై పోయాయి. వీటిని కొబ్బరి చట్నీతో తింటే వాహ్వా అనకుండా ఉండలేరు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని